"కొడుకు వల్ల బాలూగారు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.... ఆయన్ను పూర్తిగా దివాలా తీయించాడు...' అనే విమర్శల నుంచి ‘సంగీతం రాకపోయినా వాళ్ల నాన్నలానే ఎంత బాగా పాడు తున్నాడు. మాటా.. పాటా.. అచ్చంగా వాళ్ల నాన్నదే...' అనే ప్రశంస వరకూ ఎన్నో చూశా. అన్నింటికీ చిరునవ్వునే సమాధానంగా మార్చుకున్నానంటే దానికి ఒకవిధంగా నాన్న ఇచ్చిన ధైర్యమే కారణం. నేను బాధపడినప్పుడల్లా 'నువ్వు కష్ట పడుతున్నావు కానీ అనుకున్నంత గుర్తింపు రావడంలేదు. అయితే ప్రతిదానికీ ఓ టైం వస్తుంది... ఆ రోజు కోసం ఎదురు చూడాలంతే...' అని చెప్పేవారు నాన్న. దురదృష్టమో, అదృష్టమో తెలియదు కానీ పాడుతా తీయగా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం రావడం, స్వరాభిషేకంలో పాడటం... ఇవన్నీ ఆ టైంలో భాగమే అనుకుంటున్నా. ఇప్పుడు నాన్న ఉండుంటే ఎంత సంతోషించేవారో! ఎందుకంటే చిన్నప్పటినుంచీ నేను ఓ స్థాయికి వచ్చేవరకూ అమ్మానాన్నలు నా గురించి ఆలోచించని రోజు ఉండేది కాదు.
నేను పుట్టి పెరిగింది చెన్నైలోనే. ఉమ్మడి కుటుంబం కావడం వల్ల మా ఇల్లంతా ఎప్పుడూ హడావుడిగా ఉండేది. నాన్న పాటలతో బిజీగా ఉంటే అమ్మ ఇంటి బాధ్యతలన్నింటినీ చూసుకుంటూనే నన్ను చదివించేందుకు ప్రయత్నించేది. కానీ నేను చదువు విషయంలో అమ్మను బాగా సతాయించడంతో రోజూ దెబ్బలు తప్పేవి కావు. మార్కులు సరిగ్గా రాక పోవడంవల్ల ఏ స్కూల్లోనూ ఎక్కువరోజులు ఉండనిచ్చేవారు కాదు. దాంతో చెన్నైలోని దాదాపు అన్ని స్కూళ్లలోనూ చదివేశా. విచిత్రం ఏంటంటే... నాన్నకు నేనేం క్లాస్‌లో ఉన్నానో కూడా తెలిసేది కాదు. ఇంటి కెవరైనా వచ్చి 'పిల్లలు ఏం చదువు తున్నారూ...' అని అడిగితే మమ్మల్ని పిలిచి 'ఏ క్లాస్ చదువుతున్నావు రా' అని వాళ్ల ముందే అడిగేవారు. ఎప్పుడైనా అమ్మ పిల్లల విషయంలో ఏం పట్టించుకోవడం లేదని నాన్నతో గొడవపడితే అప్పటికప్పుడు పాత క్వశ్చన్ పేపర్‌ను తెప్పించి ఏవేవో అడిగి 'సారి తక్కువ మార్కులు వస్తే ఊరుకోను... అమ్మను సతాయించకు... సరిగ్గా చదువు' అనేవారంతే. ఇలానే నానా తంటాలు పడి టెన్త్ పూర్తిచేశాక ఇక్కడ ఉంటే నేను చదవననుకున్నారో ఏమో తెలిసిన వారి సాయంతో అమెరికా పంపించేశారు.
రెండేళ్లు ఖాళీగా ఉన్నా...
అమెరికా వెళ్లాక ఇంటికి దూరంగా ఉండటం కష్టంగా అనిపించింది. నాన్న కచేరీల కోసమని ఎప్పుడైనా వచ్చినా, అమ్మను మాత్రం చాలా మిస్సయ్యేవాడిని. అక్కడే ఎనిమిదేళ్లు ఉన్న నేను బీబీఏతోపాటూ ఫిలిం-టెలివిజిన్‌కు సంబంధించిన కోర్సూ చేశా. నా చదువు పూర్తయ్యాక సినిమా రంగంలోనే స్థిరపడాలని నిర్ణయించుకున్నాక ఓ ప్రొడక్షన్ కంపెనీ పెట్టాలనుకున్నా. ఎందుకంటే హాలీవుడ్‌లో అప్పుడప్పుడే గ్రాఫిక్స్ ప్రారంభమయ్యాయి. ఆ సాంకేతికతను ఇక్కడా పరిచయం చేయాలనుకున్నా. ఎలా చేయాలీ, ఏం చేయాలీ... అని ఆలోచిస్తున్న సమయంలో... ఓసారి డ్రైవరు రాకపోతే నాన్నను ప్రసాద్‌స్టూడియోస్‌లో దింపడానికి వెళ్లా. ఆ రోజు నాన్నా-ఇళయరాజా గారూ కలిసి 'పుణ్యవతి' అనే తమిళ్ సినిమాలో ఓ పాట పాడాలి. ఇళయరాజాగారు నన్ను చూసి 'పాట పాడతావా' అని అడిగారు. లేదని చెప్పినా 'ప్రయత్నించు' అంటూనే అప్పటికప్పుడు నా చేత కొన్ని లైన్లు పాడించారు. అది విడుదల కాలేదు కానీ... తరువాత ఆయనే కన్నడ సినిమాల్లో పాడించారు. దాంతో 'బాలూ గారి అబ్బాయి పాడుతున్నాడట' అనే ప్రచారం మొదలయ్యింది. అలా పాటల అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. వాటిల్లో కొన్ని హిట్టయ్యాయి కూడా. దాంతో పాటలు పాడాలా లేక నేను అనుకున్నట్లుగానే నిర్మాణ సంస్థను పెట్టాలా అనే సందిగ్ధతతో రెండేళ్లు గడిచిపోయాయి. నాన్నను సలహా అడిగితే సంగీతం నేర్చుకోమన్నారు. అప్పుడు నేను సంగీతం నేర్చుకుని ఉంటే మరో సింగర్‌ని అయ్యేవాడినేమో కానీ నా జీవితం మరోలా మలుపు తిరిగింది.
బాగా నష్టపోయాం...
ఇప్పుడు సముద్రఖని నటుడిగా స్థిరపడినా... ఒకప్పుడు అసోసియేట్ డైరెక్టర్‌గా ఉండేవాడు. నాకు అతను పరిచయం అవ్వడంతో ఇద్దరం తరచూ సినిమా కథల గురించి మాట్లాడుకునేవాళ్లం. అలా అతను రాసిన ఓ కథ నాకు బాగా నచ్చడంతో దాన్ని నాన్న దగ్గరకు తీసుకెళ్లా. ఆయనా బాగుందని చెప్పడంతో మా నిర్మాణ సంస్థ 'క్యాపిటల్ ఫిలిం వర్క్స్' ఆధ్వర్యంలో నేనే నిర్మాతగా 'ఉన్నై శరణడైందేవ్' సినిమా తీశా. దానికి రాష్ట్ర అవార్డులు వచ్చాయి కానీ లాభాలు పెద్దగా రాలేదు. ఆ తరువాత తెలుగులో వచ్చిన 'వర్షం'లో 'మెల్లగా కరగనీ..' పాట పాడే అవకాశం వచ్చింది. ఆ సినిమా నాకు బాగా నచ్చడంతో దాన్ని తమిళంలో తీయాలనుకున్నా. అదే విషయం నాన్నకు చెప్పి ఆ సినిమా రైట్స్‌ని కొనేశా. ఆ రోజుల్లోనే సినిమా కోసం డైబ్బైఅయిదు లక్షల రూపాయలు పెట్టాం. సినిమా పూర్తయ్యేకొద్దీ... బొమ్మ బాగా వస్తోంది, ఇంకాస్త డబ్బు పెట్టినా లాభాలు వస్తాయని కొందరు చెప్పడంతో ముందువెనకలు ఆలోచించకుండా ఖర్చుపెట్టా. అలా పెట్టిన డబ్బు పూర్తిగా పోయి నష్టాలు వచ్చాయి. దాంతో దాదాపు రెండేళ్లు ఖాళీగా ఉండిపోయా. ఆ సమయంలో నేనూ, వెంకట్‌ప్రభు అనే నటుడు, మరికొందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు రోడ్డుమీద క్రికెట్ ఆడే పిల్లల గురించి ఓ కథ తీయాలనే చర్చ మొదలైంది. నాన్నకు చెబితే ‘మళ్లీ సినిమా ఎందుకురా’ అన్నారు. ఈసారి నాకున్న పాత అనుభవాలతో చిన్న బడ్జెట్‌తోనే చెన్నై600028 తీశాం. అది హిట్టయ్యింది కానీ లాభాలు ఆశించినంత రాలేదు. అదయ్యాక 'అరణ్యకాండం' తీశా. ఆ సినిమాకు మూడు జాతీయ అవార్డులూ, న్యూయార్క్ ఏషియన్ ఫిలింఫెస్టివల్‌లో జ్యూరీ అవార్డూ వచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పేరు వచ్చింది కానీ పైసలే రాలేదు. ఆ పరిస్థితులూ యాదృచ్ఛికంగా జరిగిన కొన్ని సంఘటనలూ నన్ను మానసికంగా కుంగదీశాయి. అప్పటికే రెహమాన్, దేవిశ్రీప్రసాద్, హారిస్ జైరాజ్... వంటి సంగీత దర్శకులు తమ ఇళ్లల్లోనే స్టూడియోలను ఏర్పాటు చేసుకోవడంతో పెద్ద స్టూడియోలకు పని లేకుండా పోయింది. వాటిలో నాన్న కట్టిన కోదండపాణి స్టూడియోస్ కూడా ఒకటి. ఆ సమయంలో స్టూడియో బాధ్యతల్ని నేను చూస్తుండటం, దాన్నుంచి పెద్దగా ఆదాయం రాకపోవడంతో నాన్నా, నేనూ చర్చించుకుని ఆ స్టూడియోలో పనిచేసే కొందరికి మరోచోట ఉద్యోగం కల్పించాం. కొన్ని పరికరాలను జెమినీ వాళ్లకు ఇచ్చాం. ఓ వైపు నా సినిమాకు లాభాలు రాకపోవడం, స్టూడియోలో మార్పులు చేయడం చూసిన పత్రికలు... ‘‘బాలూగారు ఆస్తులు అమ్ముకుంటున్నారు. దానికి కారణం వాళ్ల అబ్బాయే’ అని రాశాయి!
కోలుకుంటూ ఉండగానే ఇలా!