ప్రజలు ఆసుపత్రుల ముందు పడకల కోసం ఎదురు చూస్తుంటే వాళ్లను అలా చూస్తూ నిద్రపోలేనని ప్రముఖ నటుడు సోనూసూద్ అన్నారు. రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమాలో చేయడం కంటే ప్రజలకు సేవ చేయడంలోనే ఎక్కువ సంతృప్తి ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కరోనా ఆపత్కాలంలో సోనూ.. ఎంతోమందికి సాయం చేసి ఆదుకుంటున్నారు. దీంతో ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా.. ట్విట్టర్ వేదికగా సోనూసూద్‌ను ట్యాగ్ చేస్తూ వేడుకుంటున్నారు. ఆయన కూడా సాధ్యమైనంత వరకూ అందరి విన్నపాలు పరిశీలించి తన టీమ్ సహాయంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా "అందరికీ సాయం చేయలేకపోతున్నాన.. నా నుంచి సాయం అందనివారు క్షమించాలి" అని ఆయన పలుమార్లు కోరడం ఆయనకున్న విశాల హృదయానికి ఒక నిదర్శనం. వృత్తిపరంగా సినిమాల్లో బిజీగా ఉండే సోనూ.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పేదలను ఆదుకుంటున్నారు. కాగా.. తాజాగా ఆయన ఒక ట్వీట్ చేశారు.
"అర్ధరాత్రి మీకోసం ఎన్నో ఫోన్‌కాల్స్ చేస్తున్నా. అవసరమైన వారికి పడకలు, ప్రాణవాయువు అందిస్తూ కొద్దిమంది ప్రాణాలైనా కాపాడగలిగితే.. అది రూ.100 కోట్ల చిత్రంలో పనిచేయడం కంటే లక్షల రెట్లు ఎక్కువ సంతృప్తినిస్తుంది. పేదలు పడకల కోసం ఆసుపత్రుల ముందు ఎదురుచూస్తుంటే నేను హాయిగా నిద్రపోలేను"
-సోనూసూద్, నటుడు
కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ ఎవరి ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ సోనూసూద్ మాత్రం పేదలను ఆదుకునేందుకు నడుం కట్టారు. అలా.. రీల్ లైఫ్‌లో విలన్ కాస్తా.. రియల్ లైఫ్ హీరోగా మారారు. కరోనా లాక్‌డౌన్‌లో ఎంతోమందిని ఆదుకున్నారాయన. వలసకార్మికులను ప్రత్యేక విమానాల్లో వాళ్లను సొంత గూటికి చేర్చి వారికి దేవుడయ్యారు. ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించారు. డబ్బు అవసరం ఉన్న వారికి సాయం చేశారు. జబ్బు చేసినవారికి చికిత్స చేయించారు. కరోనా సెకండ్ వేవ్‌లోనూ అవసరం ఉన్నవారికి ఆక్సిజన్, వెంటిలేటర్లు, బెడ్లు, ప్లాస్మా అందించేందుకు ఇలా ఆయన చేస్తున్న సేవలు కోకొల్లలు. అందుకే ఆయనను ప్రజలు కూడా గుండెల్లో పెట్టుకొని గుడికట్టుకొని పూజిస్తున్నారు. కొంతమంది తమ పిల్లలకు సోనూసూద్ పేరు పెట్టుకొని కృతజ్ఞత చాటుతున్నారు.