అహింసతోనే స్వేచ్ఛను సాధించొచ్చని నిరూపించిన మహానేత మహాత్మాగాంధీ(mahatma gandhi birthday). ఆయన స్ఫూర్తితో తెలుగులో 'నేటి గాంధీ', 'శంకర్‌దాదా జిందాబాద్', 'మహాత్మ' లాంటి పలు సినిమాలు తెరకెక్కాయి. మన సినీ కవులు తమ కలాలతో గాంధీని కీర్తించారు. సమకాలీన సమాజానికి గాంధీ(Gandhi songs in telugu), ఆయన భావజాలం ఆవశ్యకతను తెలుగు ప్రేక్షకులకు తెలిపే ప్రయత్నం చేశారు. ఇవాళ ఆ బోసినవ్వుల బాపూజీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనపై వచ్చిన టాలీవుడ్ గీతాలేంటో చూద్దాం.
దండియాత్రనే దండయాత్రగా చేసిన జగజ్జేత
'మహాత్మ'లోని(mahatma songs) 'రఘుపతి రాఘవ రాజారాం' అంటూ సాగే పాట ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. 'మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా..గాంధీ, మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్ఫూర్తి' అని మహాత్ముడి జీవిత స్ఫూర్తిని నూరిపోసిన పాటిది. 'గుప్పెడు ఉప్పును పోగేసి, నిప్పుల ఉప్పెనగా చేసి, దండియాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత' అని అహింస మార్గంలో ఆయన చేసిన పోరాటాలను గుర్తుచేస్తుంది. గాంధీ గొప్పతనాన్ని తెలియజేసే ఈ పాటకి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. దివంగత గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గాత్రంతో.. ప్రేక్షకుల్లో దేశభక్తి నింపారు.
ఓ బాపూ నీ సాయం మళ్లీ కావాలి
మాస్, మెలోడి గీతాలతో యువతను ఆకట్టుకునే సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్. 'శంకర్‌దాదా జిందాబాద్'లో(shankar dada zindabad) మహాత్మాగాంధీ స్ఫూర్తిని తెలిపే అద్భుతమైన పాటనందించారు. 'ఓ బాపూ నువ్వే రావాలి' అంటూ సాగే ఆ గీతం గాంధీయిజం ఆవశ్యకతను తెలియజెప్పింది. ఆవేశం, కోపం కాదు, చిరునవ్వే మన ఆయుధం అంటూ అహింసా మార్గాన నడవాలని హితబోధ చేస్తుందీ పాట. సమాజంలో జరుగుతున్న అరాచకాలను ఆపేందుకు బాపూ నువ్వే రావాలి, నీ సాయం మళ్లీ కావాలి అని రచయిత సుద్దాల అశోక్‌తేజ చైతన్యవంతమైన సాహిత్యం అందించారు. అదే స్థాయిలో ఈ పాటను ఆలపించి గాంధీపై ప్రేమను చాటుకున్నారు సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్, గాయకుడు సాగర్.
రావయ్యా బాపూజీ, మళ్లీ జన్మించి..
ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడుగా వచ్చిన చిత్రం 'నేటి గాంధీ'(neti gandhi movie cast). తెల్లదొరల చెర నుంచి దాస్యపు సంకెళ్లు తెంచి స్వాతంత్ర్యం తెచ్చావు. కానీ ఇప్పుడది అంధకారం పాలైంది. అందుకే బాపూజీ, దివి నుంచి మళ్లీ జన్మించి రావయ్య అని గాంధీని వేడుకొనే వాక్యాలు కదిలిస్తాయి. సమాజంలో జరుగుతున్న అకృత్యాలను ఆపడానికి బాపు మళ్లీ జన్మించాలని కథానాయిక రాశీ కోరుకుంటారు. ఇందులో గాంధీ జయంతి గురించి చెప్పే మరో అపూర్వమైన పాట ఉంది. వేటూరి సాహిత్యం, మణిశర్మ సంగీతం అందించారు.