తన సంగీతంతో ఉర్రూతలూగించిన పాప్ సింగర్ డఫీ... తన జీవితానికి సంబంధించిన ఓ బాధాకర విషయాన్ని బయటపెట్టింది. 2009లో గ్రామీ విజేతగా నిలిచిన ఆమె.. ఆ తర్వాత అత్యాచారానికి గురైందని తెలిపింది. గత దశాబ్ద కాలంగా తన జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచానికి చెప్పడానికి ఇప్పటివరకూ సరైన మార్గం కనిపించలేదని, ఇప్పుడిప్పుడే తన జీవితం కుదుటపడిందని ఇన్‌స్టా వేదికగా ఆమె పేర్కొంది.
"చాలారోజులు సంగీతానికి దూరంగా ఉండటానికి కారణలేంటని నన్ను అభిమానులు ప్రశ్నించారు. మీకూ ఆ అనుమానం రావచ్చు. నా జీవితంలో ఓ చేదు సంఘటన వల్ల నేను సంగీత ప్రపంచానికి దూరమయ్యాను. ఒకానొక సమయంలో నేను దారుణ అత్యాచారానికి గురయ్యాను. అంతేకాదు.. నాకు మాదకద్రవ్యాలు ఇచ్చి కొంతకాలం పాటు నన్ను బందీగా ఉంచారు. ఆ ఘోరం నుంచి కోలుకోవడానికి నాకు చాలాకాలం పట్టింది. ఆ ఘటన తర్వాత నేను నా గొంతుతో ఎలా పాడగలనని ప్రశ్నించుకున్నాను. బాధను వ్యక్తం చేసేందుకు నా గొంతును ఎందుకు ఉపయోగించుకోలేదని మీరు ప్రశ్నించవచ్చు. కానీ బాధను నా కళ్లలో ప్రపంచానికి చూపించడం నాకు ఇష్టం లేదు. అందుకే మీ ముందుకు రాలేకపోయా. ఇప్పడిలా చెప్పడం సరైందో కాదో నాకు తెలియదు. కానీ, నన్ను నమ్మండి. ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నాను. సురక్షితంగా జీవిస్తున్నాను" అని ఆమె పేర్కొంది.