కేవలం విజయంలోనే సంతోషం ఉండదని.. చూసే మనసు ఉంటే ప్రతి విషయంలోనూ ఆనందం దాగి ఉంటుందని అగ్ర కథానాయిక సమంత అన్నారు. 'యువర్ లైఫ్'లో భాగంగా ఆమె 'రిలేషన్‌షిప్ గోల్స్' గురించి ముచ్చటించారు. జీవితం, బంధాలు, సంతోషం, లాక్‌డౌన్.. తదితర అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఆ విశేషాలు చూద్దాం..
కొవిడ్ మీ బంధాలపై ఎలాంటి ప్రభావం చూపింది?
సమంత: నా వృత్తిలో ఖాళీ సమయం దొరికేది కాదు. కానీ లాక్‌డౌన్ వల్ల ఎంతో బ్రేక్ దొరికింది. బంధాల్ని పెంచుకోవడానికి ఈ కొవిడ్ తోడ్పడింది.
లాక్‌డౌన్ ఎలాంటి విలువల్ని నేర్పింది?
సమంత: సాధించడమే విజయం అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నా అభిప్రాయం మారింది. విజయం ఇంట్లోనూ ఉంటుందని అర్థమైంది. సంతోషంగా ఉంటూ, ప్రియమైన వారు ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రశాంతంగా ఉండటం కూడా గొప్ప విజయం.
షూటింగ్స్ ఆగిపోయిన తర్వాత మీలో స్ఫూర్తి నింపిన విషయాలు?
సమంత: సినిమా సక్సెస్‌లు మాత్రమే నాలో స్ఫూర్తి నింపుతాయని.. ఇంకా శ్రమించి ముందుకు తీసుకెళ్తాయని అనుకున్నా. కానీ మొక్కలు (పెంచడం) కూడా నాలో ప్రేరణ కలిగించగలవని తెలిసింది. రోజూ ఉదయాన్నే నిద్రలేచి గార్డెన్ వద్దకు పరుగులు తీసి.. మొక్కలు ఎంత వృద్ధి చెందాయో చూసేదాన్ని (నవ్వుతూ). మనలో స్ఫూర్తినింపే విషయాలు చుట్టూ ఎన్నో ఉంటాయి. ఆ అందం ప్రతి దానిలోనూ ఉంటుంది. మీరు ఓ క్షణం ఆగి, గమనిస్తే.. సంతోషం, ప్రశాంతత కనిపిస్తాయి.
షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి మిమ్మల్ని మీరు ఎలా సిద్ధం చేసుకుంటున్నారు?
సమంత: నా పనిని నేను అంకిత భావంతో చేస్తూ.. ఎంజాయ్ చేయాలి అనుకుంటా. సంతృప్తి ఇవ్వని పని చేయకూడదని నాకు నేను ప్రమాణం చేసుకున్నా. ప్రతి రోజు చేసే పనిలో సంతృప్తి ఉండాలి. అదే నా సూత్రం.
కరోనా కాలంలో దేశం కోసం మీ వంతుగా ఏం చేశారు?
సమంత: ఈ కష్టకాలంలో ప్రజలు ఒకరికొకరు సాయం చేసుకున్నారు. అది నాలో స్ఫూర్తి నింపింది. చిత్ర పరిశ్రమలోని కార్మికుల కోసం నా వంతు సాయం చేశా. అదే విధంగా నా ఎన్జీఓ 'ప్రత్యూష' కోసం పనిచేస్తున్నా.
మిమ్మల్ని సంతోషంగా ఉంచే అంశం?
సమంత: ప్రతిరోజు ఉదయాన్నే ప్రాణాలతో నిద్రలేవడం. సంతోషంగా ఉండటానికి ఈ కారణం సరిపోతుంది.