తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అప్పట్లో గరిటె పట్టుకుని తిప్పలు పడ్డా: రవితేజ - రవితేజ డిస్కోరాజా

వెండి తెర చేసిన అల్లరి 'ఆటోగ్రాఫ్‌'... రవితేజ! సినిమాలో వెటకారానికి ‘కిక్‌’ ఇచ్చిన కథానాయకుడు. హీరోయిజానికి ‘హుషారు’ నేర్పి... కొత్త నిర్వచనం ఇచ్చిన నటుడు. తనకు ఏ పాత్ర అప్పగించినా తన మేనరిజం.. మనదై పోతుంది. సినిమా చూస్తున్న కాసేపూ.. ఆ చిలిపితనం మనకొచ్చేస్తుంది. అందుకే ఆయన మనలో ఒకడైపోయాడు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటూ, జయాపజయాల్ని ఒకేలా తీసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ రవితేజ త్వరలోనే ‘డిస్కోరాజా’గా పలకరించబోతున్నాడు. ఈ సందర్భంగా అతడు పంచుకున్న విశేషాలు చూద్దామా..

ravi teja disco raja
అప్పట్లో గరిటె పట్టుకుని తిప్పలు పడ్డా: రవితేజ

By

Published : Jan 19, 2020, 8:27 AM IST

'రాజా ది గ్రేట్'​ తర్వాత మరో హిట్​ కోసం ఎదురుచూస్తున్న మాస్​ మహారాజ్​ రవితేజ త్వరలో 'డిస్కోరాజా'గా అలరించనున్నాడు. ఇందులో రవితేజ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ కనిపించనున్నారు. వి.ఐ. ఆనంద్‌ దర్శకుడు. తమన్‌ స్వరాలు అందించాడు. జనవరి 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా బాల్యం, కుటుంబం... ఇలా అనేక విషయాలు పంచుకున్నాడు.

సంక్రాంతి పండుగ ఎలా గడిచింది?

మా ఇంట్లో పండుగలన్నీ బాగా జరుగుతాయి. పైగా సంక్రాంతి కదా. ఇంకాస్త ఘనంగానే ఉంటుంది. 'డిస్కో రాజా' విడుదల సమయం దగ్గర పడింది. హడావిడి ఇంకాస్త ఎక్కువైంది.

ఈమధ్య కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టున్నారు?

నేను ముందు నుంచీ అంతే. కాకపోతే అది కాస్త ఎక్కువైంది. ఆరు దాటితే ఈ రవితేజ పూర్తిగా మారిపోతాడు. వాడు వేరే రకం. సినిమాల గురించి అస్సలు మాట్లాడను. ఆలోచించను. స్విచాఫ్‌ అయిపోతాను. పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్లతో మరికాస్త సమయం గడపాలనిపిస్తుంది. టీవీ చూడటం, వర్కవుట్‌ చేయడం, కుటుంబానికి సమయం కేటాయించడం.. నాకు తెలిసింది ఇంతే.

సినిమాలో, బయట చాలా హుషారుగా ఉంటారు. చిన్నప్పటి నుంచీ అంతేనా?

అవును. నేనింతే. 'ఒక్కచోటా కుదురుగా ఉండవు కదా' అని చిన్నప్పుడు అమ్మ నన్ను తిడుతూనే ఉండేది. వయసుతో పాటు కాస్త మెచ్యూరిటీ వచ్చినా హుషారు తగ్గలేదు. నెగిటివ్‌ ఆలోచనలు ఉన్న చోట ఒక్క క్షణమూ ఉండలేను. దేన్నీ సీరియస్‌గా తీసుకోలేను. నేనెవరికీ సలహాలు ఇవ్వను. ఒకరిచ్చినా తీసుకోను. 'అరె.. ఆ క్షణంలో ఇలా చేయలేకపోయానే', 'ఇలా ఎందుకు చేశాను' అని బాధ పడను.

మాస్​ మహారాజ్​ రవితేజ

జయాపజయాలు ఒకేలా తీసుకోవడం మీకెలా కుదురుతోంది?

సినిమా హిట్టయితే అందరికీ సంతోషమే. దాన్ని అంత వరకే తీసుకోవాలి. అంతే తప్ప భుజాలు ఎగరేయకూడదు. ఫ్లాప్‌ అయితే.. కుమిలిపోకూడదు. 'తర్వాత ఏంటి?' అని ఆలోచించాలి. నేను అదే చేస్తా. నా సినిమా చూసొచ్చాక.. 'రవి అక్కడ బాగా చేశాడు' అని జనం చెప్పాలి. నా గురించి నేను చేసిన పని మాట్లాడాలి. నేను కాదు.

మీ నాన్న మిమ్మల్ని ఎలా పెంచారు? పిల్లల్ని మీరెలా చూసుకుంటున్నారు?

జనరేషన్‌ మారింది కదా? అన్నీ మారుతుంటాయి. చిన్నప్పుడు మా నాన్న నన్ను చితగ్గొట్టేసేవారు. నా అల్లరి అలా ఉండేది. మాది మధ్యతరగతి కుటుంబం. పైగా పెద్ద కుటుంబం. సంసారాన్ని ఈదుకు రావడమే కష్టం. అలాంటిది.. నేను సినిమాలు, షికార్లు అంటే ఊరుకుంటారా? వాళ్ల కోపంలోనూ తప్పు లేదు.

ఓ తండ్రిగా నా పెంపకం వేరు. నా పిల్లల్ని ఎప్పుడూ స్నేహితుల్లానే చూస్తున్నాను. నన్నూ వాళ్లు అలానే చూస్తారు. 'ఇది చదవండి.. ఇలా చదవండి' అని చెప్పలేదు, నాకు మార్కులు, ర్యాంకులు అవసరం లేదు. చదువుని ఆస్వాదించండి చాలు.. అని చెబుతుంటాను. ఇప్పుడు కష్టపడితే మున్ముందు జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి నేనే పెద్ద ఉదాహరణ. కాబట్టి.. తప్పు చేయరన్న నమ్మకం నాది.

అమ్మకూ నాలానే సినిమా పిచ్చి...

ఇంటిని సరిదిద్ది, మమ్మల్ని నడిపించడంలో మా అమ్మదే కీలక పాత్ర. మా ఇంట్లో తనే పవర్‌. తనకూ నాలానే సినిమాలంటే చాలా ఇష్టం. 'నా పిచ్చే నీకు పట్టుకుందిరా' అంటుండేవారు. పిల్లలు, నా భార్య నాలానే ఆలోచిస్తుంటారు. నేనింత కూల్‌గా హ్యాపీగా ఉండగలుగుతున్నానంటే కారణం నా కుటుంబమే.

డిస్కోరాజాలో రవితేజ

మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు, మీ పిల్లలు అలా కాదు కదా? వాళ్లకు డబ్బు విలువ తెలుసా?

తెలిసేలా చేశాం. ఈ విషయంలో క్రెడిట్‌ అంతా మా అమ్మకే ఇవ్వాలి. ఎందుకంటే పిల్లల బాగోగులు అన్నీ అమ్మే చూసుకుంటుంది. వాళ్లకు డబ్బు, మనుషులు, కష్టం విలువ ఎప్పుడూ చెబుతుంటుంది. విలాసాలు అస్సలు అలవాటు చేయలేదు. వాళ్లకు మోటర్‌ సైకిళ్లు, కార్లూ కొనిపెట్టలేదు. ఇప్పటికీ స్కూలు బస్సులోనే ప్రయాణం చేస్తుంటారు.

చిన్నప్పుడు మీ కలలు ఎలా ఉండేవి?

నాకు ఊహ వచ్చినప్పటి నుంచీ సినిమా తప్ప రెండో ప్రపంచం తెలీదు. రోజుకి ఓ సినిమా చూస్తే.. భలే అనిపించేది. రోజుకి నాలుగు సినిమాలు చూసిన సందర్భాలూ ఉండేవి. అదే నాకు కిక్‌. అంతకు మించి ఏ ఆలోచనలు, ఆశలూ ఉండేవి కావు.

మరి సినిమాలకు డబ్బులు ఎలా సంపాదించేవారు?

నాన్న పాకెట్‌ మనీ ఇచ్చేవారు. దాన్ని జాగ్రత్తగా దాచుకునేవాడిని. అది అయిపోతే అమ్మ బ్యాగులోంచి చిల్లర కొట్టేసేవాడిని. పాపం.. అమ్మకి లెక్కలు తెలీవు. డబ్బులు లెక్కపెట్టుకునేది కాదు. అది నాకు ప్లస్‌ అయ్యేది.

జీవితంలో మర్చిపోలేనంత కిక్‌ అనుభవించిన రోజు?

సింధూరం తరవాత.. ఓ షూటింగ్‌ పనిమీద విశాఖపట్నం వెళ్లాను. అక్కడ ఒకతను 'మీ సినిమా చూశాను సార్‌.. బాగా చేశారు. మీలాంటివాళ్లే పరిశ్రమలోకి రావాలి సార్‌.. వస్తే తప్పకుండా సాధిస్తారు' అన్నాడు. ఆ మాటలు నాలో చెప్పలేనంత నమ్మకాన్ని కలిగించాయి. అలానే 'ఇడియట్‌' విడుదలైన రోజు ఎప్పటికీ మర్చిపోలేను. హైదరాబాద్‌లోని గోకుల్‌ థియేటర్‌ ఎదురుగా ఉన్న గుళ్లో షూటింగ్‌కు కార్లో వెళ్తుంటే... థియేటర్‌ దగ్గర ఎక్కువ జనం. 'ఏంటి.. ఈ జనమంతా నా సినిమాకేనా?' అని ఆశ్చర్యం వేసింది. కారుని యూటర్న్‌ చేసుకుని వెనక్కి వచ్చి థియేటర్‌ వైపు పరిశీలనగా చూశాను. వాళ్లంతా నాకోసమే వచ్చారు. ఆ రోజు చాలా కిక్‌ వచ్చింది.

మీ ఇద్దరు తమ్ముళ్లతో అనుబంధం ఎలా ఉండేది? వాళ్లు జీవితంలో సరిగా ఎదగలేకపోయారన్న బాధ ఉండేదా?

ఓ ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారంటే.. ఆ హడావిడి ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. కొట్టుకోవడం, తిట్టుకోవడం మామూలే కదా? మేమూ అంతే. చిన్నప్పుడు నా అల్లరైతే భరించలేనంత స్థాయిలో ఉండేది. 'అప్పుడు నువ్వు అలా చేశావ్‌..' అని అమ్మ అంటుంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. 'నేనేంటి? మరీ అంత అల్లరోడినా' అని అనిపిస్తుంటుంది. తమ్ముళ్లు నాకంటే బాగా చదివేవాళ్లు. ఇక వాళ్ల కెరీర్‌ అంటారా? ప్రతిభకు సమయమూ కలిసి రావాలి కదా!

బుద్ధి సరిగా ఉంటే చాలు

దేవుడిపై నమ్మకం లేదు. గుళ్లకు వెళ్లను. పూజలు చేయను. వాస్తు పట్టింపులేమాత్రం లేవు. మనసు, బుద్ధి సరిగా ఉంటే అన్నీ బాగుంటాయి. కానీ ఈ సృష్టిని నడిపిస్తున్న ఓ శక్తి ఉందని మాత్రం గట్టిగా నమ్ముతాను. మా అమ్మ మాత్రం పూజలు, వ్రతాలూ బాగానే చేస్తుంటుంది.

ఇంటి భోజనం అంటే ఇష్టం కదా?

అవును. ఇంటి భోజనమే తింటాను. హైదరాబాద్‌లో షూటింగ్‌ అంటే భోజనం సమయానికి ఇంటికి వెళ్లిపోవాల్సిందే. అవుట్​డోర్​ షూటింగ్‌ అన్నప్పుడు నాతో పాటు చెఫ్‌ని తీసుకెళ్తా. కొంచెం తిన్నా, ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోవాలి. నాన్‌ వెజ్‌ దాదాపుగా మానేశాను. అమ్మ ప్రేమగా వండి పెడితే మాత్రం అప్పుడప్పుడూ రుచి చూస్తుంటా. కెరీర్​ మొదట్లో గరిటె పట్టుకుని కాస్త తిప్పలు పడ్డాను. ప్రస్తుతం వంట కొద్ది కొద్దిగా వచ్చు.

జీవితంలో తీసుకున్న ఉత్తమ నిర్ణయం ఏమిటి?

నేనే ఏ నిర్ణయమైనా చక చక తీసేసుకుంటా. పెద్దగా ఆలోచించను. మంచో చెడో నేనే అనుభవిస్తాను. అయితే ఇప్పుడు నా ఆలోచన కాస్త మారింది. మరీ ముఖ్యంగా వృత్తి జీవితానికి వచ్చేసరికి.. సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. 'ఐ హ్యావ్‌ డన్‌ విత్‌ ద క్రాప్‌' అనే డైలాగ్‌ 'డిస్కోరాజా'లో ఉంది. అదే ఇప్పుడూ చెబుతున్నాను. ఇక మీదట నా నుంచి చెత్త సినిమాలు రావు. మంచి సినిమాలే చేస్తా. హిట్టూ, ఫ్లాపూ అనేవి వేరే విషయాలు. అవి మన చేతుల్లో ఉండవు. నేను నమ్మకంగా చేసిన సినిమాలేవీ నన్ను నిరాశ పరచలేదు.

ఇళయరాజా పాటలతో జిమ్‌

మనిషిని చూస్తే 'వీడు జిమ్‌ చేస్తుంటాడు' అనిపించాలి. అంతే తప్ప 'వీడు జిమ్‌లోనే ఉంటాడు' అనిపించకూడదు. నేను ఫిట్‌గా ఉండడానికి కావల్సిన కసరత్తులన్నీ చేస్తాను. నా వర్కవుట్‌ స్టైల్‌ చాలా కొత్తగా ఉంటుంది. ఎవరైనా ఫాస్ట్‌ బీట్‌ పాటలు పెట్టుకుని ఎక్సర్‌ సైజులు చేస్తుంటారు. నేనైతే ఇళయరాజా పాటలు పెట్టుకుని జిమ్‌ చేస్తుంటా. సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువగా ఇళయరాజా పాటలు వింటుంటా.

ABOUT THE AUTHOR

...view details