Rashmika Mandanna: 'పుష్ప'తో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న భామ రష్మిక. టాలీవుడ్, బాలీవుడ్‌ల్లో వరుస ప్రాజెక్ట్‌లతో ప్రస్తుతం కెరీర్‌లో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మపై ఎంతోమంది యువత మనసు పారేసుకుంటున్నారు. పలువురు నెటిజన్లు ఆమెను ఆరాధిస్తూ పోస్టులూ పెడుతున్నారు. ఆమె ఎలాంటి వ్యక్తిని ఇష్టపడుతుందో తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, రష్మిక ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు కాబోయే వ్యక్తి ఎలా ఉండాలో చెప్పింది.
'ప్రేమను వర్ణించడం కష్టం. ఎందుకంటే అది పూర్తిగా భావోద్వేగాలకు సంబంధించింది. నా దృష్టిలో ప్రేమంటే.. ఒకరికొకరు గౌరవం, సమయాన్ని ఇచ్చిపుచ్చుకోవడం. ఒకరిపై మరొకరికి పూర్తి నమ్మకం ఏర్పడటం. ఈ భావోద్వేగాలన్నీ రెండు వైపుల నుంచి ఉన్నప్పుడే వాళ్ల ప్రేమ విజయం సాధిస్తుంది. కేవలం ఒక వ్యక్తి నుంచే ఉంటే అది ఎలా సక్సెస్ అవుతుంది' అని ఆమె పేర్కొంది. అనంతరం వివాహంపై స్పందిస్తూ.. 'పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్? అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే నేను ఇంకా పెళ్లి గురించి ఆలోచించలేదు. ఎందుకంటే, నేనింకా చిన్నపిల్లనే. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, మనం ఎవరితోనైతే సంతోషంగా, సురక్షితంగా ఉంటామో వాళ్లనే జీవిత భాగస్వామిగా ఎంచుకుంటే బాగుంటుంది' అని రష్మిక తన మనసులోని మాట బయటపెట్టింది.