Prabhas: బాలీవుడ్‌లో చారిత్రక కథాంశాలకు చిరునామాగా నిలుస్తున్న దర్శకుడు ఓం రౌత్. 'తానాజీ' వంటి హిట్ తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ఆదిపురుష్'. ప్రభాస్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. రామాయణ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాని.. రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో లంకేష్‌గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.. జానకి పాత్రలో కృతి సనన్ కనిపించనుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఓం రౌత్ 'ఈనాడు సినిమా'తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
మీ గత చిత్రం 'తానాజీ'తో ప్రేక్షకుల్ని చరిత్రలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు 'ఆదిపురుష్'తో రామాయణ కాలానికి తీసుకెళ్తున్నారు. ఇలాంటి కథలే ఎంచుకోవడానికి కారణమేంటి?
"చిన్నప్పటి నుంచి విన్న కథలు.. చదివిన పుస్తకాల వల్ల చరిత్ర తాలూకూ ప్రభావం నాపై చాలా ఉంది. ఆ చరిత్రలోని వీరగాథల్ని.. స్ఫూర్తిదాయక కథల్ని ప్రేక్షకులకు చెప్పడమంటే నాకిష్టం. ఎందుకంటే మనమెవరు? ఎక్కడి నుంచి వచ్చాం? మన దేశ గొప్ప తనమేంటి? సంస్కృతి సంప్రదాయాలేంటి? ఈ నేల కోసం పోరాడిన యోధులెవరు? అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మన దేశ చరిత్రను, సంస్కృతిని చూసి గర్వపడాలి. అందుకే నా కథలన్నీ వాటిలో నుంచే తీసుకుంటుంటా. నా తొలి మరాఠి చిత్రం 'లోకమాన్య' చారిత్రక కథాంశంతో తెరకెక్కినదే".
రామాయణం నేపథ్యంలో వెండితెరపై ఇప్పటికే చాలా చిత్రాలొచ్చాయి. 'ఆదిపురుష్'తో కొత్తగా ఏం చూపించనున్నారు?
"కొత్తగా నేనేం చూపించానన్నది తెరపై చూస్తేనే మీకర్థమవుతుంది. దాన్ని మాటల్లో వర్ణించడం చాలా కష్టం. నేను ఒకటైతే చెప్పగలను.. ఇది 7వేల ఏళ్ల క్రితం జరిగిన కథ. వాల్మీకి రామాయణాన్ని నాదైన కోణం నుంచి చూపించనున్నా. అలాగని ఇందులో మొత్తం రామాయణాన్ని ఏమీ చూపించడం లేదు. ఎందుకంటే అంత పెద్ద ఇతిహాసాన్ని సమగ్రంగా మూడు గంటల్లో చూపించడం చాలా కష్టం. అందుకే రామాయణంలోని ఓ కీలక భాగాన్నే 'ఆదిపురుష్'లో చూపించనున్నా. అదేంటనేది నేనిప్పుడే చెప్పను.. తెరపై చూడాల్సిందే (నవ్వుతూ)".
అందరూ ప్రభాస్‌ని ఇప్పటి వరకు యాక్షన్ హీరోగా, లవర్‌బాయ్‌గానే చూపించారు. ఆయన్ని రాముడిగా చూపించాలని మీకెందుకనిపింది?
"స్క్రిప్ట్ రాసుకున్నాక.. 'ఆదిపురుష్' పాత్రకు నా మదిలో కనిపించిన రూపం ప్రభాస్ మాత్రమే. ఒకవేళ ఆయనీ ఈ పాత్ర చేయనంటే.. నేను సినిమానే చేసేవాడిని కాదు. ఎందుకంటే ఈ పాత్ర చేయాలంటే స్వచ్ఛమైన మనసున్న నటుడు కావాలి. ఆ స్వచ్ఛత.. కల్మషంలేని వ్యక్తిత్వం అతని కళ్లలో ప్రతిబింబిస్తుండాలి. ఈ లక్షణాలన్నీ నాకు ప్రభాస్‌లోనే కనిపించాయి. అందుకే ఆయన్ని తప్ప మరొకరిని ఊహించుకోలేకపోయా. నిజంగా కథ విన్నాక.. ఆయన చేయనని చెబితే స్క్రిప్ట్ పక్కకు పెట్టేద్దామనుకున్నా. అదృష్టవశాత్తూ నాకు అవకాశం ఇవ్వలేదు".
ఈ సినిమాని ప్రత్యేకంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలోనే చిత్రీకరించడానికి కారణమేంటి?