'అంతా బాగుంటం రా' అంటూ తన పాటతో భరోసాను, ధైర్యాన్ని ఇస్తున్నారు యువ కథా నాయకుడు మంచు మనోజ్. కరోనాపై ఆయన పాడిన పాటతో కూడిన వీడియోని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ పాటని తన మేనకోడలు విద్యా నిర్వాణతో కలిసి పాడారు మనోజ్. ఈ సందర్భంగా ఆయనతో 'ఈనాడు సినిమా' ముచ్చటించింది.
''పాటలంటే నాకు ప్రత్యేకమైన ఆసక్తి. అవి వేగంగా చేరువవుతాయి. కరోనాతో అందరిలోనూ భయం ఏర్పడింది. భవిష్యత్తుపై బెంగ పడుతున్నవాళ్లు మనలో చాలామంది. ఈ సమయంలో ధైర్యం అందించడానికి ఓ పాట చేస్తే బాగుంటుందనిపించింది. సంగీత దర్శకుడు అచ్చు రాజమణి నా సొంత సోదరుడితో సమానం. 'అహం బ్రహ్మాస్మి' చిత్రం కోసం మేం కలిసి పని చేస్తున్నాం. తనకి కరోనాపై పాట చేద్దామని చెప్పగానే బాణీ ఇచ్చాడు. కాసర్ల శ్యామ్ చక్కటి పాట రాశారు. కెమెరామెన్ సన్నీ సలహాలు తీసుకుంటూ మా ఇంట్లోవాళ్ల సహాయంతో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాం. మా మేనకోడలు విద్యా నిర్వాణ కూడా పాడింది. మూడేళ్ల తర్వాత కెమెరా ముందుకొచ్చాను కాబట్టి కొంచెం తడబడ్డా కానీ, విద్యా సింగిల్ టేక్‌లో చేసింది''.
లోకమంతా ఒకటే కష్టం
''జీవితం ఒక పరీక్ష. ఇప్పుడు అందరం ఒకే కష్టంలో ఉన్నాం. దాని గురించి లోకమంతటికీ తెలుసు కాబట్టి ఒక మనిషి, ఇంకో మనిషికి సాయం చేసేందుకు ముందుకొస్తాడు. ఇప్పుడు అదే జరుగుతోంది. అయితే మనుషులే కాదు, మన చుట్టూ ఉన్న జీవుల గురించీ ఆలోచించాలి. వీధి కుక్కలకి ఇప్పుడు ఆహారం ఏం పెడదాంలే అనుకుంటే, వాటికి ఏమీ దొరక్క మనుషుల్ని పీక్కుతింటాయి. ఈ భూమి మీద మనతో పాటు సమస్త జీవరాశులూ బతకాలి''.
వంటగది వైపు రావొద్దు..
''ఇప్పుడు నేను కూడా అందరిలాగే ఇంట్లో టీవీ, వెబ్ సిరీస్‌లతో కాలక్షేపం చేస్తున్నా. వంటింట్లోకీ వెళ్తుంటా. ఆమధ్య ఒక వంటకం చేశా. 'రుచిగానే ఉంది కానీ, మళ్లీ ఇటువైపు రాకు' అంది మా అమ్మ. నాది పెద్ద చెయ్యి కదా, వంటింట్లో వస్తువులన్నీ ఎక్కువగా వాడేస్తుంటా. దాంతోపాటు వంట చేసేటప్పుడు ఏ వస్తువు ఎక్కడ పెడుతుంటానో తెలియదు. అవన్నీ వెతుక్కుని, మళ్లీ వంట గదిని ఓ కొలిక్కి తీసుకురావాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే 'నేనే చేసి పెడతా, నువ్వేం కష్టపడకు' అంటుంది అమ్మ''.