కరోనా సెకండ్ వేవ్ పట్ల ప్రజలంతా బాధ్యతగా ఉండాలని సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కోరారు. ఇప్పుడున్న పరిస్థితి ప్రతి ఒక్కరికి సవాలుతో కూడుకున్న విషయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ సూచనలు తప్పక పాటించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ పోరాటంలో అత్యంత విషమ పరిస్థితుల్లోనూ ముందుండి సేవలందిస్తోన్న నర్సులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ ద్వారా నర్సులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు నర్సులు శ్రమిస్తున్న తీరు, వాళ్లలోని కరుణ, దాతృత్వం జీవితంపై ఆశను కోల్పోవద్దనే విషయాన్ని నేర్పిస్తుందని పేర్కొన్నారు.
లాక్‌డౌన్‌పై మహేశ్.. నర్సుల గురించి చిరు ట్వీట్ - mahesh babu movie news
ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులను ప్రశంసిస్తూ, టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, మహేశ్‌బాబు ట్వీట్లు పెట్టారు. ప్రస్తుతం వారు చేస్తున్న సేవలను ప్రశంసించారు.
మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నర్సులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచాన్ని అలిసిపోకుండా కాపాడుతూ ఆరోగ్య వ్యవస్థను రక్షిస్తున్న నర్సులను రియల్ హీరోలుగా పేర్కొన్నారు. ప్రపంచం మళ్లీ ఆరోగ్యంగా తయారు కావడానికి భగవంతుడు నర్సులకు మరింత శక్తిని ప్రసాదించాలని కోరారు.
ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర్ రావు కూడా వైద్య రంగంలో నర్సుల ఆవశ్యకతను వివరిస్తూ ప్రత్యేక పాటను ఆలపించారు. ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల్లో అమ్మకన్నా ఎక్కువ నర్సమ్మ అంటూ ఆలపించిన ఆపాటలో... నర్సుల ప్రాధాన్యతను వివరించారు.