చదువు మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు రకరకాల ఉద్యోగాలు చేశాడు. సినిమాలు చూస్తూ ఆ రంగంపై ఆసక్తి పెంచుకున్నాడు. వీలున్నప్పుడల్లా గ్రంథాలయానికి వెళ్లి స్పెషల్ ఎఫెక్ట్స్, ఫిల్మ్ టెక్నాలజీలకు సంబంధించిన పుస్తకాలు చదివేవాడు. 23 ఏళ్ల వయసులో ట్రక్ డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు ‘స్టార్‌వార్స్’ సినిమా చూశాక ఇక ఆగలేకపోయాడు. ఉద్యోగాన్ని వదిలేసి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా, ఆర్ట్ డైరెక్టర్‌గా, స్పెషల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్‌గా పనిచేస్తూనే సినిమాలపై పట్టు సంపాదించాడు. కట్ చేస్తే... ఆ యువకుడు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మేటి దర్శకుడిగా పేరు పొందిన జేమ్స్ కామెరూన్. ‘ద టెర్మినేటర్’, ‘ఎలియన్స్’, ‘ద ఎబిస్’, ‘ట్రూలైస్’, ‘టైటానిక్’ ‘అవతార్’ చిత్రాల ద్వారా అద్భుత లోకాలలో ప్రేక్షకులను విహరింపజేసిన సృజనశీలి.