ఇప్పుడంటే అన్ని సినిమాల్లోనూ ముద్దు సన్నివేశాలు సాధారణం అయిపోయాయి గానీ.. గతంలో ముద్దు పేరెత్తితేనే హీరోయిన్లు ఆమడ దూరం పారిపోయేవారు. పోనీ వారు ధైర్యం చేసినా సెన్సార్ పెద్దలు సంస్కారం అనే కత్తెరతో కత్తిరించి పడేసేవారు. ఆ గోలంతా ఎందుకులేనని హీరోహీరోయిన్లు పూల మొక్కల వెనక దూరినట్లు, కాసేపటికి కొమ్మలు అటు ఇటు కదిలినట్లు చూపించి దర్శకులు భలే గమ్మత్తుగా ముద్దులను చూపించేవారు.. కాదు దాచేసేవారు.
91 ఏళ్ల క్రితమే వెండితెరపై తొలి ముద్దు!
మనదేశ సినీ చరిత్రలో 90 ఏళ్ల క్రితమే ముద్దు సన్నివేశాలకు బీజం పడింది. తొలిసారిగా వీక్షకులను ముద్దును పరిచయం చేసింది. ఇంతకీ దాని కథేంటి? ఆ సినిమా ఏంటి?
మరి భారతీయ తెరపై అధర చుంబనానికి నాంది పడింది ఎప్పుడో తెలుసా? స్వాతంత్య్రానికి పూర్వం 91 ఏళ్ల క్రితం. 1929లో వచ్చిన మూకీ చిత్రం 'ఏ థ్రో ఆఫ్ డైస్'.. తొలిసారిగా ముద్దు సన్నివేశాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. మహాభారతం ఆధారంగా కల్పిత కథతో తెరకెక్కిన ఈ సినిమాలోని నటీనటులు సీతా దేవి, చారు రాయ్ ఒక్క క్షణం పాటు అలా పెదాలు కలుపుతారు. అయితే ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిన తొలి ముద్దు సన్నివేశం 1930లో వచ్చిన 'కర్మ' చిత్రంలోనిది. నిజ జీవితంలో భార్యాభర్తలైన నటి దేవికా రాణి, హిమాన్షురాయ్ అందులో నటించారు. ఓ సన్నివేశంలో నాలుగు నిమిషాల పాటు ముద్దుతో మురిపించారు.
ఇదీ చూడండి : మిస్టర్ అండ్ మిస్కు తొలి ముద్దు యాక్సిడెంట్ అట..!