'సినిమా సమున్నత సామాజిక, నైతిక సందేశాన్ని చాటి చెప్పేలా ఉండాలి. హింసను ప్రదర్శించడంలో సంయమనం పాటిస్తూనే, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా సమాజం తరఫున గళమెత్తాలి. మితిమీరిన అశ్లీలత, అసభ్యతను విడనాడాలి. సినిమా అంతిమ లక్ష్యం సందేశం కావాలి' అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సినిమా రూపకర్తలకు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం ఉదయం దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 67వ జాతీయ చలన చిత్ర పురస్కార వేడుకలో (67th National Film Awards) ప్రముఖ నటుడు రజనీకాంత్‌కు (Rajinikanth Awards) దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో (Dadasaheb Phalke Award) పాటు, జాతీయ చలన చిత్ర పురస్కార విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. మనం మాతృమూర్తిని, మాతృభాషను, మాతృభూమిని ఎట్టిపరిస్థితుల్లోనూ మరువకూడదని పేర్కొన్నారు.
సినిమాల ద్వారా మాతృభాషలను ప్రోత్సహించాలన్నారు. సినిమా పరిశ్రమ మనకు ఉల్లాసం, ఉత్సాహం, వినోదం, స్ఫూర్తినిస్తూనే మనసును తేలిక పరిచి గుండెను బరువెక్కిస్తుంది. ప్రపంచంలో అత్యంత చౌకైన వినోదం సినిమానే. సినిమా నిర్మించడం ఖరీదైనపనిగా మారినప్పటకీ సినిమా చూడటం మాత్రం చౌకగానే ఉంటోంది. సినిమా దగ్గరకు నీవు వెళ్లలేకపోయినా ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా కారణంగా అదే నీ దగ్గరకు వస్తోంది. సామాజిక మాధ్యమం ఒకవైపు ఉపయోగకరమైనా, మరోవైపు అది అంత నిర్మాణాత్మకంగా లేదు. కొన్నిసార్లు అది అడ్డంకిగా, మరికొన్నిసార్లు విధ్వంసకరంగా మారుతోంది. అది తనను తాను సరిద్దుకోకపోతే తన ఉనికిని కోల్పోతుంది. రజనీకాంత్ ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. నటనానైపుణ్యంతో భారతీయ సినిమాకి కొత్త రూపును సంతరించిపెట్టారు. ఈ జాతీయ సినిమా అవార్డులు దేశ సినిమారంగ వైవిధ్యతను చాటుతాయి. ప్రతిభాషా తనదైన ప్రేక్షకులకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ సినిమాలు తీస్తోంది. భారతీయ వైవిధ్యతకు నిజమైన నివాళి ఈ అవార్డులు. సినిమాలు మన సాంస్కృతిక వారధులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు తమ మూలాలతో అనుసంధానమై ఉండటానికి సినిమాలు ఒక సాధనంలా పనిచేస్తున్నాయి. మన పెద్దలు మనకు ఇచ్చిపోయిన సుసంపన్నసంప్రదాయాలు, సంస్కృతులను కాపాడుకోవడానికి సినిమారంగం కృషిచేయాలి. ఇక్కడ ప్రాంతీయ సినిమాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. భారతీయ భాషలన్నీ జాతీయ భాషలే కాబట్టి అందులో నిర్మితమయ్యే సినిమాలు కూడా జాతీయ సినిమాలే. వాటిని ప్రాంతాలకు పరిమితం చేయడం సరికాదు. భారతీయ సినిమా అభివృద్ధికి తెలుగు సినిమా గొప్ప చేయూతనందించింది. జాతీయస్థాయి అవార్డు దక్కించుకొన్న తొలి తెలుగుచిత్రం 'పెద్దమనుషులు' దగ్గరి నుంచి మొన్నటి 'జెర్సీ'వరకు ఎన్నో అడ్డంకులను అధిగమించి తెలుగు చిత్రపరిశ్రమ గొప్ప శిఖరాలకు చేరుకొంది. సృజనాత్మక ఆలోచనలు కలిగిన సినిమా రూపకర్తలు ఆ తెలివితేటలను సమాజ ఉన్నతికోసం ఉపయోగించాలి. ప్రజలు గుర్తుపెట్టుకొనేలా ఉండాలి. దివంగత ఎన్టీరామారావు, నాగేశ్వరరావులాంటి నటులను చూసి ఒక్కో సినిమా ఏడాదిన్నరపాటు నడిచేది. కానీ ఇప్పుడు ఒక్కపూటకూడా నడవని పరిస్థితి నెలకొంది. అందువల్ల ప్రజలకు సందేశంతోపాటు, సంతోషం, ఉపశమనం కల్గించే సినిమాలు నిర్మించడంపై దృష్టి సారించాలి. ఇప్పుడు కావాల్సింది సానుకూలతే తప్ప ప్రతికూలతకాదు. స్వతంత్ర దేశంగా ఉన్న మనం మన ప్రజలు, రాబోయే తరాల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలి. ప్రభుత్వం తప్పుచేస్తే విమర్శించవచ్చుకానీ, అడ్డంకులు కల్పించకూడదు. నిర్మాణాత్మకంగా సూచనలు చేయాలి.
గురువు కె.బాల చందర్‌కు అంకితం
'అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో నన్ను గౌరవించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ అవార్డును నా మార్గదర్శకులు, గురువు కె.బాలచందర్‌కు అంకితం చేస్తున్నాను. ఆయనతోపాటు నన్ను తండ్రిలా పెంచి పోషించిన సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్‌నూ ఈ సందర్భంలో కృతజ్ఞతాభావంతో గుర్తుచేసుకుంటున్నాను. ఆయన నన్ను విలువలతో పెంచడంతోపాటు నాలో ఆధ్యాత్మికతను పెంపొందించారు. అలాగే బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ నన్ను ప్రోత్సహించిన స్నేహితుడు రాజ్‌బహదూర్‌నుకూడా గుర్తుచేసుకుంటున్నాను. నేను బస్సు కండెక్టర్‌గా ఉన్నప్పుడు నాలోని నటుణ్ని గుర్తించి సినిమాల్లోకి వెళ్లేలా ప్రోత్సహించారు. వీరందరితోపాటు నాతో సినిమాలు నిర్మించిన దర్శకులు, నిర్మాతలు, నా సినిమాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు, సహనటులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, మీడియా, అభిమానులందరికీ ఈ గౌరవం దక్కుతుంది. తమిళనాడు ప్రజలు లేకుంటే నేను లేను. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.'