'మహానటి'లో జెమినీ గణేశన్‌గా నటించి, తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు దుల్కర్ సల్మాన్. మమ్ముట్టి నట వారసుడిగా తెరకు పరిచయమైనా, వైవిధ్యమైన చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన 'కనులు కనులు దోచాయంటే' శుక్రవారం విడుదలవుతోంది. ఆయనకి ఇది 25వ చిత్రం. రీతూ వర్మ కథానాయిక. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పలు విషయాలు పంచుకున్నారు దుల్కర్.
8 ఏళ్ల ప్రయాణంలో 25 సినిమాలు చేశారు. ఈ ప్రస్థానం మీకెలా అనిపిస్తోంది?
ఏ భాషలోకి అడుగుపెట్టినా ప్రేక్షకులు వాళ్ల మనిషిలా స్వాగతిస్తున్నారు. ఇక చిత్రాల సంఖ్య అంటారా.. మలయాళంలోని మిగతా హీరోలతో పోల్చితే నేను నెమ్మదిగానే చేస్తున్నానేమో. వాళ్లలా నేనూ వేగం పెంచాలి.
'మహానటి' తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు, కారణమేంటి?
నేను ఏ భాషలోకి వెళ్లినా నాకు ఇదే ప్రశ్న ఎదురవుతుంటుంది. మార్కెట్ లెక్కలేసుకుని సినిమా చేయాలనుకోను. ఓ కథ ఎంచుకున్నప్పుడు అది ఏయే వర్గాలకు చేరువవుతుందో వాళ్ల వద్దకే తీసుకెళ్తా. ఈ చిత్ర దర్శకుడు దేసింగ్ పెరియసామి కథ చెప్పినప్పుడే ఇది తమిళం, తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనిపించింది.