మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నిప్పులు చెరిగింది. సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసు విషయమై ఇటీవల కంగన ముంబయి నగరాన్ని పీవోకేతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కంగనపై ఆగ్రహించింది. ఈ క్రమంలోనే ఆదివారం జరిగిన శివసేన పార్టీ దసరా వేడుకల్లో ఉద్ధవ్ ఠాక్రే.. కంగనపై పరోక్షంగా విమర్శలు చేశారు. కూటి కోసం ముంబయికి వచ్చిన కొంతమంది, కావాలనే ఈ మహానగరంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.
ఉద్ధవ్ ఠాక్రేపై కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, నటి కంగనా రనౌత్.. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయమే హాట్ టాపిక్‌గా మారింది.
'తమ రాష్ట్రంలో సరైన జీవనాన్ని కొనసాగించలేక.. కుటుంబ పోషణ నిమిత్తం కొంతమంది ముంబయికి వస్తారు. ఇక్కడ వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఆహారం, ఇతర సదుపాయాలు దొరకగానే.. ఈ నగరాన్ని పీవోకేతో పోలుస్తూ విమర్శలు చేస్తారు. ముంబయిలో ఎక్కడ చూసిన మాదకద్రవ్యాలు దొరుకుతాయని ఆరోపిస్తారు. ఇలాంటి విమర్శలు చేసేవాళ్లందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మా ఇళ్లలో మేం తులసి మొక్కలు మాత్రమే పెంచుతాం. గంజాయి పెంచడం మాకు తెలీదు. గంజాయి మీ రాష్ట్రాల్లోనే దొరుకుతుంది' అని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు.
ఉద్ధవ్ ఠాక్రే చేసిన ఆరోపణలపై నటి కంగన ఆగ్రహం వ్యక్తం చేసింది. 'హిమాచల్‌ప్రదేశ్‌కు దేవ్‌భూమి అనే పేరు ఉంది. ఇక్కడ ఎన్నో దేవాలయాలున్నాయి. అలాగే ఈ ప్రాంతంలో క్రైమ్ రేట్ కూడా తక్కువ. ఉద్ధవ్.. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని మీరు అవమానపరుస్తారు. ప్రజలకు సేవలు చేసే గొప్ప స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? నీచమైన రాజకీయాల ద్వారా పొందిన ఆ కుర్చీలో కూర్చొనే అర్హత మీకు లేదు. మహారాష్ట్ర మీ సొత్తు అయినట్లు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? ప్రతి భారతీయుడికి హిమాలయాలు ఎలా సొంతమో అలాగే ముంబయి నుంచి వచ్చిన అవకాశాలు ప్రతి ఒక్కరి సొంతం. ఈ రెండు నా ఇళ్లు లాంటివే. నా హక్కులు కొల్లగొట్టేందుకు, మమ్మల్ని విడదీసేందుకు ధైర్యం చేయకండి. ముంబయి కనుక అవకాశాలు ఇవ్వకపోతే నాకు తినడానికి తిండి కూడా ఉండదని ఆరోపించారు. మీ తనయుడి వయస్సే నాకు కూడా ఉంటుంది. స్వయం ఉపాధి పొందుతున్న నాలాంటి మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేయడం మీకు తప్పుగా అనిపించడం లేదా!' అని కంగన వరుస ట్వీట్లు చేసింది.