తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ సినిమాలు చెప్పిన తేదీకే రిలీజ్ చేస్తారా?

విడుదల తేదీలు ప్రకటించడం.. ఆ తర్వాత కొన్నాళ్లకు వాయిదా వేయడం - ఈ తంతు తెలుగు చిత్రసీమలో కొన్నాళ్లుగా పరిపాటిగా మారింది. ఏ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి. కరోనాతో ఏర్పడిన పరిణామాలే అందుకు కారణం. రానున్న వినాయక చవితి, దసరా మొదలుకొని.. సంక్రాంతి వరకు పండగలే లక్ష్యంగా పలు చిత్రాలు విడుదల తేదీల్ని ప్రకటించాయి. వాటిలో ఒకట్రెండు ఇప్పటికే వెనక్కి తగ్గేశాయి. మరి మిగతా సినిమాల్లో అనుకున్నట్టుగా వచ్చేవెన్ని?

delay of movie releases
ఆ సినిమాలు అనుకున్న తేదీకే రిలీజ్​ అవుతాయా?

By

Published : Aug 30, 2021, 6:57 AM IST

Updated : Aug 30, 2021, 9:15 AM IST

రెండో దశ కరోనా తర్వాత థియేటర్లు తెరుచుకున్నప్పటికీ.. సినీ వ్యాపారం ఇంకా గాడిన పడలేదు. పరిమిత వ్యయంతో తెరకెక్కినవే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. భారీ వ్యయంతో తెరకెక్కిన చిత్రాల విడుదల అంటే సాహసంగానే భావించే పరిస్థితి. రెండు తెలుగురాష్ట్రాల్లో ప్రదర్శనలు ఒకే తరహాలో సాగకపోవడం, టికెట్‌ ధరల్లో వైరుధ్యాలు ఉండటమే అందుకు కారణం. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ కరోనా నిబంధనలు కొనసాగుతుండటం వల్ల అక్కడ రోజూ మూడు ఆటలే. సెకండ్‌ షో ప్రదర్శనల్ని నిలిపివేశారు. అక్కడ టికెట్‌ ధరల తగ్గింపు కూడా సినిమా విడుదలలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఇప్పటికే చాలా..

రెండో దశ కరోనా కంటే ముందే సిద్ధమైన సినిమాలు చాలానే ఉన్నాయి. అవి సాధారణ పరిస్థితుల కోసం.. సరైన సమయం కోసం వేచి చూస్తూ వచ్చాయి. వాటిలో కొన్ని ఓటీటీ బాట పట్టగా, మరికొన్ని ఇప్పటికీ థియేటర్‌ లక్ష్యంగానే ముస్తాబై కూర్చున్నాయి. అందులో 'లవ్‌స్టోరి' ఒకటి. సెప్టెంబరు 10న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. ఆలోపు ఆంధ్రప్రదేశ్‌లో సెకండ్‌ షోపైన, టికెట్‌ ధరలపైన ఆ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని ఊహించారంతా. కానీ పరిస్థితులు అలా కనిపించడం లేదు. దాంతో 'లవ్‌స్టోరి' మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

.

సెప్టెంబర్‌ 3న విడుదల కావల్సిన గోపీచంద్‌ 'సీటీమార్‌' ఇప్పటికే సెప్టెంబర్‌ 10కి వాయిదా పడింది. ఇలా విడుదల తేదీలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి. రూ.వందల కోట్లతో రూపొందిన పాన్‌ఇండియా సినిమాలు ఆ స్థాయిలో వసూళ్లు సాధించాలంటే ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకి రావల్సిందే. కానీ రెండో దశ కరోనా తర్వాత వసూళ్లని గమనిస్తే.. ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో రావడం లేదనే విషయం స్పష్టమవుతోంది. దీంతో యశ్‌ కథానాయకుడిగా నటించిన 'కెేజీఎఫ్‌-2'ను వచ్చే యేడాది ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.

రాజమౌళి 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' కూడా అక్టోబర్‌ 13న రానట్టే. అందుకే పలు చిత్రాలు ఆ తేదీని లక్ష్యంగా చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి. బాలకృష్ణ 'అఖండ' అక్టోబర్‌ 13న విడుదల కావొచ్చని తెలుస్తోంది. ఇదే నెల 14న 'మహా సముద్రం' ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్‌ 8న వైష్ణవ్‌తేజ్‌ 'కొండపొలం', అదే రోజున అఖిల్‌ అక్కినేని 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌' విడుదలవుతున్నాయి. చిరంజీవి 'ఆచార్య' ఎప్పుడొస్తుందనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.

'ఆర్​ఆర్​ఆర్​'

ఆ సినిమాలైనా వస్తాయా?

2022 సంక్రాంతి లక్ష్యంగా ఇప్పటికే మూడు సినిమాలు విడుదల తేదీల్ని పక్కా చేశాయి. పవన్‌కల్యాణ్‌ - రానా కథానాయకులుగా నటించిన 'భీమ్లానాయక్‌', మహేష్‌ 'సర్కారు వారి పాట', ప్రభాస్‌ 'రాధేశ్యామ్‌' సినిమాలు వరుసగా మూడు రోజుల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ముగ్గురు అగ్ర తారల సినిమాలు ఇలా ఒకేసారి విడుదల కాలేదు. మరి ఇప్పుడు సాధ్యమేనా? అన్నది ప్రశ్న. వీటిలో ఏదో ఒకటి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.

రాధేశ్యామ్​
'భీమ్లానాయక్​'

ఇదంతా ఒకెత్తైతే.. ఇప్పుడు 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' సంక్రాంతి లక్ష్యంగా ముస్తాబవుతోందనే ప్రచారం మరో ఎత్తు. ఆ ప్రచారానికి తగ్గట్టుగా సంక్రాంతికి 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' విడుదలైనా ఇప్పటికే ఖరారైన మూడు సినిమాల్లో ఏదో ఒకటి వాయిదా వేయక తప్పని పరిస్థితి. మొత్తంగా విడుదల తేదీల విషయంలో అనూహ్యంగా మారుతున్న నిర్ణయాల వల్ల ఎప్పుడు ఏ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదీ చూడండి :రోజా వర్సెస్​ ఇంద్రజ- సెకండ్​ ఇన్నింగ్స్​లోనూ హోరాహోరీ పోటీ

Last Updated : Aug 30, 2021, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details