Praveen tambey biopic: ఇటీవల కాలంలో క్రీడా నేపథ్యం చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ధోని, కపిల్ దేవ్ బయోపిక్‌లు రాగా.. ఇప్పుడు మరో క్రికెటర్ జీవితం సినిమాగా రానుంది. భారత క్రికెటర్ ప్రవీణ్ తాంబే జీవితం ఆధారంగా 'ప్రవీణ్ తాంబే ఎవరు?' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రేయాస్ తల్పడే టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. 41 ఏళ్ల వయసులో ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్ ప్రవీణ్ తాంబే. ఈ చిత్రం గురించి క్రికెటర్ తాంబే మాట్లాడుతూ.."నా జీవిత కథ ఎందరికో స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత ఆ జాబితాలో మరికొంతమంది చేరతారు. తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ నిరంతరం ప్రయత్నించాలి. ఎవరికి వారు తమ శక్తిని తక్కువ అంచనా వేసుకోవద్దు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనకడుగు వేయొద్దు" అని చెప్పుకొచ్చారు.
నాగశౌర్య కొత్త సినిమా రిలీజ్ డేట్