లాక్డౌన్ అమల్లో ఉన్నా, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తన అభిమానికి గుండె ఆపరేషన్ చేయించారు మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు విజయవంతంగా ఆమెకు శస్త్రచికిత్స చేసినట్లు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామినాయుడు చెప్పారు.
అభిమాని కోసం రంగంలోకి చిరు- ఆపరేషన్ సక్సెస్ - టాలీవుడ్ వార్తలు
మెగాస్టార్ చిరంజీవి.. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, తన అభిమాని నాగలక్ష్మికి సర్జరీ చేయించారు. ఈ విషయాన్ని చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామినాయుడు స్పష్టం చేశారు.
"చిరంజీవి వల్ల రాజనాల నాగలక్ష్మి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. స్టార్ ఆసుపత్రి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎమ్. గోపీచంద్.. సుమారు మూడున్నర గంటల పాటు సర్జరీ చేశారు. ఇది విజయవంతమైంది. ఆపరేషన్ గురించి మెగాస్టార్ చిరంజీవి, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారు. ఆపరేషన్ పూర్తవగానే డాక్టర్ గోపీచంద్.. చిరంజీవికి ఫోన్ చేసి చెప్పారు. ఆ తర్వాత చాలా సంతోషంతో ఆయన మాకు తెలియజేశారు" -స్వామినాయుడు, అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు
గుంటూరుకు చెందిన రాజనాల వెంకట నాగలక్ష్మి.. చిరంజీవి అంజనా మహిళా సేవాసంస్థకు అధ్యక్షురాలిగా ఉన్నారు. కొంతకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం ఇటీవల బాగా క్షీణించింది. ఈ విషయాన్ని అభిమానులు, చిరు దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న మెగాస్టార్.. లాక్డౌన్ అమల్లో ఉండటం వల్ల ప్రత్యేక అనుమతులు తీసుకుని, ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చారు. నాగలక్ష్మికి శస్త్రచికిత్స నేడు విజయవంతంగా చేశారు.