బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్, ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం 'సూర్యవంశీ'. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా షూటింగ్ సమయంలో వీరిద్దరూ గొడవపడ్డారు. మాటకు మాట పెరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరగా పోలీసులు వచ్చి ఈ ఇద్దరినీ విడదీశారు. అసలు ఈ స్టార్లిద్దరూ వాగ్వాదానికి దిగడమేంటి అనే కదా మీ సందేహం?
సెట్లో అక్షయ్, రోహిత్ గొడవ.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు రోహిత్ శెట్టి మధ్య సెట్లో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పోలీసులు వచ్చి వారిని అదుపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియోను కత్రీనా కైఫ్ చిత్రీకరించింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది.
అసలు విషయం ఏంటంటే.. 'సూర్యవంశీ' చిత్ర విషయంలో అక్షయ్, రోహిత్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని ఓ ప్రముఖ వెబ్సైట్ కథనం రాసింది. నిర్మాత కరణ్ జోహార్ చొరవ తీసుకుని మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని అందులో సమాచారం. అయితే ఆ వార్తల్లో నిజం లేదని చెప్పడానికి.. నిజంగానే గొడవపడుతున్నట్లు ఓ వీడియోను రూపొందించింది చిత్రబృందం. దాన్ని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.
"బ్రేకింగ్ న్యూస్.. అక్షయ్ కుమార్, రోహిత్ ఫాలౌట్" అని కథానాయిక కత్రినా కైఫ్ ఆ వార్త చూపించడం నుంచి వీడియో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఈ సరదా ఫైట్ నెట్టింట వైరల్ అవుతోంది. "భలే సమాధానం చెప్పారు అక్షయ్" అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.