'పగ్లీ' చిత్రంతో వెండితెరకు పరిచయమైనప్పటికీ 'ఎం.ఎస్.ధోనీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కియారా అడ్వాణీ. 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. తాజాగా ఈ చిన్నది న్యూ ఇయర్ సందర్భంగా షూటింగ్ నుంచి కొంత విరామం తీసుకుని ఆఫ్రికా టూర్ వెళ్లింది. అక్కడ దిగిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇదే సమయంలో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఆఫ్రికాలో దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశాడు. ఫలితంగా కియారా, సిద్ధార్థ్ కలిసే టూర్‌కు వెళ్లారంటూ నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.
సిద్ధార్థ్‌తో ప్రేమలో ఉన్న కియారా..?
కియారా అడ్వాణీ... తెలుగులో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సరసన 'భరత్ అనే నేను'లో నటించి మెప్పించింది. ఆ తర్వాత 'వినయ విధేయ రామ' చిత్రంలో చరన్ పక్కన సందడి చేసింది. అందం, నటన కలగలిపిన ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గతంలో వాటిని తోసిపుచ్చగా.. తాజాగా కొన్ని ఫొటోలు వారి మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న రూమర్లకు బలం చేకూరుస్తున్నాయి.
శుక్రవారం ఆఫ్రికా నుంచి ముంబయికు చేరుకున్న కియారా అడ్వాణీ పక్కనే సిద్ధార్థ్ కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో వీరి ప్రేమాయణంపై స్పందించిన ఈ అందాల భామ... అవి వదంతులే అని సమాధానమిచ్చింది.
గతేడాది విడులైన 'కబీర్‌సింగ్', 'గుడ్‌న్యూస్' చిత్రాలతో మంచి విజయాన్ని అందుకుంది కియారా అడ్వాణీ. ప్రస్తుతం ఆమె 'లక్ష్మిబాంబ్', 'ఇండోకి జనానీ', 'షెర్షా' చిత్రాలతో బిజీగా ఉంది.