ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న అనుష్క జన్మ ధన్యమైందన్నారు ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు. హీరోయిన్గా ఆమె, 15 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో 'నిశ్శబ్దం' చిత్రబృందం ప్రత్యేక వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు సినీ ప్రముఖులు అనుష్క గురించి మాట్లాడారు.
15 ఏళ్లలో అనుష్క చేసిన సినిమాల జాబితా "శ్రీరామదాసు' తీస్తున్న సమయంలో నాగార్జున అనుష్కను పరిచయం చేశారు. స్వీటీ అని పిలవగానే మెట్లు ఎక్కుతూ వచ్చింది. ఆ రోజే 'నువ్వు దక్షిణాదిలో టాప్ హీరోయిన్ అవుతావ'ని చెప్పా. తన కెరీర్‌లోనూ బంగారు మెట్లెక్కి వచ్చింది అనుష్క. తొలి సినిమాతోనే 'సూపర్' అనిపించింది. ప్రయత్నిస్తే ఎవరికైనా సినిమాలు దొరుకుతాయి కానీ, ఈమె విషయంలో ఆమెను వెదుక్కుంటూ పాత్రలు వెళ్లాయి. ఈ తరంలో వచ్చిన ఏ కథానాయికకూ ఈ అదృష్టం దొరకలేదు. నన్ను మౌనముని అని పిలిచేవారు. 'నిశ్శబ్దం' సినిమాతో మౌన ముని కన్యక అయిపోతుంది అనుష్క" -కె.రాఘవేంద్రరావు, దర్శకుడు
"నా కుటుంబ స్నేహితురాలు స్వీటీ. 'విక్రమార్కుడు' చేస్తున్నప్పుడు ప్రతి సన్నివేశాన్నీ చేసి చూపించమని చెప్పేది. అప్పుడు తనకు తను మార్చుకుని చేసేది. ఆ సమయంలోనే నాకు, మా కుటుంబానికి సన్నిహితమైంది. నా సినిమాలో అనుష్క పోషించిన దేవసేన పాత్ర విషయంలో గర్వపడుతున్నా. స్వీటీ నటి మాత్రమే కాదు, మంచి మనసున్న అమ్మాయి. నా హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది" -దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి
"ప్రతి ఒక్కరూ నా పదిహేనేళ్ల ప్రయాణం గురించి మాట్లాడుతున్నారు. ఎంతోమందితో పోలిస్తే నేను చేరుకున్న లక్ష్యం చిన్నదే. దీనిని నేనొక బాధ్యతగా తీసుకుంటా. మరింత శ్రమిస్తా. 'సూపర్' నుంచి 'నిశ్శబ్దం' వరకు ప్రతి దర్శకుడు, నటులు, సాంకేతిక నిపుణులు అందించిన సహకారం మరిచిపోలేను. వచ్చే నెల 2న నిశ్శబ్దం వస్తుంది" -అనుష్క, నటి
"రవితేజ, ఛార్మి, నేను అనుష్కను అమ్మా అని పిలుస్తాం. కలిసినప్పుడల్లా కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటాం. తన నుంచి చాలా నేర్చుకోవాలి" -దర్శకుడు పూరీ జగన్నాథ్
"నా జీవితంలోనూ చాలా మార్పు తీసుకొచ్చింది అనుష్క. ఆరు నెలల కిందట జార్జియాకు వెళ్లా. అక్కడ నన్ను చూసుకోవడానికి జాజా అనే రష్యా వ్యక్తిని పంపించారు. మేం హైదరాబాద్ నుంచి వచ్చామని చెప్పగానే అతడు స్వీటీ తెలుసా? అని అడిగాడు. తర్వాత తన కోసం అనుష్క ఏం చేసిందో చెప్పాడు. ఒక సినిమా కోసం చిత్రీకరణకు వెళ్లినప్పుడు అనుష్కకు కార్ డ్రైవర్‌గా జాజానే ఉన్నాడట. అయితే ఓ రోజు జాజా కాకుండా, మరో వ్యక్తి కార్ తీసుకొచ్చాడట. ఆరా తీస్తే అతని కార్‌ను ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారని తెలిసిందట. అప్పుడు అనుష్క జాజాని పిలిపించి స్వయంగా తీసుకెళ్లి కార్ కొనిచ్చిందట అనుష్క. ఎంతమంది ఇలా చేస్తారు?" -నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి
ఈ కార్యక్రమంలో ప్రసాద్ వి.పొట్లూరి, వైవీయస్ చౌదరి, శ్రీవాస్, దశరథ్, వీరుపోట్ల, నీరజ కోన, హేమంత్ మధుకర్, ఛార్మి, శోభు యార్లగడ్డ, కోన వెంకట్, అంజలి, డి.సురేశ్‌బాబు, విశ్వప్రసాద్, వందనా ప్రసాద్, ప్రశాంతి త్రిపిర్నేని తదితరులు పాల్గొన్నారు.
హీరో ప్రభాస్‌తో అనుష్క శెట్టి