ఎప్పుడో 1895లో ఒక మారుమూల పల్లెటూర్లో వచ్చిన కరవు కాటకాల గురించి 2001లో సినిమాకు కథ రాయడమేంటి? ఆ ఊరి ప్రజలు పన్నుల మాఫీకి బ్రిటిష్ అధికారులతో క్రికెట్ పందెం వేసుకోవడమేంటి? క్రికెట్ అంటేనే తెలియని వాళ్లు మ్యాచ్‌లో బ్రిటిష్ వాళ్లను ఓడించడేంటి? అసలు ఈ కథను ఎవరైనా చూస్తారా?’ ఇదీ 'లగాన్' సినిమా కథ గురించి వచ్చిన సందేహం. అది వచ్చింది ఎవరికో కాదు.. ఆ చిత్రంలో కథానాయకుడిగా నటించిన ఆమీర్ ఖాన్‌కేనట. తన కెరీర్‌లోనే చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ చిత్రం గురించి ఆయనకే అలా అనిపించిందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.
ఓ మీడియా సంస్థతో ఆమిర్ మాట్లాడుతూ 'లగాన్' గురించిన జ్ఞాపకాలు పంచుకున్నాడు.
"అశుతోష్ గొవార్కర్ (దర్శకుడు) మొదట ఐదు నిమిషాల్లో నాకు 'లగాన్' కథ చెప్పాడు. బ్రిటిష్ కాలం నాటి కథ, కరవుతో అల్లాడే ఊరి ప్రజలు, బ్రిటిష్ వాళ్లతో పల్లె ప్రజలు క్రికెట్ ఆడి గెలవడం.. లాంటివి వినగానే నాకు ఇదేం కథ. దీని మీద ఎవరికి ఆసక్తి ఉంటుంది అనిపించింది. నాకు నచ్చలేదని అశుతోష్‌తో చెప్పాను. అయితే ఆయన మూణ్నెళ్ల తర్వాత మళ్లీ వచ్చి పూర్తి స్క్రిప్టు వినమని అడిగాడు. ఆ క్రికెట్ కథయితే నేను చేయనని అన్నాను. కనీసం స్క్రిప్టు అయినా వినమని ఆయన అడిగాడు. తనతో ఉన్న స్నేహం కారణంగా కాదనలేకపోయాను. ఎలాగైనా ఈ కథను అంగీకరించకూడదని మనసులో అనుకునే స్క్రిప్టు వినడానికి సిద్ధమయ్యాను. కానీ పూర్తి స్క్రిప్టు వినేసరికి ఫిదా అయిపోయాను. అంతగా నా మనసును తాకిందా కథ"’ - ఆమిర్ ఖాన్.
ఆయన నమ్మకం వమ్ముకాలేదు. ఆమిర్ కెరీర్‌లో మరపురాని చిత్రంగా నిలిచిపోవడమే కాదు.. ఆస్కార్ బరిలో గట్టిపోటీనిచ్చి భారతీయ చిత్రాల సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది 'లగాన్'.
ఇవీ చూడండి.. 'జిందాబాద్.. జిందాబాద్ ఎర్రాని పెదవులకీ'