తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

కుడి ఎడమైనా.. పొరపాటు లేదోయ్​! - ట్రెడ్‌మిల్‌

శాస్త్రరంగంలో ప్రతి ఆవిష్కరణకూ ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. కానీ ఇది కొన్నిసార్లు కుడి ఎడమలు కావొచ్చు. అసలు ఉద్దేశం ఒకటైతే మరో రకంగా ఉపయోగపడొచ్చు. అలాగని తక్కువ చూడటానికి లేదు. ఇలాంటివి మన జీవితం మీద గణనీయ ప్రభావాన్నే చూపొచ్చు. అలాంటి వాటిల్లో కొన్నింటి గురించి..!

These things made for one object but use for another
కుడి ఎడమైనా.. పొరపాటు లేదోయ్

By

Published : Nov 10, 2021, 1:02 PM IST

యాదృచ్ఛికం. నమ్మినా నమ్మకపోయినా ఇది శాస్త్రరంగంలో కొన్నిసార్లు అద్భుతాలకూ కారణమవుతుంది. ఉదాహరణకు- పెన్సిలిన్‌నే చూడండి. అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ 1928లో విహారయాత్రకు వెళ్లకపోయి ఉంటే? తిరిగి వచ్చాక ప్రయోగ పాత్రలోని బ్యాక్టీరియాను ఫంగస్‌ చంపేసినట్టు గుర్తించకపోయి ఉంటే? పెన్సిలిన్‌ ఆవిష్కరణే జరిగేది కాదు. ఇప్పుడు ప్రపంచం ఎలా ఉండేదే కాదు. ఇలాంటి యాదృచ్ఛిక ఆవిష్కరణలు శాస్త్రరంగంలో చాలానే ఉన్నాయి.

ఏదైనా విషయం గుర్తుండటానికో, పనులు క్రమ పద్ధతిలో చేసుకోవటానికో ఉపయోగపడే పోస్ట్‌-ఇట్‌ నోట్‌ కూడా ఇంతే. డాక్టర్‌ స్పెన్సర్‌ సిల్వర్‌ 1968లో దీన్ని సృష్టించారు. అంతకుముందు ఆయన గాఢమైన జిగుర్ల కోసం కృషి చేస్తుండేవారు. ఆ ప్రయత్నంలోనే అంతగా అంటుకోని, తేలికగా ఊడి వచ్చే జిగురు బయటపడింది. పోస్ట్‌-ఇట్‌ నోట్‌కు బీజం వేసింది ఇదే. నాన్‌ స్టిక్‌ పాత్రల తయారీలో కీలకమైన టెఫ్లాన్‌ ఆవిష్కరణ సైతం యాదృచ్ఛికానికి ఉదాహరణే.

డాక్టర్‌ రాయ్‌ జె.ప్లంకెట్‌ భిన్నమైన రిఫ్రిజిరెంట్‌ వాయువుల మీద ప్రయోగాలు చేస్తుండగా.. ఒక వాయువులో టెట్రాఫ్లోరోఇథిలిన్‌ కనుమరుగైనట్టు గుర్తించారు. ఇది రిఫ్రిజిరేటర్‌లోనే ఒక మూలన తెల్లని పొడిగా (పాలీటెట్రాఫ్లోరోఇథిలిన్‌) మారిపోయి కనిపించింది. ఈ కొత్త పదార్థానికి దేన్నీ అంటుకోనివ్వని, అత్యధిక ఉష్ణోగ్రతలోనే కరిగే గుణం ఉండటం బాగా ఆకర్షించింది. నాన్‌ స్టిక్‌ వంట పాత్రల తయారీకి మూలమైంది. ఇక కొన్ని ఆవిష్కరణలైతే సరికొత్త మలుపు తిరుగుతుంటాయి. అంటే ఒక దానికోసం తయారు చేసినవి మరో రకంగా ఉపయోగపడతాయన్నమాట. ఒకరకంగా వీటినీ యాదృచ్ఛిక ఆవిష్కరణలే అనుకోవచ్చు. అలాంటి వాటిల్లో కొన్ని ఇవీ..

స్లింకీ యుద్ధనౌకల నుంచి

మృదువైన స్ప్రింగు. ఒక చేతి నుంచి మరో చేతికి మారుతూ ముచ్చట గొలుపుతుంది. స్లింకీతో ఆడుకునేవారికిది అనుభవైక వేద్యమే. చూసేవారికీ అబ్బురం గొలుపుతుంది. ఇదిప్పుడిలా ఆటవస్తువుగా ఆకర్షిస్తుండొచ్చు గానీ దీనికి బీజం యుద్ధనౌకల్లోనే పడిందంటే నమ్ముతారా? స్లింకీతో కథ 40ల్లో మొదలైంది. దీన్ని రిచర్డ్‌ టి.జేమ్స్‌ సృష్టించారు. ఆయన అప్పట్లో యుద్ధనౌకలో ఇంజినీర్‌గా పనిచేసేవారు. సముద్రంలో ప్రయాణించే నౌకల్లో వస్తువులను పట్టి ఉంచే లోహ స్ప్రింగులను తయారు చేస్తుండేవారు. ఒకసారి ఆయన బల్ల మీది నుంచి ఒక స్ప్రింగు జారిపోయింది. కింద పడిన వెంటనే అది 'గంతులేసింది'. దీనికి జేమ్స్‌ చాలా అబ్బురపడిపోయారు. మంచి ఆట వస్తువుగా పనికొస్తుందని అనుకున్నారు. ఇంటికి వచ్చాక భార్యకు స్ప్రింగు గురించి చెప్పారు. ఆమెకూ ఇది బాగా నచ్చింది. డిక్షనరీ అంతా వెతికి 'స్లింకీ' అని పేరు పెట్టారు. అనంతరం జేమ్స్‌ దీనికి మరిన్ని మెరుగులు దిద్దారు. 24 మీటర్ల పొడవైన తీగను చిన్న స్ప్రింగుగా మార్చి, వినూత్నమై ఆటవస్తువుగా మలచారు. అంతేనా? కేవలం 10 సెకండ్లలోనే స్లింకీని తయారుచేసే యంత్రాన్ని కూడా రూపొందించారు. స్లింకీ ఇలా మార్కెట్‌లోకి వచ్చిందో లేదో పిల్లలను, పెద్దలకు విశేషంగా ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్లకు పైగానే స్లింకీలు అమ్ముడయ్యాయని అంచనా.

స్లింకీ

ప్లే-డో క్లీనర్‌ నుంచి

పిండి ముద్దలాంటి ప్లే-డోతో పిల్లలు రకరకాల ఆకారాలు, బొమ్మలు చేస్తుంటారు కదా. అసలు దీన్ని తయారుచేసింది ఆడుకోవటానికి కాదు. శుభ్రపరచటానికి. కుటోల్‌ అనే సబ్బుల సంస్థ 1900 ఆరంభంలో దీన్ని సృష్టించింది. ఇంట్లో వాల్‌పేపర్ల మీద అంటుకునే బొగ్గు నుసిని తొలగించటానికి దీన్ని తయారుచేసింది. అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంటిని వెచ్చగా ఉంచటానికి బొగ్గుకు బదులు గ్యాస్‌ వాడకం పెరిగింది. దీంతో ఇంట్లో నుసి అంటుకోవటం తగ్గిపోయింది. అదే సమయంలో వినైల్‌ వాల్‌పేపర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వాల్‌పేపర్లను శుభ్రపరచే ముద్దలకు ఆదరణ తగ్గిపోయంది. అప్పట్లో ఒక స్కూలు టీచర్‌ ఈ ముద్దలతో పిల్లలకు రకరకాల ఆకృతులు చేయటం నేర్పించేవారు. ఆమె కంపెనీ యజమానికి బంధువే. దీన్ని ఆటవస్తువుగా మారిస్తే బాగుంటుందని పట్టుబట్టారు. ప్లే డో అనే పేరునూ సూచించారు. పిల్లల చేతులకు ఇది హాని చేయకపోవటం వల్ల అనతికాలంలోనే ప్రాచుర్యం పొందింది.

ప్లే-డో క్లీనర్‌

సెలోఫేన్‌ తడవని వస్త్రాల నుంచి

ఆహార పదార్థాలు చెడిపోకుండా వాటి పైన కప్పే పారదర్శక ప్లాస్టిక్‌ పొర.. అదే సెలోఫేన్‌ గురించి అందరికీ తెలిసిందే. నిజానికిది వస్త్రాలు నీటికి తడవకుండా చూడాలనే ప్రయత్నంతోనే పురుడు పోసుకుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్త జాక్వెస్‌ ఇ.బ్రాండెన్‌బర్గర్‌ 1908లో దీన్ని రూపొందించారు. ఆయన ద్రవ విస్కోస్‌ రేయాన్‌ను ఆయా వస్తువుల మీద పరచి, వలిచినప్పుడు ఓ పారదర్శక పొర ఊడి వచ్చింది. ఇది చాలా పలుచగా ఉండటంతో వస్త్రాల పైపొరగా అంతగా ఉపయోగ పడదని గుర్తించారు. వస్తువుల ప్యాకింగ్‌కైతే బాగా పనికి వస్తుందని భావించారు. దీనిలోని ముడి పదార్థమైన సెల్యులోజ్‌ (వృక్ష కణ గోడల్లో ఉండే ముఖ్య పదార్థం).. డయాఫేన్‌ (పారదర్శకం) పదాలను కలిపి 'సెలోఫేన్‌' అని పేరు పెట్టారు. పేటెంట్‌ తీసుకున్నారు. తక్కువకాలంలోనే ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడిది ఆన్‌లైన్‌లో, సూపర్‌ మార్కెట్లలో అమ్మే ఆహార పదార్థాల మీద పైపొరగా ఎంతగానో ఉపయోగపడుతోంది. దాదాపు ప్రతి వంటింట్లోనూ దర్శనమిస్తోందన్నా అతిశయోక్తి కాదు.

సెలోఫేన్‌

ట్రెడ్‌మిల్‌ శిక్షల నుంచి

వారాంత వినోదం అనంతరం మర్నాడు ట్రెడ్‌మిల్‌ మీద నడుస్తుంటే ఏదో శిక్ష అనుభవిస్తున్నట్టే ఉంటుంది కదా. అసలు ట్రెడ్‌మిల్‌ ఉద్దేశమూ అదే! దీనికి పూర్వరూపం ట్రెడ్‌వీల్‌. దీన్ని విలియం క్యూబిట్‌ అనే సివిల్‌ ఇంజినీర్‌ 1818లో తయారుచేశారు. ఫిట్‌నెస్‌ను పెంచుకోవటానికి కాదు, ఖైదీలను శిక్షించటానికి. ఒక పెద్ద చక్రానికి చుట్టూ చెక్క పలకలను అమర్చి దీన్ని రూపొందించారు. కాళ్లతో చెక్క పలకలను తొక్కితే చక్రం గుండ్రంగా తిరుగుతుంది. కింద పడిపోకుండా పట్టుకోవటానికి పిడులు ఏర్పాటు చేశారు. ఖైదీలంతా ఒకేసారి, ఒకే వేగంతో చక్రాన్ని తిప్పాల్సి ఉండేది. ఒకరితో మరొకరు మాట్లాడకుండా మధ్యలో అడ్డు గోడలూ ఉండేవి. కఠిన శిక్షలు పడ్డవారు రోజుకు 6 గంటల సేపు ట్రెడ్‌వీల్‌ను తొక్కాల్సి వచ్చేది. ఇది సుమారు 4,260 మీటర్ల ఎత్తు వరకు ఎక్కటంతో సమానం. తొలిసారిగా దీన్ని లండన్‌లోని బ్రిక్స్‌టన్‌ జైలులో ఏర్పాటు చేశారు. అయితే 1902లో ట్రెడ్‌వీల్‌ శిక్షలను రద్దు చేయటంతో దీని వాడకం ఆగిపోయింది. శిక్షకు బదులుగా నీళ్లు తోడటానికి, పిండి పట్టటానికి ఉపయోగించకోవటం మొదలెట్టారు. ఫిట్‌నెస్‌ పెరగటానికి తోడ్పడుతుండటంతో క్రమంగా ఇదే ట్రెడ్‌మిల్‌గా రూపాంతరం చెందింది. ఇప్పుడిది ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ పొందుతోందో చెప్పాల్సిన పనిలేదు.

ట్రెడ్‌మిల్‌

లిస్టరిన్‌ యాంటీసెప్టిక్‌ ద్రావణం నుంచి

నోటి దుర్వాసన తగ్గించటానికి లిస్టరిన్‌ మౌత్‌వాష్‌ను చాలామంది వాడుతూనే ఉంటారు. అయితే మొదట్లో దీన్ని యాంటీసెప్టిక్‌ ద్రావణంగా వాడుకునేవారనే సంగతి తెలుసా? యాంటీసెప్టిక్‌ ఔషధ పితామహుడిగా భావించే సర్‌ జోసెఫ్‌ లిస్టర్‌ 1879లో దీన్ని సృష్టించారు. హానికారక సూక్ష్మక్రిముల నిర్మూలన కోసమే ఆయన ఆల్కహాల్‌తో కూడిన ఈ ద్రావణాన్ని తయారుచేశారు. అప్పట్లో ఆపరేషన్‌ థియేటర్‌లో పరికరాలను శుభ్రం చేయటానికి దీన్ని వాడేవారు. పుండ్లు కడగటానికి, చుండ్రు చికిత్సల్లోనూ ఉపయోగించేవారు. గచ్చులనూ తుడిచేవారు. ఇది క్రిములను సమర్థంగా నిర్మూలిస్తుండటంతో క్రమంగా దంత వైద్యులు నోటిని శుభ్రం చేయటానికీ వాడుకోవటం ఆరంభించారు. మంచి ఫలితం కనిపిస్తుండం వల్ల నోటి దుర్వాసనను తొలగించటానికి 1920ల్లో మార్కెట్‌లోకి విడుదల చేశారు. లిస్టర్‌ పేరు మీదుగానే దీనికి లిస్టరిన్‌ అని పేరు పెట్టారు. అప్పట్నుంచీ మౌత్‌వాష్‌గా స్థిరపడిపోయింది.

కోకా కోలా వ్యసనాన్ని వదిలించుకునే ప్రయత్నం నుంచి

దాహాన్ని తీర్చే కోకా కోలా గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ పానీయంగానూ మారిపోయింది. అయితే దీన్ని సృష్టించిన జాన్‌ పెంబర్టన్‌ ఉద్దేశం వేరు. మత్తును కలిగించే మార్ఫిన్‌ వాడకం నుంచి బయటపడటానికి దీన్ని తయారుచేశారు. ఆయన 19వ శతాబ్దం చివర్లో జరిగిన కొలంబస్‌ యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డారు. నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి మార్ఫిన్‌ వంటి మందులకు అలవాటు పడ్డారు. దీన్నుంచి బయటపడాలని ప్రయత్నిస్తుండగా ఫ్రెంచ్‌ వైన్‌ కోకా గురించి తెలిసింది. యాంజెలో మారియానీ అనే రసాయన శాస్త్రవేత్త కోకా ఆకుల రసం, బోర్డియాక్స్‌ వైన్‌లను కలిపి దీన్ని తయారు చేశారు. కోకా ఆకుల రసంలోని కొకైన్‌ మూలంగా ఇది సత్వరం శక్తిని పెంచేది. కొకైన్‌ వాడకాన్ని 1914లో నిషేధించారు గానీ అప్పటివరకూ వికారం, ఆస్థమా, మలబద్ధకం తగ్గించే మాత్రలు, టానిక్‌లలో విరివిగానే వాడేవారు. కోకా వైన్‌ ఎప్పటికైనా బాగా ఆదరణ పొందగలదని భావించిన పెంబర్టన్‌ తమ ప్రాంతంలో అమ్మాలనుకున్నారు. అయితే ఆల్కహాల్‌ ఉండటంతో స్థానిక చట్టం అంగీకరించలేదు. దీంతో ఆయన ఆల్కహాల్‌కు బదులు చక్కెర పానకం, కెఫీన్‌తో కూడిన కోలా పలుకుల సారాలను కలిపి కొత్తరకం పానీయాన్ని రూపొందించారు. కోకా ఆకుసారాన్ని అలాగే ఉంచేశారు. ఇలా కోకా-కోలా పానీయం పుట్టుకొచ్చింది. శాస్త్రవేత్తలు 1929లో కోకా ఆకు రసంలోని ఉత్ప్రేరక పదార్థాలను తొలగించటంతో కోకా-కోలా పూర్తిగా కొకైన్‌ రహితంగా మారింది.

కోకా కోలా

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details