Chandrayaan 3 Timeline In Telugu :జాబిల్లిని చేరుకునేందుకు చంద్రయాన్-3 ప్రయాణం 41 రోజులు సాగింది. జులై 14న శ్రీహరికోట నుంచి LVM3-M4 రాకెట్ ద్వారా చంద్రయాన్-3ను ప్రయోగించగా అది జాబిల్లిని చేరుకోవడానికి ఇస్రో పలు విన్యాసాలను చేపట్టింది. కక్ష్య పెంపు, తగ్గింపు విన్యాసాలను విజయవంతగా చేపట్టి చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరువ చేసింది. మరికొద్ది సేపట్లో జాబిల్లి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించాలని ఇస్రో భావిస్తోంది.
'చంద్రయాన్-3' సాగిందిలా..
- జులై 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి చంద్రయాన్-3 వ్యోమనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
- జులై 15న కక్ష్య పెంపు విన్యాసాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టారు.
- ఈ కక్ష్య పెంపు క్రతువును ఇస్రో శాస్త్రవేత్తలు జులై 17, 22, 25 తేదీల్లో చేపట్టి జులై 31 వరకు కొనసాగించారు.
- ఆగస్ట్ 1న చంద్రుడి కక్ష్య వైపు పయనం సాగించేందుకు వీలుగా ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్‌లోకి వ్యోమనౌకను ఇస్రో ప్రవేశపెట్టింది.
- ఆగస్టు 5న చంద్రయాన్-3 విజయవంతంగా జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది.
- వ్యోమనౌకను చంద్రుడిని సమీపించేందుకు వీలుగా ఆగస్ట్ 6 ( 170 కిమీ x 4313 కిమీ), 9 (174 కిమీ x 1437 కిమీ), 14 (151 కిమీ x 179 కిమీ), 16 (153 కిమీ x 163 కిమీ) తేదీల్లో కక్ష్య తగ్గింపు విన్యాసాలను నిర్వహించారు.
- ఆగస్ట్ 17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విజయవంతంగా విడిపోయింది. జాబిల్లికి సంబంధించిన మెుదటి చిత్రాన్ని అందించింది.
- ఆగస్ట్ 18, 20 తేదీల్లో శాస్త్రవేత్తలు ల్యాండర్ వేగం తగ్గింపు ప్రక్రియను చేపట్టారు. ఈ దశలోనే ల్యాండర్ భూమికి కనిపించని జాబిల్లి దక్షిణ ధ్రువానికి సంబంధించిన ఫొటోలను చిత్రీకరించింది.
-
ఆగస్ట్ 21న చంద్రయాన్-2 ఆర్బిటర్.. చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్‌కు 'మిత్రమా!' అని స్వాగతం పలికింది. అనంతరం రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఏర్పాటయింది.
-
ఆగస్ట్ 22న చంద్రయాన్-3లోని ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా- LPDC ద్వారా దాదాపు 70 కిలో మీటర్ల ఎత్తు నుంచి తీసిన చిత్రాలని ఇస్రో విడుదల చేసింది. చంద్రయాన్ వ్యవస్థలను సాధారణ తనిఖీ చేసింది.