రాష్ట్రంలో పూల సంబురం మొదలైంది. మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తారు. ఒక్కో రోజు ఒక్కో రకంగా పిలుస్తూ... ప్రత్యేకమైన నేవేద్యాలు సమర్పిస్తారు. ఎంగిలి పూల బతుకమ్మ... అటుకుల బతుకమ్మ.. ముద్దపప్పు బతుకమ్మ.. నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ ఇలా ఒక్కో రోజు ఒక్కో పేరుతో కొలుస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేకమైన ప్రసాదాలను నివేదిస్తారు. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మనాడు... సత్తుపిండి, పెరుగన్నం, పులిహోర, మలీద ముద్దలు, కొబ్బరన్నం, నువ్వులన్నం నైవేద్యంగా సమర్పిద్దామా మరి!
మలీద లడ్డూ...
కావాల్సినవి:గోధుమ పిండి- కప్పు, నూనె- మూడు చెంచాలు, ఉప్పు- తగినంత, సోంపు పొడి, యాలకుల పొడి- పావు చెంచా చొప్పున, నెయ్యి- పావు కప్పు, గసగసాలు- అర చెంచా, ఎండుకొబ్బరి తురుము, బెల్లం- అర కప్పు చొప్పున.
తయారీ: పిండిని మరీ గట్టిగా లేదా మెత్తగా కాకుండా కాస్తంత నూనె, ఉప్పు వేసి చపాతీ పిండిలా కలిపి పావుగంట పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఉండలు చేసి, కాస్త మందంగా చపాతీలు చేసుకోవాలి. వీటిని పెనం మీద వేసి రెండు వైపులా నెయ్యితో చక్కగా కాల్చాలి. ఈ చపాతీలను ముక్కలు చేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. దీంట్లో బెల్లం, ఎండు కొబ్బరి తురుము; సోంపు పొడి, యాలకుల పొడి వేసి, కాస్తంత నెయ్యి జత చేసి బాగా కలిపి లడ్డూల్లా చేసుకోవాలి. గసగసాలను బయటి నుంచి లడ్డూలపై చల్లుకుంటే సరి. తియ్యటి మలీద లడ్డూలు రెడీ.
మలీద ముద్దలు.. వీటి నుంచి ఇనుము లభిస్తుంది. కెలొరీలు తక్కువగా ఉండే ప్రసాదం. ప్రొటీన్లు, పీచు కూడా వీటి నుంచి అందుతాయి.
బియ్యం సత్తుపిండి..
కావాల్సినవి: బియ్యం- కప్పు, చక్కెర- అర కప్పు, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, యాలకులు- నాలుగు.
తయారీ: పొయ్యి వెలిగించి కడాయి పెట్టాలి. ఇందులో బియ్యం వేసి దోరగా, లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించి, చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. మిక్సీజార్‌లో చక్కెర, యాలకులు వేసి పొడి చేసి పక్కన పెట్టాలి. అందులోనే వేయించిన బియ్యం వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. అది వేడయ్యాక బియ్యప్పిండి వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి. చల్లారిన బియ్యప్పిండిలో చక్కెర వేసి మిశ్రమాన్ని చక్కగా కలపాలి. అంతే రుచికరమైన, పోషకభరితమైన బియ్యం సత్తుపిండి రెడీ. దీన్ని ప్రసాదంగా సమర్పించాలి.
సత్తు పిండి... దీన్ని మొక్కజొన్న, పెసర్లతోనూ చేస్తారు. ప్రత్యేకమైన సువాసనలతో తేలికగా జీర్ణమయ్యే ప్రసాదం. తక్కువ కెలొరీలుండే పదార్థం. చిన్నపిల్లలకూ చక్కగా జీర్ణమవుతుంది.
చింతపండు పులిహోర...
కావాల్సినవి:బియ్యం- అర కిలో, చింతపండు- 100 గ్రా., మెంతులు- అర చెంచా, ఉప్పు, నూనె- తగినంత, అల్లం ముక్కలు, పసుపు- అర చెంచా చొప్పున, పచ్చిశనగ పప్పు, మినపప్పు- చెంచా చొప్పున, ఆవాలు- అర చెంచా, పల్లీలు- గుప్పెడు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి- నాలుగేసి చొప్పున, కరివేపాకు- రెండు, మూడు రెమ్మలు.
తయారీ:అన్నం వండి సిద్ధంగా పెట్టుకోవాలి. చింతపండులో తగినన్ని నీళ్లు పోసి నానబెట్టి గుజ్జును తీయాలి. మెంతులు, ఆవాలను వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. మరో పాత్రలో నూనె పోసి పోపు పదార్థాలన్నీ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి చింతపండు గుజ్జు పోసి చిన్న మంటపై ఉడికించాలి. ఇందులోనే ఉప్పు, పసుపు కలపాలి. గుజ్జు చిక్కగా అయ్యాక ఆవాలు, మెంతి పొడి వేసి కలపాలి. ఇందులో పోపు మిశ్రమాన్ని కలిపేయాలి. దీన్ని అన్నంలో వేసి కలిపి కాసేపు పక్కన పెట్టాలి. పులిహోర మెత్తగా మారకూడదంటే... పెద్ద చెంచా నువ్వుల నూనెను కలపాలి. అంతే పుల్లపుల్లని కమ్మని చింతపండు పులిహోర సిద్ధమైనట్లే.
పులిహోర.. నిదానంగా జీర్ణమయ్యే పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో వేసే ఇంగువ, మిరియాలు, పసుపు, చింతపండు, ఆవాలతో రకరకాల లవణాలు, యాంటీఆక్సిడెంట్లు అందుతాయి.