సమాచార విప్లవానికి సంకేతాలైన చరవాణుల్ని వినియోగిస్తున్నవారిలో అత్యధికులకు సుప్రసిద్ధ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్'ను ఇప్పుడెవరూ కొత్తగా పరిచయం చేయనక్కరలేదు. అంతర్జాలం ఉపయోగిస్తున్నవారి సంఖ్య 70కోట్లకు పైబడి అనుదినం పెరుగుతూనే ఉన్న దేశం మనది. అందులో వాట్సాప్ వాడకందారులు 40కోట్లకు పై మాటేనంటే- ఆ యాప్ విస్తృతి ఎంతటిదో ఇట్టే బోధపడుతుంది. అంతగా జనజీవితాల్లోకి చొచ్చుకుపోయిన వాట్సాప్ ఇటీవల తమ గోప్యతా విధానాన్ని మార్చామని, ఫిబ్రవరి ఎనిమిదో తేదీలోగా దానికి ఆమోదం తెలపనివారు యాప్‌నిక వాడుకోలేరని వెల్లడించింది. నూతన విధానం ప్రకారం తన యాజమాన్య సంస్థ ఫేస్‌బుక్‌తో, అనుబంధ విభాగాలతో వాట్సాప్ తమ సమాచారం పంచుకోనుందనడం దేశదేశాల్లోని సుమారు 200కోట్లమంది వినియోగదారుల్ని దిగ్భ్రమకు గురిచేసింది.
వాట్సాప్ నెగ్గుతుందా..?
స్వీయ వ్యక్తిగత సమాచారం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలకు అందుబాటులో ఉంటే తమ వివరాలన్నీ నెట్టింట్లో బహిర్గతమైనట్లేనన్న ఆందోళనతో అనేకమంది ప్రత్యామ్నాయాల అన్వేషణ ప్రారంభించారు. పర్యవసానంగా రోజుల వ్యవధిలోనే టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి ఇతర యాప్‌లవైపు లక్షలమంది తరలిపోవడం- సహజంగానే వాట్సాప్‌లో గుబులు పుట్టించింది. గోప్యతా విధానానికి సంబంధించి వివాదాస్పద నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రప్రభుత్వమే నేరుగా సూచించింది. దానిపై కిమ్మనని వాట్సాప్, వినియోగదారుల సమాచార భద్రతకు ఢోకా లేదంటూ కొత్త విధానం అమలును మే పదిహేనో తేదీ వరకు వాయిదా వేసింది. ఆలోగా ప్రతిపాదిత మార్పులపై అందరిలో సదవగాహన పెంపొందిస్తామనడాన్ని బట్టి, ఏదో ఒక విధంగా పంతం నెగ్గించుకోవాలన్న ధోరణే వాట్సాప్‌లో ప్రస్ఫుటమవుతోంది!
ఇదీ చదవండి:వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్... ఏది సేఫ్?
ఇదీ చదవండి:వాట్సాప్ వద్దనుకుంటే.. ఈ యాప్‌లు ట్రై చేయండి!
రాజీపడెేది లేదు..
వాట్సాప్ నూతన విధానాన్ని సవాలు చేస్తూ ఓ న్యాయవాది దాఖలు పరచిన వ్యాజ్యాన్ని తోసిపుచ్చుతూ 'మీకు నచ్చకపోతే ఆ యాప్‌ను ఉపయోగించడం మానెయ్యండి' అని దిల్లీ హైకోర్టు స్పందించింది. అంతటితో సమస్య ముగిసిపోతుందని భావించ వీల్లేని సున్నిత అంశమిది. సమాచార భద్రతపై సర్వోన్నత న్యాయస్థానంలో ఇటీవలే మరో అర్జీ వార్తలకెక్కింది. నిర్దేశిత ప్రమాణాల మేరకు డేటా భద్రత అన్నది లేదని, అదనపు పరిరక్షణ అత్యవసరమన్న వాదనల్ని, సమాచార తస్కరణ ఆరోపణల్ని వాట్సాప్ ఖండించింది. ఎవరి ధోరణి ఎలాగున్నా, దేశ పౌరుల వ్యక్తిగత గోప్యతపై ఏ దశలోనూ రాజీ క్షంతవ్యం కానిది. రాజ్యాంగబద్ధమైన జీవన హక్కు, సమానత్వ హక్కు, భావప్రకటన స్వేచ్ఛ మాదిరిగా వ్యక్తిగత గోప్యతా ప్రాథమిక హక్కేనని 2017లో స్పష్టీకరించిన సుప్రీం ధర్మాసనం- దాన్ని పరిరక్షించే బాధ్యతను ప్రభుత్వాలకు కట్టబెట్టింది. వాస్తవానికి తొంభైదాకా దేశాల్లో పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతను కాపాడే శాసనాలు పకడ్బందీగా అమలవుతున్నాయి.
విదేశాల్లో అలా.. భారత్‌లో ఇలా..
ఐరోపా సంఘం రూపొందించిన జీడీపీఆర్(జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్) ఆ కోవలో శ్రేష్ఠమైనదిగా విశిష్ట గుర్తింపు పొందింది. ఫేస్‌బుక్‌తో వాట్సాప్ వినియోగదారుల సమాచారం పంచుకుంటానంటే, అక్కడ అది చెల్లుబాటు కానేకాదు. అటువంటి పటిష్ఠ చట్టం ఇక్కడ కొరవడిందన్న లోకువతో కుప్పిగంతులు వేస్తున్న వాట్సాప్‌ను భారతప్రభుత్వం తేలిగ్గా వదిలిపెట్టకూడదు. నేడిది, రేపు మరో సంస్థ... పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ఇతరత్రా ప్రయోజనాల నిమిత్తం బహిరంగపరచే వీల్లేకుండా- పటుతర శాసన నిర్మాణం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. 2019 డిసెంబరులో పార్లమెంటు ముందుకు వచ్చి నెలల తరబడి స్థాయీసంఘం పరిశీలనలో ఉన్న 'వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు'ను దుర్బలమైందిగా నిపుణులు చెబుతున్నారు. జీడీపీఆర్ నమూనాలో దేశీయంగా బలిష్ఠమైన చట్టనిబంధనావళి సత్వర అమలుకు బాటలు పరవడమే- వాట్సాప్ తరహా బాగోతాలకు సరైన విరుగుడు!
ఇదీ చదవండి:డేటా షేరింగ్‌పై 'వాట్సాప్' వివరణ
ఇదీ చదవండి:టెలిగ్రామ్@500 మిలియన్ డౌన్లోడ్లు