నవంబరు 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు యావత్ ప్రపంచం మీద దీర్ఘకాల ప్రభావం కనబరుస్తాయి. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ గెలిచినట్లయితే అంతర్జాతీయ వైరుధ్యాలు తీవ్రతరమవుతాయని, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలిస్తే ప్రపంచ దేశాల మధ్య సరికొత్త సహకార శకం మొదలవుతుందని సూత్రీకరణలు వినిపిస్తున్నాయి.
ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపడితే తన దురుసు పంథా మార్చుకోవచ్చు అనేవారూ ఉన్నారు. అమెరికాకు ఉన్న బృహత్తర స్వదేశీ మార్కెట్, పారిశ్రామిక, సైనిక శక్తి, డాలర్ ప్రాబల్యాన్ని ఆధారంగా చేసుకుని ట్రంప్.. చైనా, ఐరోపా సమాఖ్య (ఈయూ)లతో గట్టిగా బేరమాడి గరిష్ఠ ప్రయోజనం సాధిస్తారని వారి అంచనా. కానీ దౌత్యాన్ని, అంతర్జాతీయ సంబంధాలను కేవలం వ్యాపార కోణంలో చూస్తే, అగ్ర రాజ్యంగా అమెరికా తనకున్న గౌరవాన్ని తానే పోగొట్టుకొంటుంది. ట్రంప్ జమానాలో జరిగింది అదే. ఎవరి స్వార్థం వారు చూసుకోవడాన్ని ఒక విధానంగా ముందుకు తెచ్చారాయన.
కలిసికట్టు విధానాలు సందేహాస్పదం
ప్రపంచ దేశాలు కలిసి కుదుర్చుకున్న పారిస్ వాతావరణ ఒప్పందానికి ట్రంప్ నీళ్లు వదిలారు. ఇరాన్ అణు ఒప్పందాన్ని, విశాల పసిఫిక్ వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని తుంగలో తొక్కారు. ఐక్యరాజ్య సమితి సంస్థల నుంచి వైదొలగారు. తద్వారా ట్రంప్ తనకు అంతర్జాతీయ సహకారం, ప్రమాణాల మీద ఏమాత్రం గౌరవం లేదని నిరూపించుకున్నారు.
ఇంతలో కొవిడ్ విరుచుకుపడి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే, దాన్ని ఎదుర్కోవడానికి నాయకత్వం వహించాల్సిందిపోయి- ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగుతానని ట్రంప్ ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధం తరవాత బహుళపక్ష సహకారానికి సారథిగా వ్యవహరించిన అమెరికా, ట్రంప్ మూలంగా ఆ పాత్ర నుంచి వైదొలగుతోంది. ఇది తాత్కాలిక అపశ్రుతి కావచ్చునని, ట్రంప్ బదులు వేరే అధ్యక్షుడు పగ్గాలు చేపడితే పరిస్థితి మారవచ్చని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.
ట్రంప్ ఓడిపోవాలని..
ఇటీవల ఏడు ఐరోపా దేశాల్లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో అత్యధికులు ట్రంప్ ఓడిపోవాలని కోరుకున్నారు. ఒకవేళ ట్రంప్ మళ్ళీ గెలిస్తే ఇతర దేశాలు అమెరికా మార్గదర్శకత్వం కోసం ఎదురు చూడటం మానేసి తామే బహుళ ధ్రువ ప్రపంచ సృష్టికి ప్రయత్నించవచ్చు. ప్రస్తుత అస్తవ్యస్త పరిస్థితికి రాజకీయాలు, వ్యాపార పోటీ, భౌగోళికంగా అంతరాలు మాత్రమే కారణాలు కావు. 5జీ, కృత్రిమ మేధ, త్రీడీ ప్రింటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సాంకేతికతలతో ఆవిర్భవించే డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అగ్ర స్థానం కోసం పోటీయే ప్రధాన కారణం.
డిజిటల్ యుద్ధం..
ప్రస్తుతం మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆపిల్, గూగుల్, ఫేస్‌బుక్ వంటి టెక్ సంస్థలు డిజిటల్ రంగంలో అగ్రగాములుగా ఉన్నాయి. వీటికి చైనా కంపెనీల నుంచి పోటీ ఎదురవుతోంది. మరోవైపు, ఐరోపా సమాఖ్య (ఈయూ) అమెరికా టెక్ కంపెనీల ఇష్టారాజ్యానికి చెక్ పెట్టే నియంత్రణల చట్రాన్ని రూపొందించింది. డిజిటల్ ఆధిపత్యం కోసం అమెరికా చైనాతోపాటు ఐరోపా సమాఖ్య (ఈయూ) మీదా టారిఫ్ యుద్ధాన్ని ప్రారంభించింది. దీనివల్ల చైనా, ఈయూ దేశాలు దగ్గరవుతున్నాయి.
ట్రంప్ రెండోసారి గెలిస్తే ప్రజాస్వామ్యం గురించి, మానవ హక్కుల గురించి ధర్మపన్నాలు పలకకుండా ఫక్తు వ్యాపారిలా అన్ని విషయాల్లో లాభం కోసం చూసుకుంటారు. కానీ, తన దురుసు ప్రవర్తనతో చిరకాల మిత్ర దేశాలను దూరం చేసుకున్నందువల్ల ఆయన ప్రయత్నాలు ఆశించినంతగా సఫలం కాకపోవచ్చు.