అమెరికా, చైనాల మధ్య ఆధిపత్య పోటీ భూమి నుంచి అంతరిక్షంలోని చంద్ర, కుజ గ్రహాలకు విస్తరిస్తోంది. ఈ రెండు దేశాలు ఖగోళాన్ని తమ ఆర్థిక మండలంగా ప్రకటించుకోవడం ప్రపంచ దేశాలకు కొత్త డోలాయమాన స్థితిని తెచ్చిపెడుతోంది. అమెరికా, చైనాల స్థాయిలో కాకపోయినా భారతదేశం కూడా తనదైన శైలిలో కుజచంద్ర గ్రహ యాత్రలు చేపడుతోంది. గత ఏప్రిల్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును, చైనా అంతరిక్ష లక్ష్యాలను చూస్తే- భారత్ తన అంతరిక్ష ప్రయోజనాలను పదిలపరచుకోవడానికి వేగంగా ముందుకు కదలాలని అవగతమవుతుంది. చందమామ నుంచి తాము ఖనిజ నిక్షేపాలను తవ్వితీస్తుంటే అభ్యంతరపెట్టేవారిని అమెరికా వ్యతిరేకిస్తుందని ట్రంప్ ఉత్తర్వు హెచ్చరిస్తోంది. ఇంతకీ చంద్రుడి నుంచో, కుజుడి నుంచో, మరేదైనా గ్రహశకలాల నుంచో ఖనిజాల కోసం తవ్వకాలను ఎవరైనా ఎందుకు వ్యతిరేకిస్తారు? దీనికి సమాధానం కోసం 1979లో ఐక్యరాజ్యసమితి అంతరిక్ష వ్యవహారాల కార్యాలయం ఆధ్వర్యంలో కుదిరిన చందమామ ఒప్పందంలో వెతకాలి. భారత్, ఫ్రాన్స్, పాకిస్థాన్ లతోపాటు మొత్తం 18 దేశాలు సంతకం చేసిన ఈ ఒప్పందాన్ని అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్ వంటి ప్రధాన దేశాలు మాత్రం ఆమోదించలేదు. భారత్ కూడా సంతకం చేసిందే గాని, సాధికారికంగా ఆమోదించలేదు. ట్రంప్ ఉత్తర్వు చూపిన బాటలో భారత్ సైతం లాంఛనంగా 1979 చందమామ ఒప్పందం నుంచి నిష్క్రమించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం చంద్రుడిపై సైనిక స్థావరాలు ఏర్పాటు చేయకూడదు, అక్కడ మానవ కార్యకలాపాలు శాంతియుత ప్రయోజనాలకు దోహదం చేసేవిగా ఉండాలి. ఈ ఒప్పందాన్ని శిరసా వహిస్తే, చంద్రుడి నుంచి వెలికితీసే వనరులను సమస్త మానవాళితో పంచుకోవలసి ఉంటుంది. దానిపై సంతకం చేయని దేశాలకు అటువంటి బాధ్యత ఉండదు. అందుకే చంద్రుడు, మరి ఇతర ఖగోళ భాగాల నుంచి వాణిజ్య ప్రాతిపదికపై వనరులను వెలికితీసి వినియోగించడంపైన, ఈ కార్యకలాపాల్లో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంపైన నెలకొని ఉన్న అనిశ్చితిని తొలగించాల్సి ఉందని ట్రంప్ ఉత్తరర్వు పేర్కొంటోంది. 1979 ఒప్పందం ఇందుకు దోహదం చేయడం లేదనీ వాదించింది. చైనా ఈ ఒప్పందాన్ని అడ్డుపెట్టుకుని తమకు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని అమెరికన్లు అనుమానిస్తున్నారు. అందుకే ఖగోళ వనరుల వినియోగంపై ఎటువంటి అభ్యంతరాలను లెక్కచేసేది లేదని ట్రంప్ ఉత్తర్వు స్పష్టం చేస్తోంది.
'బీజింగ్ అజెండా'పై చర్చ
చైనా తన సొంత అంతరిక్ష అజెండాతో ముందుకువెళుతోంది. చంద్రుడి పైకి వ్యోమగాములను తీసుకెళ్లే ఫ్లెక్సిబుల్ ఇన్ ఫ్లేటబుల్ కార్గో రీఎంట్రీ వెహికల్ (ఎఫ్.ఐ.సి.ఆర్.వి.)ని భారీ లాంగ్ మార్చ్ రాకెట్ పై ఇటీవల ప్రయోగించింది. భూమి-చంద్రుల మధ్య ప్రత్యేక ఆర్థిక మండలాన్ని ప్రకటించాలని చూస్తున్న చైనా, తన లక్ష్య సాధన కోసం ఈ రాకెట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష సేవలు, పారిశ్రామికోత్పత్తి, అంతరిక్ష ఖనిజ వనరుల వినియోగం ద్వారా 10 లక్షల కోట్ల డాలర్లు ఆర్జించడానికి చైనా ఈ ప్రత్యేక ఆర్థిక మండలాన్ని ప్రకటించబోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా అమెరికా ఆర్టెమిస్ ఒప్పందాన్ని ముందుకుతెచ్చింది. పౌర ప్రయోజనాల కోసం అంతరిక్ష అన్వేషణకు, ఖగోళ వనరుల వినియోగానికి ఉమ్మడి సూత్రాలను రూపొందించాలని ఆర్టెమిస్ లక్షిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ 1979 చందమామ ఒప్పందం నుంచి వైదొలగి ఆర్టెమిస్ ఒప్పందంలో భాగస్వామి కావాలని కొందరు నిపుణులు బలంగా ప్రతిపాదిస్తున్నారు. ఈ సూచనను భారత ప్రభుత్వం లోతుగా పరిశీలించబోతోంది. చంద్రయాన్, మంగళ్ యాన్, గగన్ యాన్ ప్రణాళికలతో భారత్ అంతరిక్షంలో తన ఉనికిని బలంగా చాటుకొంటున్న సంగతిని ఇక్కడ గమనించాలి. చైనాకు దీటుగా భారత్ రోదసిలో దూసుకెళ్లడానికి అమెరికా సహకారం అవసరపడుతుంది.
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో జోరుగా అంతరిక్ష కార్యకలాపాలను చేపట్టడానికి అమెరికా సిద్ధమవుతోంది. ఇందుకోసం అమెరికా వైమానిక-అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) భారీ రాకెట్లను సిద్ధం చేస్తోంది. ప్రైవేటు రంగంలో స్పేస్ ఎక్స్, అమెజాన్, బోయింగ్, లాక్ హీడ్ సంస్థలు సొంత అంతరిక్ష రాకెట్లను, వాహనాలను రూపొందిస్తున్నాయి. స్పేస్ ఎక్స్ ఇప్పటికే పలు ప్రయోగాలను విజయవంతంగా పూర్తిచేసింది. అమెరికన్ ప్రైవేటు కంపెనీలు అంతరిక్ష కేంద్రాల నిర్మాణంతోపాటు, భూమి నుంచి వ్యోమగాములను, సాధన సంపత్తిని రవాణా చేయడానికి, ప్రభుత్వం తరఫున అంతరిక్ష గుత్తేదారులు పనిచేయడానికి సిద్ధమవుతున్నాయి. సహజంగానే అమెరికా పథకాలను చైనా ఖండిస్తోంది. అమెరికా ఆర్టెమిస్ ఒప్పందాన్ని ప్రకటించిన రోజునే చైనా ఎఫ్.ఐ.సి.ఆర్.వి. వాహనాన్ని ప్రయోగించడం గమనార్హం. 2050కల్లా భూమి-చంద్ర ఆర్థిక మండలాన్ని ఏర్పాటు చేయాలని చైనా సంకల్పిస్తోంది. ప్రభుత్వ సంస్థ అయిన చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్‌కు ఈ మండల బాధ్యతను అప్పగించింది. ఈ విధంగా అమెరికా, చైనాలు రోదసిలో పోటీపడుతూ, ఇతర దేశాలను తమ పరిధిలోకి ఆకర్షించాలని చూస్తున్నాయి.