పౌరుల స్వేచ్ఛ, రాజ్యాంగ విలువల పరిరక్షణలో పెట్టనికోటలా నిలుస్తున్న న్యాయవ్యవస్థ మీద ఈమధ్య కాలంలో తీవ్రమైన దాడి జరుగుతోంది. ఈ వ్యవస్థ ఇంకెంతమాత్రమూ స్వతంత్రమైనది, విశ్వసనీయమైనది కాదని భావించే వర్గాలు కొన్ని ఈ దుస్సాహసానికి ఒడిగడుతున్నాయి. భారత్ స్వాతంత్య్రం పొందిన తొలినాళ్ల నుంచే న్యాయవ్యవస్థ నిస్పాక్షికత మీద తరచూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య దేశాల్లో వ్యవస్థల స్వతంత్రత, విశ్వసనీయతల మీద చర్చలు సహజమే. బలమైన ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లోనూ ఈ చర్చ కచ్చితంగా జరుగుతుంది, జరగాలి! అలాగని, ఉన్నత న్యాయవ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు మర్యాద మీరకూడదు. ఎవరైనా ఏదైనా మాట్లాడగలిగే స్వేచ్ఛ కలిగిన- సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక.. న్యాయవ్యవస్థ మీద అనాలోచితమైన, బాధ్యతారహిత వ్యాఖ్యలు పెరుగుతున్నాయి. ఎవరికి వారు ఇలాంటి ధోరణికి దూరంగా ఉండాలి.
రాజ్యాంగ స్ఫూర్తికి పట్టం
పద్దెనిమిదేళ్లు నిండిన ఏ వ్యక్తికి అయినా తనకు నచ్చిన మతాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉందని ఈ నెల మొదట్లో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. మతమార్పిళ్లను నిరోధించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలన్న విజ్ఞప్తిని తిరస్కరించింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ పిటిషన్ మీద ఆసక్తి చూపించలేదు. ఆత్మప్రబోధానుసారం నడుచుకునే స్వేచ్ఛను, తనకు నచ్చిన మతాన్ని అవలంబించే, ప్రచారం చేసుకునే హక్కును పౌరులకు కల్పించిన 25వ అధికరణను గుర్తుచేసింది.
దీని తరవాత కొద్ది రోజులకే ఖురాన్‌లోని 26 సూక్తులను పరిహరించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పిల్లలకు మతబోధ చేయడానికి, అవిశ్వాసులపై ఉగ్రవాద మూకల దాడుల సమర్థనకు ఈ సూక్తులను ఉపయోగిస్తున్నారని పిటిషనర్ వాదించారు. ఈ పిటిషన్ 'పూర్తిగా నిరర్థకమైనది' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. షిల్లాంగ్ టైమ్స్ సంపాదకురాలు పాట్రిషియా ముఖిమ్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేస్తూ.. భావప్రకటనా హక్కుకు అత్యున్నత న్యాయస్థానం మరోసారి గొడుగుపట్టింది.
మేఘాలయలోని ఓ ప్రాంతానికి చెందిన ఆదివాసులు, బాస్కెట్‌బాల్ ఆడుకుంటున్న ఆరుగురు గిరిజనేతరుల మీద దాడిచేశారని జులై 2020లో పాట్రిషియా ఓ ఫేస్‌బుక్ పోస్టు పెట్టారు. దాడిచేసిన వారి మీద అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక ఆదివాసీ నేతల ఫిర్యాదుతో ఆమె మీద సెక్షన్ 153 ఏ కింద కేసు నమోదైంది. విభిన్న వర్గాల మధ్య విద్వేషాన్ని రగిలిస్తున్నారనే అభియోగాన్ని పాట్రిషియా మీద మోపారు. నిజానికి ఈ ఎఫ్‌ఐఆర్ అర్థరహితమైనది. విద్వేషం, హింసలకు పురిగొల్పే అంశాలేవీ ఆమె పోస్టులో లేవు. సుప్రీంకోర్టు ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేస్తూ 'క్రిమినల్ కేసుల్లో ఇరికించడం ద్వారా ఈ దేశ పౌరుల భావప్రకటనా స్వేచ్ఛను అణచివేయజాలరు' అని స్పష్టం చేసింది. పాట్రిషియా పోస్టులో 'విద్వేష వ్యాఖ్యలు' ఏమీ లేవంది.