ప్లాస్టిక్ వ్యర్థాలు(Plastic Waste) మానవాళికి, పర్యావరణానికి ఎంతో ముప్పు కలిగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 50 శాతం పాస్టిక్ ఉత్పత్తులు ఒకసారి వాడి పారేయదగ్గవే. ఈ తరహా ప్లాస్టిక్ పర్యావరణానికి(Plastic Pollution) హాని కారకమవుతోంది. వీటిని నిషేధించకపోతే 2050 నాటికి భూగోళంపై జీవజాతులకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం అయిదేళ్లుగా హెచ్చరిస్తోంది. ఇప్పటికే కెన్యా ఇలాంటి ప్లాస్టిక్ వస్తువుల(plastic ban) నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. థాయ్‌లాండ్, రువాండా తదితర దేశాలు అదేబాటన సాగుతున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను వచ్చే ఏడాది జులై నుంచి నిషేధిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం స్వాగతించదగ్గ పరిణామం.
వ్యాధుల సమస్య
ప్లాస్టిక్ మట్టిలో కలిసిపోయేందుకు 450 నుంచి వెయ్యేళ్లు పడుతుంది. ప్లాస్టిక్‌ను ఆరుబయట వాతావరణంలో దహనం చేస్తే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫర్ డయాక్సైడ్, డయాక్సిన్స్, ఫ్యూరాన్స్, ఇతర రేణువులు, విష వాయువులు విడుదలవుతాయి. వీటిని పీల్చడం వల్ల క్యాన్సర్, ఊపిరితిత్తులు, చర్మ, నేత్ర సంబంధ వ్యాధులు తలెత్తుతాయి. ప్లాస్టిక్ వస్తువుల్ని తయారు చేసే పరిశ్రమలు విడుదల చేసే వాయువులు, వృథానీటిలో సైతం విషతుల్యాలు ఉంటాయి. పాలిథీన్ సంచులు, ప్లాస్టిక్ చెంచాలు, కప్పులు, కంచాలు, నీళ్లసీసాలు తదితర వ్యర్థాలు నిత్యం పరిసరాలను కలుషితం చేస్తున్నాయి.
వాతావరణంలో కలిసిపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను(Plastic waste) ఏదోఒక రూపంలో తినడం వల్ల ఆవులు, గేదెలు, మేకలతోపాటు సముద్రాల్లోని చేపలు, తిమింగిలాల వంటి జలచరాలు కూడా మృత్యువాత పడుతున్నాయి. ఐరాస పర్యావరణ కార్యక్రమ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో తొమ్మిది శాతం మాత్రమే పునర్వినియోగానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఏటా 80లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో, 20 లక్షల టన్నులు మట్టిలో కలుస్తున్నాయి. సముద్రాల్లో ఈ స్థాయిలో కాలుష్యం కలిస్తే, 2050 నాటికి చేపలకంటే ప్లాస్టిక్ వ్యర్థాలే అధికంగా ఉంటాయని అంచనా. జలాల్లో చిన్న రేణువులుగా విడిపోయే ప్లాస్టిక్ వ్యర్థాలను చేపలు తినడం వల్ల, అవి వాటి శరీరాల్లో పేరుకుపోవడంతో, వాటిని తినే మనుషులు వ్యాధుల బారిన పడుతున్నారు. మరణాలూ సంభవిస్తున్నాయి.
సముద్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని, ఫలితంగా తుపానులు, సునామీలు, వరదలు(Floods), కరవు కాటకాలు(Drought) సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ మార్పులపై(Climate change) ఐరాస నియమించిన అంతర ప్రభుత్వాల కమిటీ (ఐపీసీసీ) ఇటీవల ప్రపంచ మానవాళిని హెచ్చరించింది. మనుషులతోపాటు సమస్త జీవరాశికీ ముప్పేనని స్పష్టంచేసింది. సముద్రాల్లో ఉష్ణోగ్రత పెరగడానికి ప్లాస్టిక్ వ్యర్థాలూ ఒక కారణం. భూఉపరితలంలో మట్టిలో కలిసిన ప్లాస్టిక్ వ్యర్థాలు నత్రజనిని అందించే రైతుమిత్ర జీవుల్ని మట్టుపెట్టి భూసారాన్ని హరిస్తున్నాయి.