ఏడాదికాలంగా యావత్ ప్రపంచ దేశాల్నీ ఏకధాటిగా వణికిస్తున్న కరోనా మహమ్మారి నేటికీ కొన్ని దేశాలపై అలలు అలలుగా ఎగసిపడుతూ మృత్యుభేరి మోగిస్తూనే ఉంది. మూడు శతాబ్దాల్లోనే అతిపెద్ద మాంద్యం బారినపడ్డ బ్రిటన్ ఇప్పటికే కోటిన్నర మందికి టీకాలందించికూడా లాక్‌డౌన్ ఉపసంహరణపై ముందు వెనకలాడుతోంది. ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, పోర్చుగల్, వియత్నాంలతోపాటు జర్మనీ ఫ్రాన్స్‌లూ లాక్‌డౌన్లు వినా గత్యంతరం లేదనుకొంటున్న తరుణమిది. బ్రిటన్‌ను వణికిస్తున్న కెంట్ వైరస్- గతంలో వాటికంటే 70శాతం అధిక మారణశక్తితో విరుచుకుపడుతోందని అధ్యయనాలు చాటుతున్నాయి.
గతవారం రోజులుగా 185 జిల్లాల్లో ఎక్కడా కొత్తగా కొవిడ్ కేసులు నమోదు కాని ఇండియాలో మహమ్మారి ఉద్ధృతి కేరళ, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలకే పరిమితం కావడం, ఇప్పటికే 80 లక్షలమందికిపైగా టీకాల పంపిణీ జరగడం- అంతా బాగానే ఉందన్న ప్రమాదకర దిలాసాను పౌర సమాజంలో పెంచుతోంది. మరో రెండు మూడు వారాల్లో 50 ఏళ్ల పైబడిన వారికీ టీకా పంపిణీ చేపడతామంటున్న కేంద్ర ప్రభుత్వం- ప్రయోగ దశలో ఉన్న మరో 18 వ్యాక్సిన్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని భరోసా ఇస్తోంది. ప్రాధాన్య ప్రాతిపదికన టీకా పంపిణీ చేపట్టి ఆరోగ్య సిబ్బంది, కరోనాపై పోరులో ముందు వరస యోధులు మూడు కోట్ల మందికి తొలుత వ్యాక్సిన్ వేయాలనుకొన్నా- సంకోచంతో ముందుకురాని వారు కోట్ల సంఖ్యలో ఉండటమే నిశ్చేష్టపరుస్తోంది.
సత్వర చర్యలు చేపట్టాలి
ఇప్పటి మాదిరే టీకాలు ఇస్తూ పోతే గ్రామీణులకి చేరేసరికి మరో అయిదేళ్లు పడుతుందన్న అధ్యయనాలు దిగ్భ్రాంతపరుస్తున్నాయి. కొవిడ్ ప్రమాదకర ఉత్పరివర్తనాలకు జతబడి టీకాలపై సంకోచాలు ఒకవంక, ప్రాణభిక్ష పెట్టే వ్యాక్సిన్లకోసం కోట్లాది జనం నిరీక్షణ మరోవంక- ఈ ప్రాణాంతక ప్రతిష్ఠంభనకు చరమగీతం పాడేలా కేంద్రం సరైన దిద్దుబాటు చర్యలు చేపట్టాలి!
ప్రాణాధార వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ప్రపంచ రాజధానిగా ఉన్న ఇండియా- దేశీయంగా వాటి సరఫరా వ్యవస్థకూ పెట్టింది పేరు! టీకా తొలి డోసు పొందిన 28వ రోజున తప్పనిసరిగా రెండో డోసు తీసుకోవాలని చెవినిల్లు కట్టుకొని చెప్పినా- అలా పొందినవారు పదిశాతమేనంటున్నారు! దేశ జనాభాలో ఇప్పటికి టీకా పొందింది 0.6శాతం మాత్రమేనంటే- ముందున్న లక్ష్యం ఎంత సమున్నతమైనదో బోధపడుతుంది.