కరోనా సృష్టిస్తున్న విలయాన్ని తట్టుకుని ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు, వైద్యనిపుణులు, యంత్రాంగం రేయింబవళ్లు కష్టపడుతుంటే- మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ఈ మహమ్మారి, దాని చికిత్స, ప్రభుత్వ స్పందనలపై తప్పుడు సమాచారం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఉదాహరణకు పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లాలో కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉంది. మరణాలూ భారీగా నమోదవుతున్నాయి. కానీ ఇక్కడ గ్రామీణ ప్రజలు ఇవన్నీ కరోనా వల్ల కాదని, 5జీ నెట్‌వర్క్ రేడియేషన్ వల్ల సంభవిస్తున్నాయని చెబుతూ ఉండటంతో స్థానిక అధికారులు విస్తుబోతున్నారు. దేశంలో 5జీ నెట్‌వర్క్ పరీక్షలు ఇంకా ప్రారంభమే కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దాని రేడియేషన్ వల్ల మరణాలు సంభవిస్తున్నాయన్న ప్రకటనలు.. కొవిడ్‌పై తప్పుడు సమాచారం ఎంత విస్తృతంగా వ్యాప్తి చెందుతోందో చెప్పడానికి ఓ ఉదాహరణ మాత్రమేనని భారత సెల్యులర్ ఆపరేటర్ల సంఘం ఇటీవల ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.
సామాజిక మాధ్యమాలే వేదికగా..
కరోనా టీకా తీసుకుంటే మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందని, ఆడవారిలో జన్యుపరమైన దుష్పరిణామాలు సంభవిస్తాయంటూ పలు ప్రాంతాల్లో వదంతులు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయని ఆరోగ్యశాఖాధికారులు చెబుతున్నారు. కరోనా వేళ విశేష సేవలందిస్తూ అందరికీ చేరువైన ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్‌తో టీకాలపై ప్రచారం చేయించినా ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నట్లు నిరాశ వ్యక్తం చేశారు. భారత్‌లో 2021 ప్రారంభానికే దాదాపు 76 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోను వినియోగదారులున్నారు. 40 కోట్ల మందికి పైగా వాట్సాప్ వాడుతున్నారు. 32 కోట్లకు పైగా ఫేస్‌బుక్, 14 కోట్ల మంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోకి స్మార్ట్‌ఫోన్లు చొచ్చుకుపోవడం, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటివి వాడటానికి అక్షరాస్యతతో పని లేకపోవడంతో వాటి వినియోగం ఇంతలంతలవుతోంది. ఇదే అదనుగా తప్పుడు ప్రచారాలకు పలువురు వీటిని వేదికగా చేసుకుంటున్నారు. కరోనా రెండోదశ ఉద్ధృతి దేశంలోని బడా ఔషధ తయారీ కంపెనీల సృష్టే అనే వాదనలు వాట్సాప్‌లోనూ, ఫేస్‌బుక్‌లోనూ విచ్చలవిడిగా వచ్చాయి. తరవాత వైరస్ వ్యాప్తి తీవ్రత తెలిశాక కానీ ఆ పోస్టులు ఆగలేదు. కరోనా వ్యాప్తి నియంత్రణకు మే అయిదో తేదీ నుంచి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తారన్న ప్రచారమూ ఓ దశలో సామాజిక మాధ్యమాలను ముంచెత్తింది. అలాంటిదేమీ లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధినేతలు పదేపదే చెప్పాల్సి వచ్చింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న ఓ మహమ్మారి గురించి తప్పుడు సమాచారం సామాజిక మాధ్యమ వేదికల్లో విచ్చలవిడిగా ప్రసారమవుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటే దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఆ మాధ్యమ నిర్వాహకులపై కచ్చితంగా ఉంది. అయితే కంపెనీలు ఈ విషయంలో చేస్తున్నది నామమాత్రమే. తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు ఫ్యాక్ట్ చెక్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామంటూ ఫేస్‌బుక్ నుంచి ట్విటర్ వరకు సామాజిక మాధ్యమ వేదికలన్నీ చెబుతున్నా- వాటి వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు.