తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కఠిన నిర్ణయాలతోనే మాతృభాషకు కొత్త వెలుగు

మాతృభాషలో చదివితే ఉద్యోగాలు రావన్న అపోహ మూఢనమ్మకమై మహమ్మారిలా వ్యాపించింది. మాతృభాష మాట్లాడితే అవమానం అన్న భావన పెరిగిపోతోంది. అయితే ఇతర భాషలు నేర్చుకోవడం తప్పు కాదు. కానీ మాతృభాషను, మాతృమూర్తిని మరచిపోకూడదు. బిడ్డ ఎదుగుదలకు అమ్మ పాలు ఎంత అవసరమో, బుద్ధి వికాసానికీ అమ్మభాష అంతే అవసరం. ఏ భాష అయినా మాతృభాష తరవాతే.

Importance of mother tongue in very one's life
కఠిన నిర్ణయాలతోనే మాతృభాషకు కొత్త వెలుగు

By

Published : Aug 2, 2020, 11:51 AM IST

ఇటీవలి కాలంలో మాతృభాష మాట్లాడితే అవమానం అన్న భావన పెరిగిపోతోంది. మాతృభాషలో చదివితే ఉద్యోగాలు రావన్న అపోహ మూఢనమ్మకమై మహమ్మారిలా వ్యాపించింది. మాతృభాషా పాండిత్యాన్ని సంపాదించాలన్న ఆసక్తిలేని యువత, అందుకు ఏ మాత్రం ప్రయత్నించని సమాజం, నిమ్మకు నీరెత్తినట్లున్న ప్రభుత్వాలు- మాతృభాషా ప్రాధాన్యాన్ని గుర్తించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన ఓ ప్రకటన దేశవ్యాప్తంగా అందర్నీ ఆకర్షించింది. కొనఊపిరితో ఉన్న మాతృ భాషోద్యమానికి స్ఫూర్తిని ఇచ్చి, మళ్ళీ కొత్త ఊపిరి పోసింది. మాతృభాష పట్ల నిరాదరణ కనబరచే తెలుగువారికి ఈ మాటలు గరిటె కాల్చి వాతలు పెట్టినట్లు ఉంటాయి. ఉద్ధవుడు నిజంగా ఉద్దండుడే. అందుకే నేరుగా ఇలా ప్రశ్నించాడు- మాతృభాషలో మాట్లాడకుండా మీకు నచ్చిన భాష మాట్లాడితే సామాన్య ప్రజలకు ఎలా అర్థమవుతుంది? ప్రభుత్వం ఏమి ప్రవేశపెట్టిందో ఆ పథకాల కథాకమామిషు ఏమిటో వాళ్లకు ఎలా తెలుస్తుంది? మరాఠీ మాట్లాడకపోతే వారి ఉద్యోగసేవా దస్త్రంలో క్రమశిక్షణ ఉల్లంఘన కింద నమోదు చేయడంతోపాటు, వార్షిక వేతనం పెంపుదల నిలిపేస్తామని ఉద్ధవ్‌ ప్రభుత్వ అధికారులను హెచ్చరించారు. ఇకపై అన్ని అధికారిక కార్యకలాపాల్లో మరాఠీ వాడుకను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేసింది మహారాష్ట్ర సర్కారు.

విజ్ఞాన సముపార్జనకు రాదారి

విద్యాహక్కు చట్టం(2009)లోని సెక్షన్‌ 29(2) ప్రకారం బోధనాభాష సాధ్యమైనంత ఆచరణాత్మకంగా ఉండాలి. అదీ పిల్లల మాతృభాషలోనే ఉండాలి. ఇతర భాషలు నేర్చుకోవడం తప్పు కాదు. కానీ మాతృభాషను, మాతృమూర్తిని మరచిపోకూడదు. ఇతర భాషలు, శాస్త్రాల అధ్యయనమూ మాతృభాష ద్వారానే సులభమవుతుంది. ఇది గుర్తించిన ప్రభుత్వాలు భాషాభివృద్ధిని బాధ్యతగా స్వీకరిస్తాయి. అందువల్లే ఇటీవల ఆస్ట్రేలియాలో తెలుగు వెలుగులీనింది. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులు తెలుగు భాషను ఐచ్ఛిక అంశంగా ఎంపిక చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలుగు భాషకు పట్టంకట్టింది. పాఠశాలల్లో తెలుగును ఒక ఐచ్ఛికాంశంగా గుర్తించారు. తెలుగు భాషను ఎంపిక చేసుకొన్నవారికి ఉత్తీర్ణతలో అయిదు పాయింట్లు అదనంగా వస్తాయి. చదువులోనే కాకుండా అక్కడ ఉద్యోగాలు చేసేవారు శాశ్వత నివాసం కోసం తెలుగు భాష ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్ఛు నేషనల్‌ అక్రిడిటేషన్‌ అథారిటీ ఫర్‌ ట్రాన్స్‌లేటర్స్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటర్స్‌(నాటి) నిర్వహించే పరీక్ష రాసేవారికి కూడా తెలుగుకు అయిదు పాయింట్లు అదనంగా కలుస్తాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని వివిధ నగరాల్లో ఉన్న సుమారు లక్ష మంది తెలుగువారికే కాకుండా ఉన్నత చదువుల కోసం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్లేవారికీ ఉపకరిస్తుంది. ఇది అక్కడి వివిధ నగరాల్లో పనిచేసే తెలుగువారంతా సంఘటితంగా పోరాడి సాధించుకున్న విజయం. ఇది తెలుగు రాష్ట్రాల్లోని తెలుగువారికీ స్ఫూర్తి కావాలి.

జర్మన్‌, స్వీడన్‌ లాంటి దేశాలు మాతృభాషా ప్రాధాన్యంలో ముందున్నాయి. ఏ కొత్త శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ ఎక్కడ జరిగినా వెంటనే జర్మనీ ప్రభుత్వం జర్మనీ భాషలోనికి దాన్ని వెన్వెంటనే అనువాదం చేయిస్తుంది. ప్రభుత్వం తయారు చేసిన కొత్త సమానార్థకపదాలను అక్కడి పత్రికలు వ్యాప్తిలోకి తెస్తాయి. ప్రపంచ విజ్ఞానాన్ని సొంతభాషలో చదువుకోవడం వల్ల వాళ్ళ అవగాహన, అభ్యాసం, పరిశోధనలు ఎంతో వేగవంతమవుతున్నాయి. ఈరోజు వారి పరిశోధన పత్రాలు జర్మనీ భాషలో ముద్రిస్తే ప్రపంచం మొత్తం తమ భాషల్లోకి అనువదిస్తున్నాయి. స్వభాషాభిమానానికి స్వీడన్‌ మారుపేరు. ఆ దేశంలో ఆయుర్వేద వైద్యబోధనా ఉంది. ఆ వైద్య పరిభాషను సంస్కృతం నుంచి స్వీడన్‌ భాషలోకి అనువదించుకున్నారు. ఆ దేశ జనాభా మన తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ. అందులో ఆయుర్వేదం చదివేవారి సంఖ్య మరీ తక్కువ. అయినా స్వీడన్‌ ప్రభుత్వం వ్యయప్రయాసలకోర్చి మొత్తం శాస్త్రాల్ని వారి భాషలోకి అనువదించింది.

ఉపాధితో అనుసంధానం

బిడ్డ ఎదుగుదలకు అమ్మ పాలు ఎంత అవసరమో, బుద్ధి వికాసానికీ అమ్మభాష అంతే అవసరం. ఏ భాష అయినా మాతృభాష తరవాతే. సంస్కృత, ప్రాకృత, ఉర్దూ, హిందీ ఆంగ్లాది భాషలవల్ల తెలుగు భాష పుష్టిని పొందిందేకానీ అస్తిత్వం కోల్పోలేదు. ఏ పదాన్నైనా తెలుగులోకి తెచ్చుకొని పరభాష పదంగా చేర్చుకోవచ్ఛు దానివల్ల ప్రమాదం లేదు. కానీ నేడు వ్యవహారంలో ముఖ్యంగా యువతరం మాటల్లో పూర్తిగా తెలుగు మృగ్యమైపోతోంది. తెలుగు పదాలుఉన్నా వాటి స్థానంలో ఆంగ్లపదాలే వాడటం కనిపిస్తోంది. దీనివల్ల నామవాచకాలే కాదు, క్రియారూపాలూ ధ్వంసమైపోతున్నాయి. ఉచ్చారణ సరిగ్గా లేకపోవడమూ బాధాకరమే. అందువల్లే పనిగట్టుకొని ప్రతి ఆంగ్లపదానికీ తెలుగు పదాలను సృష్టించుకొని వాడవలసిన అగత్యం ఏర్పడుతోంది. భాష, కవిత, లిపి సంప్రదాయాలను పరిరక్షిస్తూ ఆధునిక ప్రయోజనాలు సాధించగల సరికొత్త తెలుగు భాషా వ్యవస్థను రూపొందించుకోవాలి. ఉపాధి అవకాశాలు పెరిగితే ఆదరణ కలుగుతుంది. దానివల్ల సామాజిక ప్రతిష్ఠ దానంతటదే వస్తుంది. మనకిప్పుడు కావాల్సింది మాతృభాష పట్ల అభిమానం మాత్రమే కాదు- అమ్మ భాష కంటిచెమ్మను తుడవాలన్న సంకల్పమే ఆయుధం కావాలి!

- డాక్టర్‌ అద్దంకి శ్రీనివాస్‌.

ABOUT THE AUTHOR

...view details