‘గతంలో వచ్చిన ఎన్నో సంక్షోభాల కన్నా ప్రస్తుత కొవిడ్-19 ముప్పు పెద్దది. దీని ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంత త్వరగా కోలుకొనే పరిస్థితి లేదు. వృద్ధిరేటు మందగించడమే కాదు- తగ్గిపోయే అవకాశమూ ఉంది’ అని అమెరికాలోని న్యూస్కూల్ యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర ఆచార్యులు సంజయ్.జి.రెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంటుందన్నారు. భారత ప్రభుత్వం రాష్ట్రాలకు అవసరమైన నిధులు సమకూర్చడం, మార్గదర్శకాలను నిర్దేశించడంవరకే పరిమితం కావాలి తప్ప- విధానాలు రూపొందించి అమలు చేయాలని కోరడం సరైంది కాదన్నారు. సంజయ్ మొదట కొలంబియా విశ్వవిద్యాలయంలో పని చేశారు. ఐక్యరాజ్య సమితి ‘2030 నాటికి సుస్థిరాభివృద్ధి’ కోసం నియమించిన స్వతంత్ర సలహాదారుల్లో ఆయన ఒకరు. ప్రపంచ వినియోగం-ఆదాయం ప్రాజెక్టుకు సహవ్యవస్థాపకులుగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్ ప్రపంచ ఆర్థిక రంగంపై చూపే ప్రభావం గురించి ఆయన ‘ఈనాడు ప్రత్యేక ప్రతినిధి’ ఎం.ఎల్.నరసింహారెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు...
భారత్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను చూసినప్పుడు కొవిడ్‌కు ముందు, ప్రస్తుతం, తరవాత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంత త్వరగా కోలుకొనే పరిస్థితి లేదు. భారతదేశంలో వృద్ధిరేటు తగ్గడమే కాదు, ఆర్థిక కుదింపునకు గురయ్యే అవకాశమూ ఉంది. ఈ సంక్షోభంకన్నా ముందే భారత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు బలహీనంగానే ఉండేవి. దేశంలో అప్పటికే అప్పులు పెరిగాయి. వినియోగం, పెట్టుబడి శక్తి మందగించింది. విదేశీ ధనం స్వదేశానికి రావడం క్షీణించడాన్ని గమనించవచ్చు. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాల్లోనూ ఇలాంటివి కనిపించేవి. అప్పట్లో దీన్ని చక్రీయ పతనం(సైక్లికల్ డౌన్‌టర్న్) అని భావించారు. ప్రపంచీకరణ వెనకంజ వేస్తున్నట్లు కనిపించినప్పుడే ట్రంప్ విధానాలూ తోడయ్యేసరికి అమెరికాలో వాతావరణం మారింది. ఇంతలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వచ్చిపడింది. ఇలాంటప్పుడు ఆర్థిక మందగమనం నుంచి ఆర్థిక మాంద్యానికి మారడానికి ఎక్కువ కాలంపట్టదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దీని నుంచి బయటపడాలంటే లాక్‌డౌన్ ఎత్తేసి, యథావిధిగా జీవితం నడిచే పరిస్థితి రావాలి.
ప్రస్తుత సంక్షోభం వల్ల అమెరికాలోని ప్రజారోగ్య, ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయి?
ప్రజారోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేం. మొదట్లో అంచనా వేసినంతగా మరణాలు ఉండకపోవచ్చు. 60వేలకు పరిమితం కావచ్చు. మొదటి, తాజా అంచనాల మధ్య తేడానుబట్టి అనిశ్చితి స్పష్టమవుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద మాత్రం దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. మునుపెన్నడూ లేనంతగా మొదటి మూడు వారాల్లో నిరుద్యోగ బీమా కోసం కోటి 70 లక్షల పిటిషన్లు దాఖలయ్యాయి. ఇది అమెరికాలోని ‘వర్క్‌ఫోర్స్’ కంటే పదిశాతం ఎక్కువ. ‘గ్రేట్ డిప్రెషన్’కన్నా కూడా నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంటుందని, నాటితో పోలిస్తే ఇప్పుడు 25 శాతం ఎక్కువే ఉండొచ్చని అంచనా. ఈ సంక్షోభం వల్ల సంపాదన, ఉపాధిపై ప్రభావం పడటంవల్ల కుటుంబ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. యూఎస్‌లో సహాయ కార్యక్రమాలు కొంత ఉపయోగపడినప్పటికీ వ్యాపారాలు మూతపడి ఉద్యోగాలు పోతున్న సందర్భంలో అవి సరిపోవు. రాబోయే రోజుల్లో ఇళ్లు లేనివారు, పేదరికం, సామాజిక సమస్యలు లాంటివి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పెద్దయెత్తున ఉన్న నిరుద్యోగం ఎంత తీవ్రమవుతుందో తెలుసుకోవడానికి ఇంకొన్ని నెలలు పడుతుంది. అమెరికాలో అవకాశాలు కచ్చితంగా తగ్గిపోతాయి. తక్కువ వేతనాలకు పనిచేస్తున్న భారతీయులు బాగా కష్టపడతారు. భారతదేశానికి చెందిన వృత్తి నిపుణులు, మేనేజర్ల వంటివారూ ప్రభావానికి లోనవుతారు. ప్రయాణాలపై ఉన్న నిషేధంవల్ల అమెరికాకు వెళ్లి చదుకొనే అవకాశాలు దెబ్బతింటాయి. ఇప్పుడున్న సందిగ్ధంలో అంతర్జాతీయ విద్యార్థులు ఎలా వస్తారన్నది వారి ముందున్న పెద్ద ప్రశ్న.