తెలంగాణ

telangana

ETV Bharat / opinion

విద్యారంగంలో మేలిమి సంస్కరణలు అవసరం

విద్యా వ్యవస్థలో భారతదేశం పాత భావాలను పట్టుకువేలాడుతోంది. కరోనా సంక్షోభం దేశ విద్యావిధానాల తీరుపై ప్రశ్నల వర్షం కురిపించింది. మేలైన విద్యను అందించడానికి విప్లవం రావాలంటే లైసెన్సుల రాజ్యానికి మంగళం పాడాలి. భారత్‌లోనూ సంపన్న దేశాల మాదిరి విద్యాలయాలకు స్వయం నిర్ణయాధికారమివ్వాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

By

Published : Jul 8, 2020, 7:25 AM IST

EDITORIAL ON EDUCATION SYSTEM IN INDIA
విద్యారంగంలో మేలిమి సంస్కరణలు అవసరం

చెప్పేది ఒకటి, చేసేది ఒకటి బాపతు మనుషులతో జాగ్రత్త! అని మహాభారతంలో విదురుడు ధృతరాష్ఠ్రుడికి సూచించారు. ఆయన కపటుల గురించి ఆ మాట అన్నప్పటికీ, నేటి మన విద్యా విధానానికీ ఆ వర్ణన సరిగ్గా అతుకుతుంది. కొవిడ్‌ వ్యాధి సమసిపోయిన తరవాత ప్రపంచంలో ఎంతో సమర్థులు, నవీకరణ సాధకులు మాత్రమే నిలదొక్కుకుని రాణించగలుగుతారు. మరి అలాంటి మెరికలను భారతీయ విద్యావిధానం తయారుచేయగలిగిందా అన్నది కీలక ప్రశ్న. త్వరలో కేంద్ర మంత్రివర్గం ముందుకు రానున్న జాతీయ విద్యావిధానం ఈ అవసరాన్ని తీర్చగలదన్న భరోసా కనిపించకపోవడం దురదృష్టకరం. ప్రజలకు మేలు జరగాలంటే ప్రభుత్వమే విద్య నేర్పాలన్న అపోహలో ఇన్నాళ్లూ కొట్టుకుపోయాం. ప్రైవేటు విద్యాలయాలను అనుమతించినా, వాటికి కొన్ని షరతులు విధించారు. ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు లాభాపేక్ష లేకుండా పనిచేయాలన్నది మొదటి నియమం. కానీ, అవి ఎంతో కొంత లాభం ఆర్జిస్తాయని మనందరికీ తెలుసు. కపట వర్తన అంటే ఇదే మరి. లైసెన్సులు, ఇతర ఆంక్షలు పెట్టకపోతే ప్రైవేటు పాఠశాలలు కట్టు తప్పుతాయని భావించడం రెండో భ్రమ. సంపన్న దేశాల్లో పూర్తిగా ప్రభుత్వాలే పౌరులకు విద్యను అందిస్తాయన్న అపోహ దీనికి మూలం. వాస్తవానికి అమెరికా, బ్రిటన్‌లతోపాటు సంక్షేమ రాజ్యాలైన స్కాండినేవియా దేశాలు సైతం విద్యారంగంలోకి ప్రైవేటు పెట్టుబడులను అనుమతించాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వ నిధులు, ప్రైవేటు నిర్వహణతో నడిచే విద్యాసంస్థలు క్రమంగా ఆవిర్భవిస్తున్నాయి. భారతదేశం మాత్రం పాత భావాలను పట్టుకువేలాడుతోంది.

దిగజారిన ప్రమాణాలు

దేశమంతటా భారీ పెట్టుబడులతో ప్రభుత్వ విద్యాసంస్థలను ఏర్పరచినా, ఫలితం అధ్వానం. సైన్స్‌, గణితాల్లో విద్యార్థుల ప్రతిభను గణించే ‘పిసా’ పరీక్షను 74 దేశాల్లో నిర్వహిస్తే, ఆ జాబితాలో భారత్‌ అట్టడుగున 73వ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. మనకన్నా దిగువన ఉన్నది కిర్ఘిజిస్థాన్‌ మాత్రమే. భారత్‌లో అయిదో తరగతి విద్యార్థుల్లో సగంమంది రెండో తరగతి పాఠ్యపుస్తకం నుంచి ఒక్క పేరానైనా సరిగా చదవలేరని అధ్యయనంలో తేలింది. రెండో తరగతి అంక గణిత సమస్యనూ సగంమందికిపైగా పరిష్కరించలేకపోయారు. కొన్ని రాష్ట్రాల్లోని ఉపాధ్యాయుల్లో పట్టుమని పది శాతం కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)లో ఉత్తీర్ణులు కాలేకపోయారు. ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌లలోని ప్రతి నలుగురు ఉపాధ్యాయుల్లో ముగ్గురు అయిదో తరగతి పాఠ్య పుస్తకంలోని గణితంలో ప్రశ్నకు సమాధానమివ్వలేకపోయారు. సగటు ప్రభుత్వ పాఠశాలలో ప్రతి నలుగురు ఉపాధ్యాయుల్లో ఒకరు చట్టవిరుద్ధంగా తరగతులకు గైర్హాజరవుతున్నారు. తరగతులకు వచ్చే ప్రతి ఇద్దరు గురువుల్లో ఒకరు పాఠాలు చెప్పడం లేదు. పరిస్థితులు ఇంత అస్తవ్యస్తంగా ఉన్నందువల్ల 2010-11 నుంచి 2017-18 వరకు మొత్తం 2.4 కోట్లమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి వైదొలిగి ప్రైవేటు పాఠశాలల్లో చేరారని ప్రభుత్వ డీఐఎస్‌ఇ (జిల్లా విద్యా సమాచార వ్యవస్థ) గణాంకాలు తెలుపుతున్నాయి.

ఉన్నత ప్రమాణాలు కలిగిన ప్రైవేటు పాఠశాలలకు కొరత ఏర్పడటానికి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి-లైసెన్సుల రాజ్యం. ఎంతటి నిజాయితీపరుడైనా ఒక పాఠశాల ప్రారంభించాలంటే 35 నుంచి 125 అనుమతులు పొందకతప్పదు. రాష్ట్రాన్ని బట్టి వీటి సంఖ్య మారుతూ ఉంటుంది. ఒక్కో అనుమతి కోసం ప్రభుత్వ విభాగాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ లంచం ముట్టజెప్పాల్సి ఉంటుంది. రెండో కారణం ఆర్థికపరమైంది. ఇవాళ పాఠశాల నిర్వహణ అనేది ఏమాత్రం లాభదాయకం కాదు. విద్యాహక్కు చట్టంతోనే ఈ సమస్య మొదలైంది. ప్రైవేటు పాఠశాలలు 25శాతం సీట్లను పేదలకు కేటాయించాలని ఈ చట్టం నిర్దేశించడం బాగానే ఉన్నా, ఆచరణలో మాత్రం ఈ నిబంధన బెడిసికొడుతోంది. రిజర్వు చేసిన 25శాతం సీట్లకు ప్రభుత్వం ఫీజులు చెల్లించడం లేదు. దాంతో మిగిలిన 75శాతం సీట్లకు ఫీజుల మోత పెరిగిపోయింది. దీనిపై తల్లిదండ్రులు, సమాచార మాధ్యమాలు నిరసనలు తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజులపై నియంత్రణ విధిస్తున్నాయి. ఇది ప్రైవేటు పాఠశాలల ఆర్థిక స్థితిని దెబ్బతీసి బోధనా ప్రమాణాలను నీరుగార్చింది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. కరోనా దెబ్బకు మరిన్ని పాఠశాలలు బోర్డు తిప్పేయబోతున్నాయి. జాతీయ స్థాయిలో అలుముకున్న కాపట్యం ప్రైవేటు విద్యావ్యాప్తికి అడ్డుపడుతున్న మూడో కారణం. ప్రైవేటు పాఠశాలలు లాభం కళ్లచూడటం చట్టరీత్యా నేరమే కానీ, కొన్ని పాఠశాలలు లాభాలు ఆర్జించడం నిజం. ప్రపంచంలోని పది అగ్రశ్రేణి దేశాల్లో తొమ్మిది లాభాపేక్షతో విద్యాలయాలు నడపడాన్ని అనుమతిస్తుండగా, దాన్ని సమ్మతించని దేశం భారత్‌ మాత్రమే. లాభాపేక్షతో విద్యాలయాలు నడపటాన్ని అనుమతిస్తే అద్భుతాలు సంభవిస్తాయి. విద్యా రంగంలోకి పెట్టుబడులు ప్రవహించి, నాణ్యత పెరుగుతుంది.

లైసెన్సులకు మంగళం

మేలైన విద్యను అందించడానికి విప్లవం రావాలంటే లైసెన్సుల రాజ్యానికి మంగళం పాడాలి. భారత్‌లోనూ సంపన్న దేశాల మాదిరి విద్యాలయాలకు స్వయంనిర్ణయాధికారమివ్వాలి. ప్రస్తుతం భారత్‌లో ఏవో కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు మినహా ఇతర సంస్థల్లో ప్రమాణాలు అంతంతమాత్రమే. కొవిడ్‌ అనంతర విద్యావిప్లవానికి ప్రైవేటు విద్యా సంస్థలను సిద్ధం చేయడానికి ప్రభుత్వం తగిన నియమనిబంధనలను రూపొందించి, మౌలిక వసతులు కల్పించాలి. ఫీజులు, జీతభత్యాలు, పాఠ్య ప్రణాళికలను నిర్ణయించడంలో మితిమీరిన ప్రభుత్వ జోక్యం పనికిరాదని గ్రహించాలి. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల జీతభత్యాలు నింగిని తాకుతున్న నేపథ్యంలో ప్రైవేటు విద్యాసంస్థలకు జీతాల విషయంలో వెసులుబాటు ఉండాలి. ఉత్తర్‌ ప్రదేశ్‌లో 2017-18లో ఒక జూనియర్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుని ప్రారంభ వేతనమే రూ.48,918. అది ఉత్తర్‌ ప్రదేశ్‌ తలసరి ఆదాయంకన్నా 11 రెట్లు హెచ్చు. ప్రైవేటు పాఠశాలలనూ అదే రీతిలో జీతాలు చెల్లించాలనడం సబబు కాదు. ఈ వాస్తవాలను గమనించడానికి నిరాకరిస్తున్న తాజా జాతీయ విద్యావిధానం పూర్వ విధానాల మల్లే విఫలం కావడం తథ్యం. ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను పెంచుతూ, ప్రైవేటు విద్యాసంస్థలకు స్వయంనిర్ణయాధికారం ఇవ్వడానికి తక్షణం విద్యా సంస్కరణలను తీసుకురావాలి. కాపట్యాన్ని వదలించుకుని, నవీకరణకు అగ్ర ప్రాధాన్యమివ్వాలి.

అన్వేషణ...

నెలనెలా రూ.1,000కన్నా తక్కువగా, 45శాతం రూ.500 కన్నా తక్కువగా ఫీజులు చెల్లిస్తున్నారు. అన్ని ప్రైవేటు పాఠశాలలూ ఖరీదైనవి కావనడానికి ఇదే నిదర్శనం. వేగంగా ఖాళీ అవుతున్న ప్రభుత్వ పాఠశాలల స్థానాన్ని భర్తీ చేయడానికి కనీసం 1,30,000 కొత్త ప్రైవేటు పాఠశాలలు అవసరమవుతాయి. మంచి పాఠశాలల్లో సంతానాన్ని చేర్పించడానికి తల్లిదండ్రులు బారులు తీరే దృశ్యాలు అంతటా కనిపిస్తున్నాయి. 1991 ఆర్థిక సంస్కరణల తరవాత నుంచి ఉన్నత ప్రమాణాలు గల విద్య కోసం పోటీ పెరిగింది. ఆ గిరాకీని తీర్చడానికి ఎన్నో విద్యాలయాలు రంగంలోకి వచ్చాయి. తాగునీరు, విద్యుత్‌, అంతర్జాలాలకు చెల్లిస్తున్నట్లే పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం కోసం రుసుములు చెల్లించడానికి తల్లిదండ్రులు వెనకాడటం లేదు.

--- గురుచరణ్​ దాస్​, ప్రజావ్యవహారాల అధ్యయనకర్త, ప్రోక్టర్​ అండ్​ గ్యాంబుల్​ మాజీ సీఈఓ

ABOUT THE AUTHOR

...view details