తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కరోనా పట్ల భయం కాదు... జాగ్రత్త ముఖ్యం!

వివిధ వ్యాధులపై సమరం సాగించినప్పుడు ఆరోగ్య శాఖలోని అధికారులు, నాయకులు, ఆరోగ్య కార్యకర్తలు, ప్రసార సాధనాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో వాడే భాష, సంబంధిత భావం... అన్నీ జాగ్రత్తగా ఉండాలి. పొరపాటు దొర్లితే తరవాతి కాలంలో ఇప్పుడిచ్చిన తప్పుడు సమాచారాన్ని సరిచేయడానికి కిందమీదలు కావాల్సి వస్తుంది. అందువల్లే ప్రసార సాధనాలు సరైన కార్యక్రమాలనే ప్రజలకు అందజేయాలి.

do not scare.. take care
భయం కాదు... జాగ్రత్త ముఖ్యం!

By

Published : May 8, 2020, 8:55 AM IST

Updated : May 8, 2020, 9:28 AM IST

ప్రస్తుత ఆధునిక సమాచార యుగంలోనూ సరైన సమాచారం సంపాదించడం ఒక్కోసారి క్లిష్టతరమవుతోంది. దీనివల్ల చోటుచేసుకునే చిన్నచిన్న తప్పులకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందువల్లే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ గురించి ఎవరైనా ఆచితూచి స్పందించాల్సి ఉంటుంది. వివిధ వ్యాధులపై సమరం సాగించినప్పుడు ఆరోగ్య శాఖలోని అధికారులు, నాయకులు, ఆరోగ్య కార్యకర్తలు, వివిధ ప్రసార సాధనాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో వాడే భాష, సంబంధిత భావం... అన్నీ జాగ్రత్తగా ఉండాలి. పొరపాటు దొర్లితే తరవాతి కాలంలో ఇప్పుడిచ్చిన తప్పుడు సమాచారాన్ని సరిచేయడానికి కిందుమీదులు కావాల్సి వస్తుంది. అందువల్లే ప్రసార సాధనాలు సరైన కార్యక్రమాలనే ప్రజలకు అందజేయాలి.

ఒకప్పుడు ఎయిడ్స్‌ పేరు చెబితేనే ప్రజలు బెంబేలెత్తిపోయేవారు. 37 ఏళ్ల క్రితం హెచ్‌ఐవీ వెలుగులోకి వచ్చినప్పుడు అదొక భయంకరమైన వ్యాధి కారకంగా ప్రచారం సాగింది. దీన్ని అరికట్టడానికి తయారుచేసిన కొన్ని ప్రచారాస్త్రాలు సైతం ప్రజలకు సరిగ్గా అర్థం కాలేదు. దీంతో కార్యక్రమ నిర్వహణ, వ్యాధిగ్రస్తుల గుర్తింపు, వారికి అందించాల్సిన సేవలు వంటి విషయాల్లో ఎంతో జాప్యం చోటుచేసుకుని ఇబ్బందులు తలెత్తాయి.

ఎయిడ్స్ పేరు చెబితే బెంబేలు..

ఎయిడ్స్‌ భయంకర వ్యాధి అన్న ప్రచారంవల్ల, వ్యాధిగ్రస్తులను భయంతో చూసే పరిస్థితి ఉత్పన్నమైంది. వారిని దూరం పెట్టడం, మానసిక, శారీరక వేధింపులకు గురిచేయడం వంటి పెడధోరణులు పెచ్చరిల్లాయి. ఎయిడ్స్‌ బాధితుల పట్ల హేళనభావం పెరిగింది. దీంతో వారు చిన్నచూపునకు గురయ్యారు. జీవితం మరీ దుర్భరంగా మారిపోయి కొందరు మందులు తీసుకోవడానికీ ముందుకు వచ్చేవారు కాదు. అలాగే హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ వచ్చే అవకాశం ఉన్నవారు ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోకపోవడం, పరిస్థితి ప్రాణం మీదకు వచ్చాక పరీక్షలకు రావడం, ఆపై వారికి వెన్వెంటనే ఏఆర్‌టీ మందులు వాడాల్సి రావడం వల్ల, ఆ రోగుల జీవితకాలం తగ్గిపోయే దుస్థితి దాపురించేది. మరోవైపు ప్రభుత్వంపై వైద్యసేవలు, మందుల రూపాల్లో ఆర్థిక భారం పెరిగింది.

ఇది కరోనా కాలం. ఇప్పుడైనా ప్రతి విషయంలోనూ పకడ్బందీగా వ్యాధి గురించి ప్రచారం జరగాలి. అత్యంత జాగ్రత్తగా సందేశాలు తయారు కావాలి. ప్రజలందరికీ పరిస్థితిని వాస్తవికంగా ఒకే అర్థంతో వివరించేలా అవి ఉండాలి. అందరిదీ ఒకే భావం కావాలి. భాషలు వేరైనా దేశమంతా ఒకే భావం పలకాలి. దేశానికి ఇప్పుడు ఇదెంతో అవసరం. ఉదాహరణకు ‘మహమ్మారి’ అనే పదం కరోనా తీవ్రత చెప్పడానికి మాత్రమే వాడారు. దాని నుంచి ప్రజలను దూరంగా ఉంచడానికి చేసిన పదప్రయోగం అది. అంతేతప్ప, కరోనా సోకినవారిని మహమ్మారులుగా ప్రజలు చూసే పరిస్థితి దాపురించకూడదు. ఈ పదం అతి ప్రయోగం వల్ల సమాజానికి మేలుకన్నా కీడే ఎక్కువగా వాటిల్లుతోంది. ఇక్కడ ప్రచార చేయాల్సింది భయం కాదు- జాగ్రత్త! కరోనా సోకినవారి నుంచి జాగ్రత్త... కరోనా తమకు సోకకుండా జాగ్రత్త. అటు కరోనా సోకకుండా సోకని ప్రజలకు, ఇటు కరోనా సోకినవారికి సరైన సమాచారం... రెండింటి మధ్య ఏ విధమైన వైరుధ్యం లేకుండా చూడాలి. అలాంటి సమాచారం తయారీలో కమ్యూనికేషన్‌ నిపుణుల భాగస్వామ్యం ఎంతో అవసరం.

సామాజిక మాధ్యమాల అనర్థాలు

సామాజిక మాధ్యమాల వల్ల ఒక్కోసారి అనర్థాలూ వాటిల్లుతున్నాయి. కరోనా భయంతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటనకు విపరీత ప్రచారం లభిస్తే, అది భయం రూపంలో ప్రజల మెదళ్లలోకి చేరిపోతుంది. ఇప్పుడు సోషల్‌ మీడియా చేస్తోంది ఇదే. చందాదారుల చేరిక కోసం సోషల్‌ మీడియా అనవసర, ఉద్రేకపూరిత సమాచారాన్ని ప్రచారం చేయడం అధికారులకు తలనొప్పిగా పరిణమిస్తోంది. మరోవైపు ప్రభుత్వం కరోనా విషయంలో చాలా త్వరగా స్పందించడం వల్ల; ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల ద్వారా వచ్చే సమాచారం వల్ల ప్రజలకు కొంత సరైన సమాచారం దొరుకుతుందనే చెప్పాలి. రెండో దశలో ‘గుర్తుంచుకోండి- మనం పోరాడాల్సింది వ్యాధితోనే... రోగితో కాదు’ అనే సమాచారం ఎంతో మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. కరోనా ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. దీనికి ఇప్పట్లో శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. కరోనాను ఎదుర్కోవడంలో ప్రజల మద్దతు, సహకారం ఎంతో అవసరం. లాక్‌డౌన్‌, క్వారంటైన్‌, ఐసొలేషన్‌ వంటివాటి పట్ల ప్రజలకు సరైన అవగాహన, నమ్మకం ఉండాలి. అప్పుడే ఇవి విజయవంతమవుతాయి. ప్రజలకు సరైన సమాచారం అందినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కరోనాను కట్టడి చేయడంలో కమ్యూనికేషన్‌ ముఖ్యమైంది. అందులో ఉండాల్సింది- జాగ్రత్త, భయం కాదు!

- బసు పోతన (రచయిత- తెలంగాణ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ పూర్వ సంయుక్త సంచాలకులు)

Last Updated : May 8, 2020, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details