జూన్ 15... మంచుదుప్పటి కప్పుకున్న గల్వాన్ లోయలో రక్తపాతం జరిగిన రోజు... 45 ఏళ్ల తర్వాత భారత ఉత్తర సరిహద్దులో హింస చెలరేగిన రోజు... సరిహద్దును రక్షించే క్రమంలో 20 మంది జవాన్లు అమరులైన రోజు.
ఇతర దేశాలను ఆక్రమించాలన్న చైనా వక్రబుద్ధే వీటన్నింటికీ ప్రధాన కారణం.
ఇదీ చదవండి:'హిందూ మహా సముద్రంలోనూ చైనా కుట్రలు'
అహంకారపూరిత చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత బలగాలపై తెగబడి సైనికుల ప్రాణాలను హరించడమే కాకుండా... 1988లో చేసుకున్న సీబీఎం(విశ్వాసం పెంపొందించే చర్యల) వ్యవస్థకు సైతం పాతరేసింది.
వాస్తవాధీనరేఖ వెంబడి గస్తీ సహా సరిహద్దు నిర్వహణ కోసం భారత్, చైనా 1993, 1996, 2005, 2013 సంవత్సరాలలో నాలుగు అధికారిక ఒప్పందాలు చేసుకున్నాయి. సరిహద్దులో శాంతి, సుస్థిరతలు కొనసాగించాలని 1993 ఒప్పందంలో నిర్ణయించుకున్నాయి. సైనిక శక్తిని ఉపయోగించరాదని, కవ్వింపులకు పాల్పడరాదని అంగీకారానికి వచ్చాయి. వాస్తవాధీన రేఖను పరస్పరం గౌరవించాలని ఒప్పందం చేసుకున్నాయి.
1996 ఒప్పందంలో నిర్దేశించుకున్న సీబీఎం(విశ్వాసం పెంపొందించే చర్యల) ప్రకారం...
- ఒకరిపై ఒకరు సైనిక శక్తిని ప్రయోగించకూడదు.
- సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరం వరకు ప్రమాదకరమైన రసాయనాలు వాడరాదు.
- రెండు కి.మీ వరకు పేలుళ్లు నిర్వహించకూడదు.
- తుపాకులతో వేటాడటం వంటివి చేపట్టకూడదు.
ఇదీ చదవండి:ఘర్షణకు ముందే మార్షల్ యోధులను పంపిన చైనా!
2005లో స్వీయ నియంత్రణ ఒప్పందాలు
ఏదైనా కారణాల వల్ల వాస్తవాధీన రేఖ వద్ద రెండు దేశాల సైనికులు పరస్పరం ఎదురుపడితే స్వీయ నిగ్రహం పాటించాలని 2005 ఒప్పందంలో నిర్ణయించారు. పరిస్థితిని మరింత తీవ్రతను నివారించేలా అధికారులు చర్యలు తీసుకునేలా ఒడంబడిక కుదుర్చుకున్నారు.
- ముఖాముఖిగా ఎదురుపడ్డ సైనికులు ఆ ప్రాంతంలో కార్యకలాపాలు ఆపేసి తమ స్థావరాలకు వెనుదిరగాలి.
- రెచ్చగొట్టే, కవ్వించే చర్యలకు దూరంగా ఉండి పరస్పరం మర్యాదపూర్వకంగా వ్యవహరించుకోవాలి.
2013 భారత్-చైనా సరిహద్దు ఒప్పందం
- ఇరుపక్షాలు సైనిక శక్తిని అవతలివారిపై ప్రయోగించకూడదు.
- దాడి చేయడానికి సైనిక శక్తిని ఉపయోగించకూడదు
- సాయుధ పోరాటాలను నివారించాలి.
ఇదీ చదవండి:జనాభా కట్టడి పేరిట ముస్లింలపై చైనా క్రూరత్వం
కొంత కాలంగా ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో... ఎల్ఏసీపై స్పష్టత లేని ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేయకూడదని కొత్త నిబంధన జోడించారు.
పెరిగిన డ్రిల్స్
సాధారణంగా ఇరుదేశాల సైనికులు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు వెనక్కి తిరిగి వెళ్లాలని బ్యానర్లు ప్రదర్శించి డ్రిల్ నిర్వహిస్తారు. అవసరమైతే బోర్డర్ పర్సనెల్ మీటింగ్(బీపీఎం)లు నిర్వహిస్తారు. 1996, 2005 ఒప్పందాల తర్వాత ఈ బ్యానర్ డ్రిల్స్ పెరిగిపోయాయి.
నిజానికి సైనికులు ఎదురుపడ్డ చాలా వరకు సందర్భాల్లో ఈ విధానాన్ని క్రమం తప్పకుండా అనుసరించారు. ఎన్నోసార్లు బలగాలు తిరిగి స్థావరాలకు వెళ్లిపోయాయి. చిన్నపాటి ఘర్షణలు, ముష్టియుద్ధాలు వంటి చెదురుమదురు ఘటనలు కొంతవరకు జరిగాయి. అయితే.. వీటిపై బీపీఎంలలో చర్చించుకొని అధికారులు సామరస్యంగా పరిష్కరించుకున్నారు.
ఉల్లంఘనల పర్వం
కానీ గత ఎనిమిదేళ్లలో అనేకసార్లు ఈ నిబంధనల ఉల్లంఘన జరిగింది. రాఖీ నల్లా, ఛుమర్, పాంగొంగ్ సో, దెమ్చొక్, డోక్లామ్ వంటి ప్రాంతాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. నియమాలను అనుసరించి చైనా సైన్యం వెనక్కి వెళ్లేందుకు నిరాకరించడం వల్ల ప్రతిష్టంభన సుదీర్ఘంగా సాగింది. ఆ తర్వాత ఈ నియమాలు క్రమక్రమంగా బలహీనపడుతూ వచ్చాయి.