తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

మహిళలూ ఆ పరీక్షలు తప్పనిసరి!

టీనేజీ అమ్మాయి తరచూ నీరసం అంటే... ఈ వయసులో నీకేంటి అనారోగ్యం అంటాం. ముప్పైలు దాటాక.. నలతగా ఉన్నా ఇది సహజమే కదా డాక్టర్‌ దగ్గరకెందుకులే అని కొట్టిపడేస్తాం. కానీ నిజానికి అమ్మాయిల నుంచి అమ్మమ్మల వరకూ ప్రతి మహిళా తన ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. అందుకోసం తగిన వైద్య పరీక్షలు చేయించుకుంటే ముప్పుని ముందే అరికట్టొచ్చంటారు నిపుణులు. అదెలాగంటే...

women health news, world health day
మహిళలూ ఆ పరీక్షలు తప్పనిసరి!

By

Published : Apr 7, 2021, 11:22 AM IST

రక్తపోటు: రెండేళ్లకొకసారి రక్తపోటు పరీక్ష చేయించుకోవడానికి వెనుకాడకూడదు. అలాగే మధుమేహం, హృద్రోగం, కిడ్నీసమస్యలు ఉండేవారికైతే కనీసం ఏడాదికొకసారి ఈ పరీక్ష తప్పనిసరి.

కొలెస్ట్రాల్‌: హృద్రోగాలకు కారణమయ్యే కొలెస్ట్రాల్‌ను ముందుగానే గుర్తిస్తే మంచిది. దీనికి వయసుతో సంబంధం ఉండదు. అందుకే 19 దాటిన వారంతా ఈ పరీక్ష చేయించుకోవచ్చు. అధిక బరువు, కిడ్నీ సమస్యలు, గుండెజబ్బులున్న వారితోపాటు మెనోపాజ్‌ దశలో ఉన్న మహిళలూ ఏటా ఈ పరీక్షలు చేయించుకోవాలి.

మధుమేహం:ఏటా ఈ పరీక్షను చేయించుకోవాలి. ఎటువంటి సంకేతాలు లేకుండానే మధుమేహం రావడమే కాదు, తెలియకుండా ఒక్కసారే తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల గుండె, కిడ్నీ వంటి ప్రధాన అవయవాలపై ప్రభావం పడుతుంది. అందుకే ఈ పరీక్ష మహిళలకు అత్యంత ముఖ్యం.

దంతం-నేత్రం:ఏటా రెండు సార్లు దంత పరీక్షలు చేయించుకోవాలి. అప్పుడే అనారోగ్యాలు దరిచేరవు. అలానే కంటిచూపులో చిన్న తేడా వచ్చినా తక్షణం నేత్రవైద్యులను కలవాలి. మధుమేహం ఉన్న మహిళలకు ఏటా నేత్రపరీక్షలూ అత్యవసరం.

గర్భాశయం: 30 ఏళ్లు దాటాక ఒకసారి పాప్‌స్మియర్‌ పరీక్ష చేయించుకోవాలి. దీంతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ని ముందుగానే గుర్తించవచ్చు. అలాగే కణితులుంటే వైద్యుల పర్యవేక్షణలో ఏటా స్కానింగ్‌ తప్పనిసరి. అప్పుడే అవి పెరుగుతున్నాయా, వాటి వల్ల ప్రమాదం ఉందా వంటి అంశాలను వైద్యులు గుర్తిస్తారు.

రొమ్ము క్యాన్సర్‌:ప్రతి మహిళ తనకు తానే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే అవకాశం కొంతవరకూ ఉంది. రొమ్ములో ఏమాత్రం చిన్న గడ్డ ఉన్నట్లు తెలిసినా... తక్షణం స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేయించుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఈ క్యాన్సర్‌ను గుర్తించడం వీలు కాదు. అందుకే 30 ఏళ్లు పైబడిన మహిళలందరూ మామోగ్రామ్‌ టెస్ట్‌ చేయించుకోవడం తప్పనిసరి. కుటుంబంలో ఈ తరహా క్యాన్సర్‌ ఎవరికైనా ఉంటే ఇంకాస్త ముందుగానే ఈ పరీక్ష చేయించి, సమస్య ఉంటే దాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవచ్చు.

ఇదీ చూడండి :రాష్ట్రంలో 2 వేలకు చేరువలో కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details