సంసారం చేయట్లేదు.. ఎవరికీ చెప్పొద్దంటున్నాడు!
ఆడపిల్లలు తమ పెళ్లి గురించి, కాబోయే వాడి గురించి.. ఎన్నో కలలు కంటుంటారు. గుండె నిండా ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆ అమ్మాయికి తన భర్త దాంపత్య జీవితానికి పనికి రాడని తెలిస్తే.. ఆ సమయంలో ఆమె ఏం చేయాలి? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఆమె తీసుకునే నిర్ణయానికి చట్టం సాయం చేస్తుందా? భార్యభర్తల మధ్య వైవాహిక సంబంధం లేకపోతే ఆ పెళ్లి చెల్లదని చెప్పే చట్టాలేవైనా ఉన్నాయా?
భార్యాభర్తల మధ్య వైవాహిక సంబంధం లేకపోతే హిందూ వివాహచట్టంలోని సెక్షన్ 12 అనుసరించి ఆ పెళ్లి చెల్లదని తీర్పు ఇవ్వమని కోర్టుని కోరవచ్చు. సెక్షన్ 12(ఎ) ప్రకారం అతను/ఆమె సంసార జీవితానికి పనికిరారనే విషయం డాక్టరు ద్వారా నిరూపించాల్సి ఉంటుంది. మీ భర్త ఒకవేళ అలా పరీక్ష చేయించుకోవడానికి ఇష్టపడకపోతే మీరు సాక్ష్యాధారం సంపాదించలేరు. ముందుగా ఇది సాధ్యం కానప్పుడు కోర్టులో వివాహ రద్దుకోసం పిటిషన్ వేయండి. ఆ తరువాత కోర్టుని అతడికి లైంగిక సామర్థ్య పరీక్ష చేయించమని కోరవచ్చు. ముందు ఈ విషయం అమ్మానాన్నల దృష్టికి తీసుకెళ్లి మధ్యవర్తుల దగ్గర పెట్టండి. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారు కాబట్టి పెళ్లికయిన ఖర్చులు, మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు పరిహారం కింద కొంత మొత్తం చెల్లించమని అడగండి. ఇదంతా అనవసరం అనుకుంటే ఇద్దరి సమ్మతితో సెక్షన్ 13(బి) కింద పరస్పర అనుమతితో విడాకులు తీసుకోవచ్చు. ఏదైనా తొందరగా నిర్ణయం తీసుకుంటే మంచిది.