- రూప ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తోంది. అందాన్ని సంరక్షించుకోవడంలో భాగంగా రెండువారాలకోసారైనా ఫేషియల్ చేయించుకోవడం ఆమెకు అలవాటు. అయితే లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెలల నుంచి పార్లర్లన్నీ మూతపడడంతో సౌందర్య నిపుణుల సలహా మేరకు ఇంట్లోనే స్వయంగా ఫేషియల్ చేసుకుంటోంది.
- గీతకు అవాంఛిత రోమాల సమస్య ఎక్కువ. వీటిని తొలగించుకోవడానికి పార్లర్‌ను ఆశ్రయిస్తుంటుందామె. అయితే పార్లర్లన్నీ గత రెండు నెలలుగా మూసే ఉండడంతో ఇంట్లోనే వ్యాక్సింగ్ చేసుకుంటోంది. అది సరిగ్గా వర్కవుట్ కాకపోవడంతో ఎప్పుడెప్పుడు పార్లర్లు తెరుస్తారా అని మొన్నటిదాకా ఎదురుచూసింది.
వీళ్లే కాదు.. చాలామంది అమ్మాయిలు, మహిళలు తమ బ్యూటీ ట్రీట్‌మెంట్స్ కోసం బ్యూటీ పార్లర్లను, స్పా సెంటర్లను ఆశ్రయించడం సహజమే. అయితే లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా మూత పడిన సెలూన్లన్నీ లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా క్రమంగా తెరుచుకుంటున్నాయి. అయితే ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో పార్లర్స్‌కి వెళ్లి అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకునే క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
పార్లర్‌లో పదిలంగా..!
- కరోనా రాకతో మాస్కులు మన జీవితంలో భాగమయ్యాయి. కాబట్టి పార్లర్‌కు వెళ్లినా తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే.
- ఆఖరి నిమిషంలో పార్లర్‌కు వెళ్లడం, ఆదరాబాదరాగా బ్యూటీ ట్రీట్‌మెంట్లు తీసుకోవడం.. చాలామందికి అలవాటు. అయితే ఈ కరోనా సమయంలో ఇలాంటి ఆదరాబాదరా పనులకు చెక్ పెట్టాల్సిందే. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో చేయించుకునే ఇలాంటి బ్యూటీ ట్రీట్‌మెంట్ల వల్ల బ్యూటీ పరికరాలు సరిగ్గా శానిటైజ్ చేసి ఉండచ్చు.. ఉండకపోవచ్చు.. తద్వారా లేనిపోని సమస్యలను మనకు మనమే కొనితెచ్చుకున్నవారమవుతాం.
- అందుకే ఈ ప్రతికూల పరిస్థితుల్లో.. మీకు వీలుంటే అపాయింట్‌మెంట్ ద్వారా సర్వీసులు అందించే బ్యూటీ పార్లర్లను ఎంచుకోవడం ఉత్తమం. ఈ క్రమంలో పార్లర్‌కు వెళ్లాలనుకుంటున్న ఒకట్రెండు రోజుల ముందుగానే అపాయింట్‌మెంట్ తీసుకుంటే సమయానికి అక్కడికి చేరుకోవచ్చు.. తద్వారా పార్లర్‌లో ఎదురుచూపులకు తెరదించచ్చు.. అలాగే సామాజిక దూరం కూడా పాటించచ్చు.
- మీరు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే ముందే అక్కడి శానిటైజేషన్ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు. ఈ క్రమంలో పార్లర్‌లో నాణ్యమైన శానిటైజర్ అందుబాటులో ఉందో, లేదో తెలుసుకోండి. అలాగే పార్లర్‌లోని వస్తువులన్నీ.. అంటే హెయిర్‌బ్రష్‌లు, దువ్వెనలు, కత్తెర వంటివి తరచూ డిస్‌ఇన్ఫెక్ట్ చేస్తున్నారో లేదో ముందే కనుక్కోండి. ఒకవేళ మీకు నమ్మకం కలగకపోతే మీ అపాయింట్‌మెంట్ సమయం కంటే ఓ అరగంట ముందే వెళ్లి మీ సమక్షంలోనే వాటిని క్రిమి సంహారకాలతో శుభ్రం చేయించుకొని ఆపై బ్యూటీ ట్రీట్‌మెంట్ తీసుకోవడం మరీ మంచిది.
- హెయిర్‌కట్, ఫేషియల్, ఐబ్రోస్, వ్యాక్సింగ్, హెయిర్ మాస్క్ ట్రీట్‌మెంట్స్.. ఇలా మీరు పార్లర్‌లో చేయించుకునే ఏ చికిత్స అయినా సరే.. ముందుగా బ్యుటీషియన్లు చేతులు శుభ్రం చేసుకునేలా చూడాలి. ఆ తర్వాతే ట్రీట్‌మెంట్ మొదలుపెట్టాలి. అలాగే మీరూ పార్లర్‌కు వెళ్లగానే చేతుల్ని శానిటైజ్ చేసుకోవడం మరవద్దు.
- వ్యాక్సింగ్, మసాజ్, హెయిర్‌కట్, హెయిర్‌కేర్.. వంటివి చేయించుకునే సమయంలో వేసుకునే గౌన్లు శుభ్రంగా ఉతికినవి అయితేనే తీసుకోండి. ఒకసారి వాడి పడేసే డిస్పోజబుల్ గౌన్లు అయితే ఏ సమస్యా ఉండదు. ఈ విషయంలో మీకు మరీ డౌట్‌గా అనిపిస్తే.. మీరే ఇంటి నుంచి స్వయంగా టవలో లేదంటే గౌనో తీసుకెళ్లడం మరీ మంచిది.
- ఇక ఫేషియల్స్ వంటి బ్యూటీ ట్రీట్‌మెంట్ల కోసం పార్లర్స్‌లో బెడ్స్ ఉపయోగించడం తెలిసిందే. వాటిపై ఉండే బెడ్‌షీట్స్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఇతరులకు ట్రీట్‌మెంట్ పూర్తై మీ వంతు వచ్చినప్పుడు బెడ్‌పై శానిటైజర్ స్ప్రే చేయడం, కొత్త బెడ్‌షీట్స్ వేయమని అడగడానికి మొహమాటపడకూడదు.
- కొన్ని పార్లర్స్‌లో కస్టమర్ల కోసం పత్రికలు, మ్యాగజీన్లు, జర్నల్స్.. వంటివి అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలో కొందరు ఓవైపు బ్యూటీ ట్రీట్‌మెంట్స్ చేయించుకుంటూనే.. మరోవైపు ఆ పుస్తకాలు, పేపర్లు తిరగేస్తుంటారు. ఈ కరోనా సమయంలో అలాంటి వాటిని టచ్ చేయకపోవడమే మంచిది. ఒకవేళ బోర్‌గా ఫీలైతే మీ చేతిలో ఎలాగూ మొబైల్ ఉండనే ఉంటుంది.
- ఖర్చు తగ్గుతుందనే ఉద్దేశంతో ఏదో ఒక పార్లర్ అని ఎంచుకోకుండా.. సురక్షిత పద్ధతులను పాటించే వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఈ క్రమంలో మీ ఇంటికి దగ్గర్లోని లేదా మీకు తెలిసిన వారి పార్లర్ అయితే ఇంకా మంచిది. వారికి ఫోన్ చేసి కస్టమర్లు లేనప్పుడు వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకోవచ్చు.
- మనం పార్లర్స్‌కి వెళ్లే అవసరం లేకుండా మన ఇంటి వద్దకే వచ్చి బ్యూటీ సేవలు అందించే సంస్థలు కూడా కొన్నుంటాయి. అలాంటి వాటి ద్వారా మన ఇంట్లోనే సురక్షితమైన వాతావరణంలో సౌందర్య సేవలు పొందచ్చు.
- అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి పార్లర్స్‌లో ఎలాంటి బ్యూటీ ట్రీట్‌మెంట్ తీసుకున్నా సరే.. రసాయనాలు లేని, మీ చర్మతత్వానికి నప్పే సహజసిద్ధమైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా మంచిది.
ఇంటికొచ్చాక ఇలా!
పార్లర్‌కు వెళ్లినప్పుడే కాదు.. ఇంటికొచ్చాక కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఈ క్రమంలో ధరించిన మాస్క్ రీయూజబుల్ అయితే దాన్ని సబ్బు నీటితో ఉతికి ఎండలో ఆరేయాలి. ఒకవేళ డిస్పోజబుల్‌ది అయితే మూత ఉన్న చెత్త డబ్బాలో పడేయాలి.
- మీ వెంట తీసుకెళ్లిన పర్సు, హ్యాండ్‌బ్యాగ్, ఇతర వస్తువులన్నీ శానిటైజ్ చేశాకే ఇంట్లోకి తీసుకురావాలి.
- మీరు వేసుకున్న దుస్తుల్ని, వెంట తీసుకెళ్లిన టవల్స్, గౌన్లు.. వంటివి కూడా డిటర్జెంట్ నీటిలో నానబెట్టి ఉతికేయాలి. వీటిని ఎండలో ఆరేయాలి.
- ఆపై తలస్నానం చేయాలి.
- ఐతే ఫేషియల్స్, హెయిర్‌కేర్ ట్రీట్‌మెంట్స్, వ్యాక్సింగ్.. వంటివి చేయించుకున్నప్పుడు చర్మం, జుట్టు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్నుంటాయి.. ఉదాహరణకు.. ఫేషియల్ చేయించుకున్న వెంటనే రసాయనాలున్న సబ్బు వాడకూడదని చెబుతుంటారు బ్యుటీషియన్లు. ఇలాంటి విషయాల్లో మీకేమైనా సందేహాలుంటే ఇంటికొచ్చే ముందే వారిని అడగడం మంచిది.