ఎదుటివారి మీద ఫిర్యాదులు చెప్పే పిల్లలెప్పుడూ.. ఇతరుల తప్పులను ఎంచి చూపిస్తూ ఉంటారు. అంటే ప్రతికూల ధోరణిలోనే ఆలోచిస్తూ... ఇతరుల్లోని లోపాలను ఎంచడానికే ప్రయత్నిస్తుంటారు. దీంతో సాధారణంగా ఇతరులెవరూ వీళ్లతో ఆడటానికి ముందుకు రారు. దీనివల్ల వీళ్లు ఒంటరిగా మిగిలిపోతుంటారు. దీంతో మానసిక సమస్యలకు గురవుతారు.
మీ పిల్లలు చాడీలు చెబుతున్నారా.. ఓ కంట కనిపెట్టాల్సిందే!
‘మిట్టూ నన్ను వెక్కిరిస్తున్నాడు...’ ‘చింటూ నన్ను బాల్ వేయనీయడం లేదు.’ ‘ హనీ నా పెన్సిల్ తీసుకుని ఇవ్వడం లేదు... వీళ్లెవరితోనూ నేను ఆడనంటే ఆడను’ అంటూ కొంతమంది పిల్లలు ఎప్పుడూ ఎదుటివాళ్ల మీద చాడీలు చెబుతూనే ఉంటారు. ఇలాంటివారిని ఓ కంట కనిపెడుతూనే ఉండాలి.
ఎదుటివారిలో ప్రతికూలాంశాలను గురించే కాకుండా సానుకూలాంశాలనూ గుర్తించేలా ప్రోత్సహించాలి. ఎదుటివాళ్ల మీద మీ పిల్లలు ఫిర్యాదులు చెప్పగానే విని ఊరుకోకుండా.. అంతకుముందు వాళ్లు మీ పిల్లలకు సాయపడ్డ సందర్భాన్నీ, ఇద్దరూ కలసి చక్కగా ఆడుకున్న రోజులనూ గుర్తుచేయాలి.
పిల్లలు సాధారణంగా ఎదుటివాళ్లవల్ల తలెత్తిన సమస్యను మాత్రమే ఎత్తి చూపిస్తుంటారు. అలాకాకుండా వాళ్లు దాని వెనుక ఉన్న కారణాన్ని గురించి ఆలోచించేలా ప్రోత్సహించాలి. అలాగే పరిష్కారం దిశగానూ వాళ్లను ఒక్కసారి ఆలోచించమనాలి. పిల్లల ప్రతికూల ఆలోచనలను మొగ్గలోనే తుంచేసి.. సానుకూలంగా ఆలోచించే దిశగా వాళ్లను చిన్నతనం నుంచీ ప్రోత్సహించాలి.