తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఎసిడిటీ... గతంలో కేవలం పెద్ద వయసు వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య నేడు అందరినీ వేధిస్తోంది. అందుకు మన ఆహారపు అలవాట్లు, జీనవశైలే కారణమని వేరే చెప్పక్కర్లేదు. ప్రత్యేకించి యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయి నిరంతరం బిజీబిజీగా గడిపే నగరవాసులే ఈ సమస్య బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. హెల్దీ డైట్‌ తీసుకోవడం, వ్యాయామాలు చేయడం లాంటి కొన్ని అలవాట్లను జీవనశైలిలో భాగం చేసుకుంటే ఎసిడిటీ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చంటున్నారు.

tips to cure acidity, acidity issues, health tips
ఎసిడిటీ నుంచి ఉపశమనం, ఎసిడిటీ తగ్గేందుకు చిట్కాలు, ఎసిడిటీ, హెల్త్ టిప్స్

By

Published : Apr 20, 2021, 12:32 PM IST

వీటిని దూరం పెట్టండి!

ఎసిడిటీ, అజీర్తి, కడుపుబ్బరం లాంటి సమస్యల నుంచి రక్షణ పొందాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను దూరం పెట్టాల్సిందేనంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ప్రత్యేకించి బయట దొరికే స్ట్రీట్‌ ఫుడ్స్‌, మసాలా పదార్థాల జోలికి అసలు వెళ్లొద్దని వారు సూచిస్తున్నారు. దీంతో పాటు ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలను కూడా అందిస్తున్నారు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి.


తిన్న వెంటనే అలా పడుకోకండి!

  • మసాలా దట్టించిన, నూనెలో వేయించిన ఆహార పదార్థాల (చిప్స్‌, ఫాస్ట్‌ఫుడ్, ఫ్రైడ్‌ ఐటమ్స్‌)కు దూరంగా ఉండాలి. అదేవిధంగా ఎక్కువ పులుపు కలిగిన, పులియ బెట్టిన పదార్థాలు కూడా తినకపోవడం మంచిది.
  • పుల్లటి పండ్లను సాధ్యమైనంతవరకు తినకండి.
  • ఏదైనా అతిగా తినకండి. ఎక్కువ సేపు ఆకలితో ఉండకండి. బ్రేక్‌ఫాస్ట్‌ విషయంలో సమయ పాలన పాటించండి. లంచ్ అసలు మిస్‌ కావద్దు. రాత్రిపూట డిన్నర్‌ను కూడా త్వరగా ముగించండి.
  • వెల్లుల్లి, ఉప్పు, నూనె, మిరపకాయలు... వంటి పదార్థాలను మితంగానే ఉపయోగించడం ఉత్తమం. సాధ్యమైనంతవరకు నాన్‌ వెజ్‌ వంటకాలను తినడం తగ్గించాలి.
  • డిన్నర్‌ పూర్తయిన వెంటనే నిద్రకు ఉపక్రమించకూడదు. ప్రత్యేకించి భోజనం చేసిన వెంటనే వెల్లకిలా పడుకోకండి. ఇలాంటి సమయాల్లో ఎడమవైపుకి తిరిగి పడుకోవడం మంచిది. జీర్ణక్రియ సాఫీగా జరిగి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వేధించవు.
  • టీ, కాఫీ, స్మోకింగ్, ఆల్కహాల్, వంటి వాటికి దూరంగా ఉండాలి.
  • ఇక అన్నిటికంటే ముఖ్యమైన నియమం ఏంటంటే... ఒత్తిడి, ఆందోళనలను దరిచేరనీయకూడదు.


ఈ చిట్కాలను పాటించండి!

  • కొత్తిమీర జ్యూస్‌ను తరచుగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
  • భోజనం చేసిన ప్రతిసారీ ఓ అర టీ స్పూన్‌ సోంపు గింజలను నమలడం అలవాటు చేసుకోవాలి.
  • మధ్యాహ్న సమయంలో సోంపు షెర్బత్ (సోంపు+ పటికబెల్లం)ను తీసుకున్నా మంచి ఫలితముంటుంది.
  • ఉదయాన్నే పరగడుపునే కొబ్బరి నీళ్లను తాగితే ఎసిడిటీ సమస్య నుంచి త్వరగా బయటపడచ్చు.
  • రాత్రంతా ఎండు ద్రాక్షను నానబెట్టి మరుసటి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి.
  • రాత్రి పడుకోబోయే ముందు ఒక టీస్పూన్‌ ఆవు నెయ్యిని గోరువెచ్చని పాలతో కలిపి తీసుకోండి. దీని వల్ల నిద్రలేమి, మలబద్ధకం లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.
  • రోజ్‌ వాటర్‌, పుదీనా జ్యూస్‌లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్కువ శాతంలో నీరు అందుతుంది. ఫలితంగా జీవక్రియల రేటు మెరుగుపడుతుంది.
  • దానిమ్మ, అరటి, యాపిల్స్‌, రేగు పండ్లు, ఎండు ద్రాక్ష, ఆప్రికాట్లు, కొబ్బరి మొదలైన వాటితో పాటు కొన్ని రకాల సీజనల్‌ పండ్లను రెగ్యులర్‌గా ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఇవి కూడా!

  • 15-20 మిల్లీ లీటర్ల చొప్పున రోజుకు రెండుసార్లు ఆమ్లా (ఉసిరి) జ్యూస్‌ను తీసుకుంటే ఎసిడిటీ లాంటి జీర్ణ సంబంధ సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.
  • రోజుకు రెండు సార్లు భోజనానికి ముందు అర టీస్పూన్ ఉసిరి కాయ పొడిని తీసుకున్నా మంచి ఫలితముంటుంది.
  • కలబంద రసాన్ని 20 మిల్లీ లీటర్ల చొప్పున ఉదయం, సాయంత్రం ఖాళీ కడుపుతో తాగాలి.
  • తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
  • మంచి నీరు ఎక్కువగా తాగాలి.
  • ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవాలి.
  • యోగా, ప్రాణాయామం, ధ్యానం, వ్యాయామాలు... వంటి అలవాట్లను జీవనశైలిలో భాగం చేసుకోవాలి.

ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారుగా..! మరి మీరు కూడా వీటిని దృష్టిలో ఉంచుకోండి. అవసరమైతే పాటించండి.

ABOUT THE AUTHOR

...view details