రోజంతా చురుగ్గా పని చేయాలంటే పోషక విలువలున్న బ్రేక్‌ఫాస్ట్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం తప్పనిసరి. అయితే సమయం లేదనో, వివిధ కారణాల వల్లనో చాలామంది ప్రాసెస్డ్ ఫుడ్, ‘రెడీ టు ఈట్’ ఫుడ్స్‌ను అల్పాహారంగా తీసుకుంటుంటారు. దీనివల్ల సమయం కలిసొస్తుంది కానీ శరీరానికి మాత్రం చేటు తప్పదు. వీటి బదులు ఇంటి వద్ద తయారుచేసిన బ్రేక్‌ఫాస్ట్‌ను వేడివేడిగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. పోషకాలు సమృద్ధిగా ఉన్న పోహా, ఉప్మా వంటి సంప్రదాయ వంటకాలను బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవడం ఉత్తమం.
పండ్లు, కూరగాయలు
సులభంగా, ఆరోగ్యకరమైన పద్ధతుల్లో బరువు తగ్గాలంటే రోజువారీ డైట్‌లో పండ్లు, కూరగాయలు భాగం చేసుకోవాల్సిందేనంటున్నారు పోషకాహార నిపుణులు. వీటిలో విరివిగా లభించే ఫైబర్, పీచు పదార్థాలు జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఫలితంగా బరువు తగ్గడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరతాయి.
గింజలు, నట్స్
రోజూ గుప్పెడు నట్స్, గింజలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రొటీన్లు సమృద్ధిగా అందుతాయి. ఇవి శరీర బరువును ఏ మాత్రం పెంచకుండా ఆకలి కోరికలను అదుపు చేస్తాయి. అయితే క్యాలరీలు తక్కువగా ఉండే నట్స్ తీసుకునే విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి.