మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో ఇద్దరు మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి పక్కనే ఐదేళ్ల చిన్నారి మృతదేహం ఉంది. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించిన పోలీసులు... మహిళల వద్ద లభించిన సెల్ ఫోన్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సెల్ ఫోన్లలోని లాస్ట్కాల్ను సంప్రదించగా... మృతులు కరీంనగర్ పట్టణంలోని పక్కపక్క కాలనీల్లో ఉంటున్న అనూష, సుమతిగా గుర్తించారు. చనిపోయిన బాలిక అనూష కుమార్తె.
వివాదంతో శామీర్‌పేటకు
మృతిచెందిన ఇద్దరు మహిళలు కూడా వివాహితులని తేల్చిన పోలీసులు వారి భర్తలతో మాట్లాడగా అసలు విషయాలు తెలుసుకున్నారు. ఈ నెల 9న కరీంనగర్ పట్టణలో కరోనా నేపథ్యంలో రేషన్ బియ్యం కోసం వెళ్లిన అనూష, సుమతిలు ఆలస్యంగా రావడంతో రెండు కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో కోపంతో ఈ నెల10న అనూష, సుమతిలు కరీంనగర్ నుంచి శామీర్ పేట వచ్చారు. అక్కడి నుంచి బండ్లగూడలో తెలిసిన చర్చి పాస్టర్ రత్నంబాబు ద్వారా గబ్బిలాలపేటకు చేరుకున్నారు. అక్కడే చర్చిలో రెండు రోజులపాటు ఉన్నారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో చర్చి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. తెల్లారే సరికి డంపింగ్ యార్డు సమీపంలోని పొలం వద్ద ఆత్మహత్య చేసుకున్నారు.