రోజుకో మలుపు తిరుగుతున్న బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. వేధించడం, మోసం చేయడం వల్ల మనస్తాపానికి గురైన శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. కాకినాడ గొల్లప్రోలుకు చెందిన శ్రావణి... సీరియల్లో నటించడానికి హైదరాబాద్‌కు వచ్చి... కుటుంబంతో కలిసి మధురానగర్‌లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో సాయికృష్ణారెడ్డితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
సన్నిహితంగానే..
ఆ తర్వాత సినీ నిర్మాత అశోక్రెడ్డితోనూ శ్రావణి సన్నిహితంగా మెలిగింది. ఇదే క్రమంలో ఏడాది క్రితం టిక్‌టాక్ ద్వారా శ్రావణికి దేవరాజ్ రెడ్డి పరిచయమయ్యాడు. వీరిద్దరూ పెళ్లిచేసుకోవాలని భావించారు. శ్రావణికి వేరేవారితో సంబంధం ఉన్నట్లు గుర్తించిన దేవరాజ్... ఆమెను దూరంగా ఉంచాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఇద్దరిపై దాడి...
కొద్దిరోజులు దూరంగా ఉన్న శ్రావణి, దేవరాజ్ ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈనెల 7న శ్రావణి, దేవరాజ్ రెస్టారెంట్లో ఉన్న విషయం తెలుసుకున్న సాయికృష్ణారెడ్డి అక్కడికి వెళ్లి దేవరాజుపై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన శ్రావణిపైనా చేయిచేసుకొని ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు.