తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఈ పెళ్లి నాకొద్దు.. అధికారుల్ని ఆశ్రయించిన బాలిక

ఓ బాలిక ఇటీవలే పదో తరగతి పూర్తి చేసింది.. ఉన్నత చదువులు చదవాలనుకుంది.. తల్లిదండ్రులు నిర్ణయించిన పెళ్లి అందుకు అడ్డొచ్చింది. వివాహాన్ని ఆపి, చదువుకు దారి చూపాలని ఆ బాలిక మహిళా, శిశు సంక్షేమ శాఖను ఆశ్రయించింది. షీటీం సహకారంతో బాలికను శంషాబాద్‌కు పంపించి, అక్కడ సఖి బృందానికి అప్పగించారు. అయితే బాలిక తల్లిదండ్రుల వాదన మరోలా ఉంది.

ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ  అధికారుల్ని ఆశ్రయించిన బాలిక
ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ అధికారుల్ని ఆశ్రయించిన బాలిక

By

Published : Jul 10, 2020, 12:05 PM IST

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణం జానంపేటలోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక(16)కు తల్లిదండ్రులు వివాహం చేయాలని నిర్ణయించారు. షాబాద్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తితో మే నెలలో నిశ్చితార్థం చేశారు. జులైౖ చివరి వారంలో పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. ఇటీవలే పదో తరగతి పూర్తి చేసిన ఆ బాలికకు ఇప్పుడే వివాహం ఇష్టం లేదు. తానింకా చదుకోవాలని తల్లిదండ్రులకు వివరించినా పట్టించుకోలేదు. దీంతో తన గోడును బంధువులు, స్నేహితులకు విన్నవించింది. వారు హెల్ప్‌లైన్‌ ద్వారా సంబంధిత అధికారులకు తెలిపారు. సమాచారం అందుకున్న షాద్‌నగర్‌ ఐసీడీఎస్‌ సీడీపీఓ నాగమణి గురువారం బాలిక ఇంటికి వెళ్లి మాట్లాడారు. తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటకు వెళ్లడంతో ఇరుగుపొరుగు వారికి చెప్పి బాలికను కార్యాలయానికి తీసుకెళ్లారు.

ఈ విషయాన్ని సీడీపీఓ ఉన్నతాధికారులకు వివరించారు. షీటీం సహకారంతో బాలికను శంషాబాద్‌కు పంపించి, అక్కడ సఖి బృందానికి అప్పగించారు. ప్రస్తుతానికి బాలికను సఖి ఆశ్రమంలో చేర్పించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. తల్లిదండ్రుల వాదన మరోలా ఉంది. పదో తరగతి ధ్రువపత్రం ఆధారంగా తమ కుమార్తెకు 18 ఏళ్లు నిండాయని, మరో వ్యక్తిని ఇష్టపడుతున్న కారణంగా పెళ్లికి నిరాకరిస్తున్నట్లు వారు చెబుతున్నారు. దీనిపై సీడీపీఓ స్పందిస్తూ.. అంగన్‌వాడీ రికార్డులు, ఆధార్‌ కార్డు ప్రకారం బాలిక వయసు పదహారేళ్లని పేర్కొన్నారు. ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని, అడ్డుకోవాలని బాలిక లిఖిత పూర్వకంగా కోరినట్లు ఆమె తెలిపారు.

ఇవీ చూడండి:షేక్​పేట ఘటనలో కొత్త కోణం.. ఏసీబీ అధికారులకే మస్కా..

ABOUT THE AUTHOR

...view details