హైదరాబాద్‌లోని మాదాపుర్ కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన యువకులు శివ (20), ప్రశాంత్(22), విజయ్(22)... హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో ఉంటున్నారు. ముగ్గురూ విద్యార్థులే. సూరారంలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో శివ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం అర్థరాత్రి సమయంలో యూసుఫ్‌గూడలోని తమ గదిలో ప్రశాంత్ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు.
కేబుల్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం... ఆలస్యంగా వెలుగులోకి...
హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్డి రక్తమోడింది. మద్యం మత్తు వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. వేకువజాము వరకు జన్మదిన వేడుకలు జరుపుకుని... ముగ్గురు స్నేహితులు కలిసి ద్విచక్రవాహనంపై కేబుల్ బ్రిడ్జి వెళ్లాడు. మద్యం మత్తు... అందులో అతి వేగం... వెరసి స్నేహితుని జన్మదినం రోజే ఆ యువకుని జీవితంలో చివరి రోజైంది.
అనంతరం వేకువజామున మూడున్నర గంటల సమయంలో శివ, ప్రశాంత్, విజయ్... జూబ్లీహిల్స్ రోడ్ నం.45 నుంచి ఐటీసీ కోహినూర్ వైపు ద్విచక్రవాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వచ్చారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి ఆనుకుని ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జిపై చివర్లో వారి వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టగా ముగ్గురికి గాయాలయ్యాయి. వాహనం నడిపిస్తున్న శివకు... తీవ్ర గాయాలయ్యాయి. అతను మెడికవర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రశాంత్, విజయ్‌కు గాయాలు కాగా... చికిత్స పొందుతున్నారు.
ముగ్గురు యువకులు మద్యం మత్తులో ఉన్నారని... అతివేగంతో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొందని పోలీసులు తెలిపారు. వాహనం నడుపుతున్న శివకు డ్రైవింగ్ లైసెన్స్ లేదన్నారు. అయినప్పటికీ శివను వాహనం నడిపేలా ప్రోత్సహించి ప్రమాదానికి కారణమైన ప్రశాంత్, విజయ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. శివ మరణించాకా... అతని కళ్లను దానం చేశారు.