సెర్బియా పోలీసుల అదుపులో నిమ్మగడ్డ - రస్‌ఆల్‌ఖైమా
14:41 July 30
ప్రముఖ వ్యాపార వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియాలో ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వ్యాన్‌పిక్ ప్రాజెక్టులో భాగంగా రస్‌ఆల్‌ఖైమా ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని వ్యాన్‌పిక్ ప్రాజెక్టులో…. రస్‌ఆల్‌ఖైమా దాదాపుగా 750 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. రస్‌ఆల్‌ఖైమా పెట్టుబడులతో పాటు నిమ్మగడ్డ ప్రసాద్ నేతృత్వంలోని కొన్ని సంస్థలు ఆ రెండు జిల్లాల్లో 11 వేల ఎకరాల భూములు కొనుగోలు చేశాయి. పోర్టు నిర్మాణంతో పాటు ఆ భూముల్లో పరిశ్రమలు స్థాపించాలని అప్పట్లో ప్రణాళిక రూపొందించారు. అయితే కేసులు, అరెస్ట్‌లతో ఆ ప్రాజెక్టులు వివాదాల్లో చిక్కుకున్నాయి. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో భాగంగా ఆ భూములపై సీబీఐ కేసు నమోదు చేయటం, నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ కావటం, ఈడీ ఆ భూములను స్వాధీనం చేసుకోవటం వల్ల రస్‌ఆల్‌ఖైమా పెట్టిన పెట్టుబడులు స్తంభించిపోయాయి. జగన్ కంపెనీల్లో నిమ్మగడ్డ పెట్టుబడులు పెట్టింది...ఈ ప్రాజెక్టులకు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి సహకరించటం వల్లేనని దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపటంతో మొత్తం వ్యవహారం వివాదంలో చిక్కుకుంది. ఇటీవల తమ వ్యాపార విస్తరణలో భాగంగా నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా వెళ్లినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అప్పటికే వ్యాన్‌పిక్ సంస్థ అవకతవకలపై అక్కడి పోలీసులకు రస్‌ఆల్‌ఖైమా ఫిర్యాదు చేయడం వల్ల నిమ్మగడ్డ ప్రసాద్‌ను వారు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.