తెలంగాణ

telangana

By

Published : Nov 27, 2020, 4:31 PM IST

ETV Bharat / jagte-raho

రైతులను నిండా ముంచిన నకిలీ విత్తనాలు

రైతులకు ఎంత అవగాహన కల్పించినా ఏటా ఏదో ఒక చోట నకిలీ విత్తనాలతో మోసపోతూనే ఉన్నారు. దళారుల మాటలు నమ్మి అన్నదాతలు నిండా మునుగుతున్నారు. ఇలాంటి ఘటనే నిర్మల్ జిల్లా చుచుంద్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపుగా పెరిగిన పత్తి చేనులో... పంటకాలం అయిపోవచ్చినా కాత లేదు, పూత లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

farmers lose due to  fake cotton seeds in nirmal
రైతులను నిండా ముంచిన నకిలీ విత్తనాలు

నకిలీ విత్తనాలు ఏటా పత్తి రైతులను నట్టేట ముంచుతున్నాయి. వ్యాపారులను నమ్మి నకిలీ విత్తనాలను కొనుగోలు చేసిన ఘటన నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని చుచుంద్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపుగా పెరిగిన పత్తి చేనులో కాత, పూత రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుచుంద్‌కు చెందిన 24 మంది రైతులు ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన 67 ప్యాకెట్ల పత్తి విత్తనాలు కొనుగోలు చేశారు. వానాకాలం సాగులో భాగంగా జూన్ 12 నుంచి 19 లోపు విత్తనాలు వేయగా... నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పూత, కాత రాలేదన్నారు.

మోసపోయామని గ్రహించిన రైతులందరూ వ్యాపారిని ఆశ్రయించడంతో విత్తన కంపెనీ ప్రతినిధులు పత్తి చేనుని సందర్శించారు. కాత ఆలస్యంగా వస్తుందని, సమయం ఉందని నమ్మించారని అన్నదాతలు పేర్కొన్నారు. ఇప్పటివరకూ కాయలు రాకపోవడంతో వ్యాపారులను నిలదీశారు. పత్తి చేనుని వీడియోలు తీసి... కంపెనీ ఉన్నతాధికారులకు పంపించారు. ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు పరిహారం ఇస్తామని చెప్పి... కనిపించకుండా పోయారని రైతులు వాపోయారు. ఫోన్‌ చేసినా స్పందించడం లేదని విచారం వ్యక్తం చేశారు.

పత్తి పంట కాలం అయిపోవచ్చినందున... చేసేది లేక చివరకు వ్యవసాయ అధికారులను రైతులు ఆశ్రయించారు. అన్నదాతల ఫిర్యాదుతో ఏఈవో సౌమ్య పంట క్షేత్రాలను సందర్శించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఖమ్మం జిల్లాలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ...

ABOUT THE AUTHOR

...view details