నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం భగ్యోగప సముద్రం తండాలో ధనావత్ దర్దీ అనే మహిళా రైతుకు, ఆ గ్రామ సర్పంచ్ శంకర్ కుటుంబానికి మధ్య భూతగాదాలు జరుగుతున్నాయి. పొలం గట్టు వద్ద వచ్చిన వివాదం క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది.
మహిళా రైతుపై సర్పంచ్ దాడి... రక్షణ కల్పించాలని వేడుకోలు
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం భగ్యగోపసముద్రం తండాలో మహిళా రైతుపై ఆ గ్రామ సర్పంచ్ దాడి చేశారు. ఈ ఘటనలో మహిళ తలకు గాయమవడం వల్ల స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
తన కుమారుడితో కలిసి పొలంలో పనులు చేస్తుండగా.. సర్పంచ్ కుమారుడు తమతో వాగ్వాదానికి దిగి కొట్టారని మహిళా రైతు తెలిపారు. తమ పొలంలో వేసిన బోరులో సమృద్ధిగా నీరు రావడం చూసి ఓర్వలేకే పక్క పొలానికి చెందిన సర్పంచ్ కుటుంబం తమతో గొడవకు దిగుతోందని ఆరోపించారు.
ఆదివారం రోజున ఇంటి వద్ద కూడా నానా దుర్భాషలాడుతు సర్పంచ్ కుటుంబం తమపై కర్రలతో దాడి చేసిందని చెప్పారు. తమ ఇంటి స్థలంలో ఇసుక, రాళ్లు వేసి తమను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. వెంటనే పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.